NTV Telugu Site icon

SP Balu: పాటగా బ్రతకవా మా అందరి నోటా…

Sp Balu

Sp Balu

గాన గంధర్వుడు ఎస్పీ బాలు జయంతి సందర్భంగా…

స్వర్గంలో ఇంద్ర సభలో రంభా ఊర్వశి మేనకలు నృత్యం చేస్తూ ఉంటారనే మాట ఊహ తెలిసిన ప్రతి భారతీయుడు ఎదో ఒక చోట వైన్ విషయమే. గొప్పగా నృత్యం చేసే వాళ్లు ఉన్నప్పుడు, అంతే గొప్పగా సాంగీతాలాపన చేసే వాళ్లు కూడా ఉంటారు కదా. స్వర్గంలో తన గాత్రం వినిపించే గంధర్వులు ‘శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం’. తన గాత్రంతో దేవ దేవులనే మెప్పించి, స్వర్గంలోకాన్ని సంగీత ప్రపంచం లోకి తీసుకోని వెళ్లిన ఈ గంధర్వుడు, దివి నుంచి భువికేగిసాడు ‘ఎస్పీ బాలు’గా. ఆయనకి శాపమో లేక మనకి వరమో తెలియదు కానీ ఆ గంధర్వుడి గొంతు సమస్త జీవ కోటిని సంగీత మైకంలోకి తీసుకోని పోయింది. 1966లో ఆయన ప్రస్థానం మొదటి పాట ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ సినిమాతో మొదలై అక్కడి నుంచి 50000 పాటలు పాడే వరకూ సాగింది. ప్రపంచంలో ఇన్ని పాటలు పాడిన గాయకులు మరొకరు లేరు. గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న బాలు, 16 భాషల్లో పాటలు పాడారు. ఆరు నేషనల్ అవార్డ్స్, 25 నంది అవార్డ్స్, ఆరు ఫిల్మ్ ఫేర్ అందుకున్న బాలు… వీటన్నింటికన్నా అందుకున్న అతిపెద్ద అవార్డ్ ప్రేక్షకుల ప్రేమ.

బాలు పాట పాడితే టీవీలకి, రేడియోలకి, టేప్ రికార్డులకు అతుక్కుపోయి వినే వారు. ఎవరైనా పాట పాడే ప్రయత్నం చేస్తే చాలు నువ్వేమైనా బాలునా అని అడిగే వారు. ఇంత కీర్తి సాధించిన బాలు తెలుగు వాడు అని గర్వ పడాలి కానీ యావత్ భారతీయుల్ని మెప్పించిన బాలుని ఒక ప్రాంతానికి చెందిన వాడు అనడం కూడా సబబు కాదు. ఆయన అందరి వాడు, అందరిని మెప్పించిన వాడు, అందరితో ప్రేమించబడిన వాడు. వచ్చిన పని అయిపోయిందో లేక శాప విమోచన జరిగిందో బాలు తిరిగి ‘శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం’ అవతారం ఎత్తి స్వర్గానికి వెళ్లిపోయాడు. కరోనా ఆయన్ని ఇంకొన్ని పాటలు పాడకుండా పైకి తీసుకోని వెళ్లిపోయింది. బాలు గాత్రం అజరామరం, సంగీత ప్రపంచం ఉన్నంతవరకూ బాలు ఉంటాడు, పాట ఉన్నంతవరకూ బాలు ఉంటాడు, మనం పాటలని పాడుకునే అంతవరకూ బాలు ఉంటాడు. ఆయన పాడిన పాటలోని లిరిక్స్ నే ఆయనకి అంకితం ఇస్తూ “బాలు… పాటగా బ్రతకవా మా అందరి నోటా”