తెలుగు స్టార్ హీరోలలో ప్రిన్స్ మహేశ్ బాబు చేస్తునన్ని వాణిజ్య ప్రకటనలు మరే స్టార్ హీరో చేయడం లేదు. ఆ మధ్యలో ‘అతిథి’ సినిమా తర్వాత మహేశ్ బాబు ఏకంగా మూడేళ్ళ గ్యాప్ తీసుకున్నాడు. 2007 అక్టోబర్ లో ‘అతిథి’ విడుదలై పరాజయం పొందాక, సినిమా నటనకు దూరంగా ఉన్న మహేశ్ కేవలం యాడ్స్ నటిస్తూనే మూడేళ్ళు గడిపేశాడు. అతని అభిమానులకు అవే కాస్తంత ఓదార్పును కలిగించాయి. ‘అతిథి’ వచ్చిన మూడేళ్ళకు గానీ ‘ఖలేజా’ మూవీ రిలీజ్ కాలేదు. అప్పటి నుండి ప్రకటనలపై ఆసక్తిని చూపుతున్న మహేశ్ బాబు టాప్ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా మారిపోయాడు.
మల్టీ నేషన్స్ కంపెనీలకు సౌత్ లో అతనే కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. మరో విశేషం ఏమంటే… ఈ మధ్య ఉత్తర భారతంలోనూ మహేశ్ బాబు ప్రకటనలే ప్రసారం అవుతున్నాయి. తాజాగా ఓ పాన్ మసాలా యాడ్ లో మహేశ్ తో కలిసి టైగర్ ష్రాఫ్ సైతం నటించాడు. ఇదిలా ఉంటే… మొన్నటి వరకూ ది మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ కు అక్కినేని అఖిల్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. తాజాగా ఆ ప్లేస్ నూ మహేశ్ బాబు చేజిక్కించుకున్నాడు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే… మొదట మహేశ్ బాబును సంప్రదించి, అతను కుదరదంటే మరో హీరో దగ్గరకు వాణిజ్య సంస్థలు వెళుతున్నాయనిపిస్తోంది. ఏదేమైనా… గత దశాబ్దకాలంగా సౌత్ లో వాణిజ్య ప్రకటనల్లో మహేశ్ బాబు నంబర్ వన్ పొజిషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడంటే అతిశయోక్తి కాదు!
