కృతి శెట్టి… తెలుగులో ఒకే ఒక సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ కు ఉప్పెన చిత్రంతో ఎంట్రీ ఇచ్చి బేబమ్మగా అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఉప్పెన చిత్రంలో ఈ బ్యూటీ అభినయానికి యూత్ అంతా ఫిదా అయ్యారు. ఈ ఫేమ్ తో కృతి శెట్టి కి టాలీవుడ్ లో ఆఫర్లు ఉప్పెనలా వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ నాని సరసన శ్యాం సింగరాయ్ అనే చిత్రంలో, సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రాల్లో నటిస్తోంది. అయితే సినిమాలను ఎంచుకోవడంలో కృతి ఆచితూచి అడుగులేస్తోంది. తాజా సమాచారం ప్రకారం కృతి ఓ యంగ్ హీరో ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం 18 పేజెస్. ఈ చిత్రంలోని ఒక క్యామియో రోల్ కోసం మేకర్స్ కృతిని అడిగారట. కానీ ఈ బ్యూటీ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. నిజానికి 18 పేజెస్ సినిమాని సుకుమార్ నిర్మిస్తున్నారు, ఆయనే కధ అందించగా శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. మరో శిష్యుడు ఈ బ్యూటీని పరిచయం చేయగా ఉప్పెన సినిమాని కూడా సుకుమార్ పర్యవేక్షించాడు, ఆ చనువుతో ఆమెను అడిగినా ఆమె చేయలేనని చెప్పిందట. దీంతో 18 పేజెస్ మేకర్స్ ఆ పాత్ర కోసం వేరే హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారట. ఇక కృతి శెట్టి విషయానికి వస్తే ఇటీవలే దర్శకుడు తేజ తెరకెక్కించబోయే ఓ చిత్రాన్ని కూడా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి.