Krishanamraju Wife Syamala Devi: కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరు ప్రాణ స్నేహితులు అని, ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు.. ఇద్దరు కలిసే వెళ్లిపోయారని కృష్ణంరాజు భార్య శ్యామలదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆమె కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె కృష్ణంరాజును తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. రెండు నెలల క్రితం కృష్ణంరాజు కూడా మృతి చెందిన విషయం విదితమే. ఇక శ్యామలా దేవి మాట్లాడుతూ ” కృష్ణ గారికి, కృష్ణంరాజు గారికి మధ్య విడదీయరాని బంధం ఉంది. వారిద్దరూ ప్రాణ స్నేహితులు. ఇండస్ట్రీకి ఒక్కటిగా వచ్చారు.. ఇప్పుడు కూడా ఒకేసారి వెళ్లిపోదామనుకొని మనల్ని ఇంతలా బాధపెట్టి ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
మహేష్ ను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఒకేసారి అన్న, తల్లి, తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరం. సుల్తాన్ సినిమా దగ్గరనుంచి కృష్ణగారితో మాకు అనుబంధం ఏర్పడింది. ఆ షూటింగ్ సమయంలో మేము అందరం అండమాన్ దీవుల్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు విజయ నిర్మలగారే మా అందరికి వంట చేసి పెట్టారు. పోయినసారి కృష్ణ బర్త్ డే కు కూడా ఒకసారి ఇంటికి రా.. చేపల పులుసు చేసి పెడతా అని అన్నారు. కనై, ఇప్పుడు చూస్తే ఇద్దరు లేరు. ఈ బాధను తట్టుకోలేకపోతున్నాం.. అందరి మనస్సులో వారిద్దరూ చిరస్మరణీయంగా నిలిచిపోతారు” అని చెప్పుకొచ్చారు.