NTV Telugu Site icon

Krishnam Raju: ‘అమరదీపం’లా వెలిగిన కృష్ణంరాజు!

Amara Deepa,m

Amara Deepa,m

Krishnam Raju: కృష్ణంరాజు ‘రెబల్ స్టార్’గా జేజేలు అందుకోకముందు ఆయన హీరోగా నటించిన అనేక చిత్రాలలో సాఫ్ట్ రోల్స్ లోనే కనిపించారు. అందుకు కారణం అంతకు ముందు ఆయన పలు సినిమాల్లో విలన్ గానూ, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ కనిపించి, జనాన్ని జడిపించడమే! ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల అభిమానం పొందడానికి అన్నట్టు కృష్ణంరాజు తాను హీరోగా నటించి, నిర్మించిన చిత్రాలలో సాత్విక పాత్రలనే ఎంచుకున్నారు. అలా కృష్ణంరాజు నటించిన ‘అమరదీపం’ చిత్రం ఘనవిజయం సాధించడమే కాదు, నంది అవార్డుల్లో తొలి ఉత్తమనటునిగా ఆయనను నిలిపింది. 45 ఏళ్ళ క్రితం ‘అమరదీపం’ చేసిన సందడి అంతా ఇంతా కాదు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘అమరదీపం’ చిత్రం 1977 సెప్టెంబర్ 29న విడుదలై, విజయకేతనం ఎగురవేసింది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి ఆయన తమ్ముడు యు.వి.సూర్యనారాయణరాజు నిర్మాతగా వ్యవహరించారు.

‘అమరదీపం’ కథ ఏమిటంటే – ధనమే అన్నిటికీ మూలం అని భావించిన శ్రీకృష్ణ కోట్లు సంపాదిస్తాడు. అతనికి ఒక చెల్లెలు మాధవి. ఆమె అంటే అతనికి ప్రాణం. శ్రీకృష్ణ మంచి మనసున్నవాడు. అయితే వ్యసనపరుడు – మద్యం, మగువలు అంటే పిచ్చి. అతని కంపెనీలోనే రంగనాథం పనిచేస్తుంటాడు. కష్టాల్లో ఉన్న అతడిని పలు విధాల ఆదుకుంటూంటాడు కృష్ణ. ఓ సారి తన చెల్లెలు మాధవి స్నేహితురాలు పార్వతిని చూస్తాడు. ఆమెపై మనసు పడతాడు. ప్రేమిస్తాడు. ఆరాతీస్తే ఆమె తన ఆఫీసులో పనిచేసే రంగనాథం కూతురు అని తెలుస్తుంది. పెళ్ళాడతానని కబురు పంపిస్తాడు కృష్ణ. రంగనాథం పొంగిపోతాడు. కానీ, పార్వతి అందుకు అంగీకరించదు. కృష్ణకు అన్ని వ్యసనాలూ ఉన్నాయని, అలాంటి వాడిని పరువున్న ఏ ఆడపిల్లా భర్తగా కోరుకోదని చెబుతుంది. ఈ విషయం కృష్ణకు తెలిసినా, ఇష్టంలేని మనసు తనకెందుకు అనుకుంటాడు. బ్రతుకు తెరువు కోసం పట్నం వచ్చిన శివప్రసాద్ కు కృష్ణ తన ఆఫీసులో ఉద్యోగం ఇస్తాడు. అతడు ఉండటానికి, పేయింగ్ గెస్ట్ గా రంగనాథం ఇంటికి తీసుకువెళతాడు. అక్కడే పార్వతిని కలుసుకుంటాడు శివ. తరువాత వారిద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్ళాడాలని భావిస్తారు. పార్వతి తండ్రి వచ్చి విషయం కృష్ణకు చెబుతాడు. తన కూతురుకు మత్తుమందు చల్లి శివ వశం చేసుకున్నాడని, తన బిడ్డ అమాయకురాలని అంటాడు రంగనాథం. దాంతో శివను చంపాలని రివాల్వర్ తో అక్కడకు వెళతాడు కృష్ణ. అక్కడ ఓ ఫోటోను చూడగానే, అతనికి గతం గుర్తుకు వస్తుంది. శివ తన తమ్ముడే అని తెలుస్తుంది. ఇంట్లోంచి పారిపోయి వచ్చిన కృష్ణ అసలు పేరు హరి. అతడిని మాధవి తండ్రి ఆదరించిస్తాడు. అతను చనిపోతూ, కూతురును కృష్ణ చేతిలో పెట్టి ఉంటాడు. అతడిలాగే అడ్డదారుల్లో ధనవంతుడవుతాడు కృష్ణ. ఈ గతం గుర్తుకు రాగానే శివ ను వివరాలు అడిగి, తన తమ్ముడు చిన్నతనంలో ఎంత కష్టపడ్డాడో తెలుసుకొని కన్నీళ్ళు పెడతాడు. కానీ, తానే అతని అన్నను అని చెప్పడు. ఓ అన్నలా శివ, పార్వతిల పెళ్ళి తన చేతుల మీదనే జరిపిస్తాడు కృష్ణ. ఆ తరువాత ఆఫీసులోని వారు లేనిపోనివి చెప్పడంతో శివలో అనుమానాలు మొదలవుతాయి. పార్వతిని శివ అనుమానిస్తాడు. తాగుడుకు బానిసవుతాడు. ఒకప్పుడు కృష్ణతో తిరిగిన ఆశ అనే అమ్మాయి, శివను పెనవేసుకుంటుంది. ఈ విషయాలన్నీ తెలిసిన కృష్ణ వెళ్ళి శివను మందలిస్తాడు. ఆశనూ హెచ్చరిస్తాడు. తరువాత అన్నిటికీ తానే సమస్య అని తెలుసుకొని, చెల్లెలు మాధవిని భగవద్గీత చదవమని చెప్పి అది వింటూ కన్నుమూయాలనుకుంటాడు కృష్ణ. అంతకు ముందు శివకు ఓ లెటర్ ద్వారా గతాన్నంతా వివరిస్తాడు. అందులో తాను ఎందుకు అన్నను అని చెప్పుకోలేదో తెలిపి ఉంటాడు. అలాగే మాధవి పెళ్ళి బాధ్యతను శివకు అప్పగిస్తున్నాననీ అందులో రాసి ఉంటాడు. అది చదివిన శివ, కృష్ణ తన అన్నయ్యని భార్యకు చెబుతాడు. క్షమించమని అడగడానికి వెళతాడు. అప్పటికే కృష్ణ తుదిశ్వాస విడిచి ఉంటాడు. అతను అందరిలోనూ అమరదీపంలా వెలుగుతూ ఉంటాడని పార్వతి చెప్పడంతో కథ ముగుస్తుంది.

