Krishna : నటశేఖరుడు కృష్ణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో మాస్ హీరోగా తనదైన బాణీ పలికించిన కృష్ణ ‘హీరో’ కృష్ణగా, నటశేఖర కృష్ణగా, ఆ పై సూపర్ స్టార్ కృష్ణగా సాగారు. తెలుగునాట 325 పై చిలుకు చిత్రాల్లో నటించిన నటునిగా ఓ రికార్డ్ సాధించారు. తెలుగు సినిమా రంగానికి సాంకేతికంగా సినిమాస్కోప్, టెక్నికలర్ వంటి అంశాలను అందించిన ఘనత కూడా కృష్ణ సొంతం. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, ఎడిటర్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు కృష్ణ. ఆయన నటవారసునిగా మహేశ్ బాబు సైతం జనాన్ని ఆకర్షిస్తూ సక్సెస్ రూటులో సాగుతున్నారు. ఈ మే 31వ తేదీన కృష్ణ 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ పడిలో అడుగు పెడుతున్నారు. అందువల్ల అభిమానులకు ఈ సారి కృష్ణ పుట్టినరోజు ప్రత్యేకమనే చెప్పాలి.
ఘట్టమనేని శివరామకృష్ణ 1943 మే 31న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ ఆయన కన్నవారు .ఇంట్లో అందరికంటే పెద్దవాడు కృష్ణ. ఆయన తరువాత హనుమంతరావు, ఆదిశేషగిరిరావు సోదరులు. చదువుకొనే రోజుల్లోనే కృష్ణకు నటనపై ఆసక్తి కలిగింది. నాటకాలు వేసేవారు. తరువాత ఏలూరులో ఇంటర్మీడియట్ చదువుతూ కూడా నాటకాలు వేస్తూ సందడి చేశారు. బి.ఎస్సీ చేరాక, అందుకు స్వస్తి పలికి, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు కృష్ణ. ఆరంభంలో ‘పదండి ముందుకు, కులగోత్రాలు, పరువు- ప్రతిష్ఠ’ వంటి చిత్రాలలో చిన్న పాత్రలు పోషించారు. అందరూ కొత్తవారితో ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన ‘తేనెమనసులు’ ద్వారా ఇద్దరు హీరోల్లో ఒకరిగా పరిచయం అయ్యారు కృష్ణ. తెలుగునాట రంగుల్లో రూపొందిన తొలి సాంఘిక చిత్రంగా ‘తేనె మనసులు’ నిలచింది. దాంతో జనం భలేగా ఆ సినిమాను ఆదరించారు. కృష్ణకు నటునిగా మంచి గుర్తింపు లభించింది. ఆపై ‘కన్నెమనసులు, గూఢచారి 116’ వంటి సినిమాల్లో నటించి మరింత పేరు సంపాదించారు. ‘గూఢచారి 116’ విజయంతో కృష్ణకు మాస్ హీరోగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అయినా తన సీనియర్ హీరోలు యన్టీఆర్, ఏయన్నార్ సినిమాల్లో కీలక పాత్రలు లభిస్తే ధరించి ఆకట్టుకున్నారు కృష్ణ.
Also Read
యన్టీఆర్, ఏయన్నార్ లాగే తనకూ ఓ సొంత నిర్మాణ సంస్థ ఉంటే మేలని భావించిన కృష్ణ ‘పద్మాలయా’ సంస్థను నెలకొల్పి, తొలి ప్రయత్నంగా ‘అగ్నిపరీక్ష’ నిర్మించారు. ఆయన సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరి రావు కూడా అన్నకు తోడుగా నిలచి, నిర్మాతలయ్యారు. వీరి తొలిప్రయత్నం ‘అగ్నిపరీక్ష’ పరాజయం పాలయింది. ఆ తరువాత తెలుగులో తొలి కౌబోయ్ మూవీగా ‘మోసగాళ్ళకు మోసగాడు’ నిర్మించారు. ఈ రంగుల సినిమా జనాన్ని భలేగా ఆకర్షించింది. ఆ పై “పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు” వంటి సొంత చిత్రాలతో విజయాలు సాధించి, హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు కృష్ణ. ఆయన 100వ చిత్రంగా రూపొందిన ‘అల్లూరి సీతారామరాజు’, 200వ చిత్రంగా తెరకెక్కిన ‘ఈనాడు’ మంచి విజయాలు సాధించాయి. 300వ సినిమాగా వచ్చిన ‘తెలుగువీర లేవరా’ అంతగా అలరించలేకపోయింది. ఆ పై కృష్ణ నటించిన చిత్రాలలో ‘నంబర్ వన్’ ఆకట్టుకుంది. పలు చిత్రాలలో కేరెక్టర్ రోల్స్ లోనూ కృష్ణ మెప్పించారు. తనయుడు రమేశ్ బాబుతో కలసి కృష్ణ నటించిన ‘ఎన్ కౌంటర్’, మహేశ్ బాబుతో కలసి నటించిన ‘వంశీ’ చిత్రాలు అభిమానులకు ఆనందం పంచాయి. కృష్ణ సతీమణి విజయనిర్మల ఆయన సరసన అత్యధిక చిత్రాలలో నటించిన నాయికగా నిలిచారు. ఆమె దర్శకత్వంలో రూపొందిన ‘మీనా’ చిత్రంలోనూ కృష్ణనే నాయకుడు. ఆ పై భార్య దర్శకత్వంలో పలు సినిమాల్లో కృష్ణ హీరోగా నటించి మెప్పించారు.
కృష్ణ తొలిసారి దర్శకత్వం వహిస్తూ ‘సింహాసనం’ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రూపొందించారు. ఆ తరువాత “నాగాస్త్రం, ముగ్గురుకొడుకులు, కొడుకు దిద్దిన కాపురం” వంటి హిట్స్ నూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. మొన్నటి దాకా తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికి తపించేవారు కృష్ణ. ఆయన సతీమణి, నటి విజయనిర్మల మృతి, పెద్దకొడుకు రమేశ్ హఠాన్మరణం ఆయనను బాగా కుంగదీశాయి. ఎనభై ఏళ్ళ వయసులోనూ కృష్ణ నటిస్తే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!