Lakshmi Bhupala:”చందమామ, అలా మొదలైంది, మహాత్మ, టెర్రర్, నేనే రాజు నేనే మంత్రి, కల్యాణ వైభోగమే, ఓ బేబీ” చిత్రాలతో మాటల, పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు లక్ష్మీ భూపాల. ప్రస్తుతం చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’, నందిని రెడ్డి ‘అన్నీ మంచి శకునములే’ సినిమాలకు సంభాషణలు అందిస్తున్నారు లక్ష్మీ భూపాల. అలానే కృష్ణ వంశీ ‘రంగ మార్తండ’ కోసం ఒక అద్భుతమైన గీతాన్ని రాశారు. మరో వైపు నిర్మాతగాను అడుగులు వేస్తున్నారు. సెప్టెంబర్ 15 వతేదీ లక్ష్మీ భూపాల పుట్టిన రోజు సందర్భంగా పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
లక్ష్మీ భూపాల ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను ఇటీవల మొదలు పెట్టిన ఆయన ఏకంగా రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. ఇవి షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో ఒకదాని పేరు ‘మరీచిక’. జాతీయ అవార్డు గ్రహీత సతీశ్ కాశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు లక్ష్మీ భూపాల కథ, కథనం, మాటలు, పాటలు అందిస్తున్నారు. రెజీనా కసాండ్ర, అనుపమా పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండటం విశేషం. రెండో సినిమా విశేషాలను త్వరలోనే తెలియచేస్తానని లక్ష్మీ భూపాల తెలిపారు. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ రచయితగా తనకు మరింత పేరును తెచ్చి పెడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