ఈ చిత్రంలో కృష్ణంరాజు, మురళీమోహన్, జయసుధ, ప్రభాకర రెడ్డి, సాక్షి రంగారావు, మాస్టర్ రాము, సారథి, మాడా, మాధవి, రమాప్రభ, జయమాలిని, ఝాన్సీ, అపర్ణ, విజయలక్ష్మి నటించగా, అతిథి పాత్రలో సత్యనారాయణ కనిపించారు. జంధ్యాల మాటలు సమకూర్చిన ఈ సినిమాకు ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి పాటలు పలికించారు. సత్యం స్వరకల్పన చేశారు. ఇందులోని “అంతలేసి అందాలు…”, “నా జీవనసంధ్యా సమయంలో…”, “యే రాగమో… ఇది యే తాళమో…”, “కొత్తగ ఉందా…బాధగా ఉందా…”, “ఇంతే ఈ జీవితమూ…”, “అతడే ఆత్మయోగి…” అంటూ సాగిన గీతాలు అలరించాయి.

‘అమరదీపం’ చిత్రానికి మళయాళంలో మధు నటించి, దర్శకత్వం వహించిన ‘తీక్కనాల్’ ఆధారం. ఆ సినిమాను చూసి, తమిళంలో శివాజీగణేశన్ తో ‘దీపం’ తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాల ఆధారంగానే ‘అమరదీపం’ వెలుగు చూసింది. ఈ చిత్రం అనేక కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. 1977లో మాస్ మసాలా సినిమాల దాటికి కూడా తట్టుకొని నిలచింది. గుంటూరు లిటిల్ కృష్ణలో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకుందీ చిత్రం. ఆ తరువాత తమిళ చిత్రసీమకు చెందిన బాలాజీ హిందీలో రాజేశ్ ఖన్నా హీరోగా ‘అమర దీప్’ నిర్మించి, విజయం సాధించారు.

‘అమరదీపం’లో అన్నదమ్ములుగా నటించిన కృష్ణంరాజు, మురళీమోహన్ నిజజీవితంలోనూ అలాగే సాగారు. ఇద్దరూ 1940లోనే జన్మించినా, కృష్ణంరాజు ఐదు నెలలు పెద్దవారు. ఇద్దరూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారే. 2009లో తెరమీది ఈ అన్నదమ్ములు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీపడి ఇద్దరూ ఓడిపోయారు. అంతకు ముందు కృష్ణంరాజు లోక్ సభలో అడుగు పెట్టారు. కేంద్రమంత్రిగానూ పనిచేశారు. మురళీమోహన్ 2014లో అదే నియోజకవర్గం నుండి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఇలా కృష్ణంరాజు, మురళీమోహన్ ఇద్దరూ రాజకీయాల్లోనూ ఎమ్.పి.లుగా రాణించడం విశేషం!