Ma Inti Bangaram: రోజురోజుకూ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నమోదు చేస్తోంది సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ తో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సమంత కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా ఈ సినిమా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఎంతో దూరంలో లేనట్లు కనిపిస్తోంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాను రాజ్ నిడిమోరు నిర్మించారు. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమా వసూళ్లు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద నిలకడగా రానిస్తోంది.
ఈ సినిమాకి భారత్‌లోనే కాకుండా విదేశీ మార్కెట్‌లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను నమోదు చేస్తోంది. ఇప్పటివరకు అక్కడ సుమారు 2 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. విదేశీ మార్కెట్‌లో ఈ స్థాయి ప్రదర్శన ఏ తెలుగు చిత్రానికైనా ప్రత్యేక గుర్తింపుగా పరిగణిస్తారు. ఒకవేళ ఈ గణాంకాన్ని దాటితే సమంత కెరీర్‌లో విదేశీ మార్కెట్ పరంగా ఇది మరో విశేషమే అవుతుంది. టికెట్ అమ్మకాల పరంగానూ ‘మా ఇంటి బంగారం’ మంచి జోరును కొనసాగిస్తోంది. గత 24 గంటల్లోనే బుక్‌మైషో వేదికపై సుమారు 25 వేల టికెట్లు అమ్ముడవడం ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో ఇంకా మంచి డిమాండ్ కొనసాగుతోందనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. విడుదలై రోజులు గడిచినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తుండటంతో ఈ మూవీ 100 కట్లను మించనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అయితే ఈ వారం లేటెస్ట్ తెలుగు రిలీజ్ లు ఉండటంతో ‘మా ఇంటి బంగారం’కు పోటీ మరింత పెరగనుంది. అయితే ఇప్పటికే ఏర్పడిన పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈ సినిమాకు బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పోటీ ఉన్నా సత్తా చాటిన ఉదాహరణలు గతంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ కూడా అదే జాబితాలో చేరుతుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. ప్రస్తుతం మాత్రం సమంత అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఈ చిత్రం మరిన్ని రికార్డులు సృష్టిస్తుందేమోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి.

