Nayanthara: నయనతార పేరు చెబితే ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది ‘లేడీ సూపర్‌స్టార్’ అనే ట్యాగే. ఆమె మాత్రం తనను అలా పిలవొద్దని అభిమానులను కోరినా, ఆ బిరుదు మాత్రం ఆమెకు స్టార్‌డమ్‌కు ఒక గుర్తుగా మారిపోయింది. అలాంటి నయనతారకు 2026 మాత్రం అనుకున్నంత సాఫీగా సాగడం లేదు. ఏడాది మొదట్లోనే భారీ హిట్ తో బోణీ కొట్టిన ఆమెకు ఆ తర్వాత వరుసగా ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి. నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తే, ఆమె నిర్మాణంలో మరో రెండు సినిమాలు వచ్చాయి. అయితే రిజల్ట్ మాత్రం ఒక హిట్ తో మొదలై, మిగతా అంతా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టే వరకు వెళ్ళాయి.
నయనతారకు 2026 ఆరంభం మాత్రం అదిరిపోయింది. ‘మన శంకర వర ప్రసాద్ గారి’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగిన ఆమె సరికొత్త లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఏడాది మొదట్లోనే వచ్చిన ఈ హిట్ నయనతార కెరీర్‌కు కూడా మంచి ఊపునిచ్చింది. కానీ ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ‘పేట్రియాట్’ సినిమాలో నయనతారకు మంచి స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ, ఆమె పాత్ర మాత్రం చాలా పరిమితంగా ఉండటంతో అభిమానులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. సంక్రాంతి హిట్ తర్వాత వచ్చిన ఈ ఫలితం నయనతారకు మొదటి ఎదురుదెబ్బగా మారింది.
ఆ తర్వాత వచ్చిన ‘టాక్సిక్’పై మాత్రం అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. యశ్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ కన్నడ సినిమాలో నయనతార ఆయన సోదరి గంగ పాత్రలో కనిపించారు. సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ, ఆ తర్వాత వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల మార్కును దాటినప్పటికీ, భారీ బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుంటే థియేట్రికల్ బిజినెస్ పరంగా ‘టాక్సిక్’ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
ఇక ‘టాక్సిక్’ విడుదలైన కేవలం రెండు రోజులకే నయనతార మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కెవిన్‌తో కలిసి నటించిన ‘హాయ్’ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో ఇద్దరి కెమిస్ట్రీకి ప్రశంసలు వచ్చినప్పటికీ నయనతారకు ఇది కమర్షియల్ కమ్‌బ్యాక్‌గా మారలేదు. కెమెరా ముందు పరిస్థితి ఇలా ఉంటే, కెమెరా వెనుక కూడా నయనతారకు పెద్దగా కలిసిరాలేదు. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, ‘హాయ్’ సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకోలేకపోయాయి. దీంతో నటిగా, నిర్మాతగా నయనతారకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలే ఎదురయ్యాయి.
అయితే నయనతార కెరీర్ పూర్తిగా డౌన్‌లో ఉందని చెప్పడానికి మాత్రం లేదు. ఆమె చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘మూకుతి అమ్మన్ 2’, ‘డియర్ స్టూడెంట్స్’, ‘రక్కాయీ’, ‘తని ఒరువన్ 2’ వంటి సినిమాలు నయనతారకు మరోసారి బలమైన కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

