NTV Telugu Site icon

Madala Ravi Birthday Special : నాన్న బాటలో నడచిన మాదాల రవి!

Ravi

Ravi

తండ్రుల బాటలోనే పయనించాలని తపించే తనయులు అన్ని రంగాల్లోనూ కనిపిస్తారు. కొందరు తండ్రులకు తగ్గ తనయులు అనిపించుకుంటారు. మరికొందరు తండ్రులను మించిన తనయులుగానూ కనిపిస్తారు. ఇంకొందరు నాన్నలాగే తమ ఉనికినీ చాటుకుంటారు. రెడ్ స్టార్ గా జనం మదిలో నిలచిన నటదర్శకనిర్మాత మాదాల రంగారావు తనయుడు మాదాల రవి సైతం నాన్న బాటలో నడిచారు. నటునిగా తానూ నేను సైతం అంటూ ఎర్రజెండా ఎగరేశారు.

మాదాల రవి 1971 జూలై 28న జన్మించారు. ఆయన తండ్రి మాదాల రంగారావు, తల్లి పద్మావతి  ఇద్దరూ ప్రజానాట్యమండలి సభ్యులుగా పలు నాటకాల్లో నటించారు. తరువాతే మాదాల రంగారావు సినిమా రంగం బాట పట్టారు. తాను నిర్మించి, నటించిన చిత్రాలలో వామపక్ష భావాలు పలికించి, రెడ్ స్టార్ గా పేరు సంపాదించారు మాదాల రంగారావు. రవి బాల్యంలోనే తండ్రి నిర్మించి, నటించిన ‘ఎర్రమల్లెలు’ చిత్రంలో హీరో మురళీమోహన్ కు బావమరిదిగా నటించాడు. అందులో రవిపై ప్రత్యేకంగా చిత్రీకరించిన “నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో…” పాట అప్పట్లో విశేషాదరణ పొందింది. తరువాత చదువుపై ధ్యాస నిలిపి, రష్యా వెళ్ళి డాక్టర్ చదువు చదివి వచ్చారు రవి. వచ్చాక కొంతకాలం డాక్టర్ గా ప్రాక్టీస్ చేశారు. ఆ పై తండ్రి బాటలోనే పయనిస్తూ నటునిగా మారారు. రవి మామ ప్రముఖ నిర్మాత కె.మహేంద్ర కావడంతో అల్లుడి అభిలాషను ఆయన కూడా ప్రోత్సహించారు. అలా “నేను సైతం” సినిమా ద్వారా హీరో అయ్యారు రవి. అందులో తండ్రి బాటలోనే వామపక్ష భావాలు పలికించారు. ఆ పై “మా ఇలవేల్పు, వీరగాథ”  పంచముఖి, బ్రోకర్ 2 వంటి చిత్రాలలో ప్రధాన భూమికలు ధరించారు. మరికొన్ని సినిమాల్లోనూ రవి నటించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయాలన్న తపనతోనే ఉన్నారు రవి. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ లో ప్రస్తుతం ఉపాధ్యక్షునిగా సేవలు అందిస్తున్నారు రవి.