Laal Singh Chaddha : The Reason Behind Why Naga Chaitanya did not Done Hindi Movies …!
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు హిందీలో ‘సువర్ణ సుందరి’ చిత్రంలో నటించారు. ఆయన కొడుకు నాగార్జున సైతం చాలా హిందీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’లోనూ నటిస్తున్నారు. ఇప్పుడు మూడో తరం వంతు వచ్చింది. అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
గతంలోనూ నాగ చైతన్యకు హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయట. అయితే తనకు ఆ భాష మీద పెద్దంత పట్టులేకపోవడంతో వాటిని తిరస్కరించానని చైతు తెలిపాడు. ఆమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నాగ చైతన్య తన మనసులో మాట చెబుతూ, ”నేను చెన్నయ్ లో పెరిగాను, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాను. దాంతో నాకు హిందీ భాష మీద పెద్దంత పట్టు లేదు. చకచకా మాట్లాడలేను. నాతో హిందీ సినిమా చేస్తామని గతంలో నిర్మాతలు కొందరు వచ్చినప్పుడు ఇదే మాట నిర్మొహమాటంగా చెప్పాను. నా మాటల్లో దక్షిణాది యాస ఉంటుందని, కాబట్టి హిందీ సినిమాలో నటించలేనని చెప్పాను” అని అన్నారు. హిందీ రాదనే ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ తోనే పలు ఆఫర్స్ ను తిరస్కరించిన చైతు… ఇప్పుడు ‘లాల్ సింగ్ చడ్డా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషమే.
ఆ ముచ్చట గురించి చెబుతూ, ”ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు కూడా నాకు హిందీ భాషతో ఉన్న సమస్యను ఆమీర్ ఖాన్ కు తెలిపాను. అయితే… ఇందులో నాది దక్షిణాదికి చెందిన యువకుడి పాత్ర అని, ఇక్కడ పుట్టిన అతను దక్షిణాదిలో పెరిగి సైనికుడు అవుతాడని, అందుకే ఈ పాత్రకు నేను యాప్ట్ అని ఆమీర్ అన్నారని చైతు తెలిపాడు. ఈ మూవీలో నాగచైతన్య హిందీ భాష దక్షిణాది వాళ్ళు మాట్లాడినట్టే ఉంటుందట. దానికి తోడు అక్కడక్కడా కొన్ని తెలుగు పదాలను వాడేశారట. ఇదంతా తనకు నచ్చిందని, తెలుగు ఫ్లేవర్ ను తన పాత్రలో నింపారని చైతు తెలిపాడు. ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్న తర్వాత తనలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగాయని చెబుతూ, ”సింక్ సౌండ్ లో మూవీని షూట్ చేశారు. అలానే నాకు సంబంధించిన డైలాగ్స్ పేపర్ ను చాలా ముందే ఇచ్చేశారు. ఎంతో కంఫర్టబుల్ గా అనిపించింది. ఈ మూవీ తర్వాత హిందీ సినిమాల్లో చేయగలననిపించింది” అని చైతు చెప్పాడు. అయితే అసలైన పరీక్ష ఆగస్ట్ 11న ఉందని, ఆ రోజు మూవీ విడుదలైన తర్వాత జనం తన పాత్రను మెచ్చితే తప్పకుండా హిందీ సినిమాల్లో నటిస్తానని నాగచైతన్య చెబుతున్నాడు.