కళల కాణాచిగా పేరొందిన తెలుగు ప్రాంతాలలో తెనాలి కూడా స్థానం సంపాదించింది. ఇక ఆ ఊరి అందం చూసి ‘ఆంధ్రా ప్యారిస్’ అన్నారు ఇంగ్లీష్ జనం. సావిత్రి, జమున, జగ్గయ్య, గుమ్మడి వంటి ప్రముఖ నటీనటులు ఈ ప్రాంతంవారే! అదే నేలపైనే మధురగాయని యస్.జానకి కూడా కన్ను తెరిచారు. చిన్నప్పటి నుంచీ అందరినీ తన మధురగాత్రంతో సమ్మోహితులను చేస్తూ వచ్చారు జానకి. ఇక ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే జానకి తొలుత పాడిన సినిమా పాట మాత్రం విషాద గీతం కావడం చిత్రం! తెలుగునాట పుట్టి, మాతృభాష తెలుగే అయినా, జానకి తొలుత తమిళ పాట పాడవలసి వచ్చింది. ఏవీయమ్ స్టూడియోస్ లో ఆమె స్టాఫ్ సింగర్ గా ఉన్నారు. ఆ సమయంలో తెలుగు సంగీత దర్శకులు టి.చలపతిరావు స్వరకల్పనలో రూపొందిన తమిళ చిత్రం ‘విధియిన్ విలయాట్టు’లో జానకి మొట్టమొదట పాడారు. తరువాత తెలుగులో ఆమె ‘యమ్.ఎల్.ఏ’ చిత్రంలో “నీ ఆశా అడియాస… నీ దారే మణిపూస… బ్రతుకంతా అమవాసా… లంబాడోళ్ళ రామదాసా…” అనే పాట పాడారు. ఈ చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు. ఇలా విషాద గీతాలతో ఆరంభమైన జానకి గానప్రయాణం ఏ ఆటంకమూ లేకుండా యాభై ఏళ్ళ పాటు సజావుగా సాగింది. సదా నవ్వుతూ, నవ్విస్తూనే ఐదు తరాల తారలకు పాటలు పాడి ఆకట్టుకున్నారామె.
జానకిని ఆరంభంలో ద్వితీయ శ్రేణి గాయనిగా భావించిన నాటి మేటి నటీమణులూ లేకపోలేదు. అయితే వారికే అపూర్వంగా పాడి జనాన్ని మైమరిపించారు జానకి. నాటి వర్ధమాన కథానాయికలు ఎందరో జానకి గాత్రంతోనే తమ ఉనికిని చాటుకున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఏ భాషలో పాడినా, ఏ మాత్రం తొట్రు పడకుండా సహజత్వం ఉట్టిపడేలా జానకి గానం సాగింది. అందుకే తెలుగువారే కాదు, దక్షిణాది మొత్తం, జానకి పాటకు సాహో అన్నారు.
అనేక భాషల్లో కలిపి దాదాపు యాభై వేల పాటలు పాడిన జానకి, ఉత్తమ గాయనిగా పలు పురస్కారాలు అందుకున్నారు. 2013లో కేంద్రప్రభుత్వం జానకిని ‘పద్మభూషణ్’ అవార్డుతో గౌరవించాలని భావించింది. అయితే ఆ అవార్డు తనకు రావడం పట్ల ఆమె ఏ మాత్రం సంతోషించలేదు. అప్పటికే చాలా ఆలస్యమైందని భావించారు. ఏ మాత్రం మొహమాట పడకుండా ‘పద్మభూషణ్’ అవార్డును తిరస్కరించారామె. ఆమె నిర్ణయానికి అభిమానులు ఎంతగానో సంతోషించారు. ఎందుకంటే జానకి వంటి మేటి గాయనీమణికి అన్నేళ్ళకు ‘పద్మ’ అవార్డు ప్రకటించడమే విడ్డూరమని ఫ్యాన్స్ భావించారు. ఆమె స్థాయికి తగ్గ అవార్డు ఒకే ఒక ‘భారత రత్న’ అని చాలామంది అభిప్రాయపడ్డారు. జానకి కూడా తన స్థాయికి తగ్గ అవార్డు ‘భారతరత్న’ ఒక్కటేనని నిర్మొహమాటంగా చెప్పారు. తన కెరీర్ యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న తరువాత జానకి తన గానానికి వీడ్కోలు పలికారు. తనదైన గానంతో, ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో సాగిన జానకి ప్రతిభకు సరితూగే అవార్డు ఏముంటుంది? జనం అభిమానం మించిన అవార్డు లేదని జానకి అభిప్రాయం!
