NTV Telugu Site icon

Kosaraju Raghavaiah Chaudhary: కవిరాజు.. కొసరాజు!

Tollywood

Tollywood

Kosaraju Raghavaiah Chaudhary: తెలుగు చలన చిత్రసీమలో జానపదం అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు నటరత్న యన్టీఆర్, ఆ పై దర్శకుడు బి.విఠలాచార్య. కానీ, జానపద గీతం అనగానే ఠక్కున స్ఫురించే నామం కొసరాజు రాఘవయ్య చౌదరిదే! ‘జానపద కవిరాజు’గా, ‘కవిరత్న’గా కొసరాజు జేజేలు అందుకున్నారు. కొసరాజు రాఘవయ్య చౌదరి 1905లో జన్మించారు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెం ఆయన జన్మస్థలం. తల్లి లక్ష్మమ్మ మేనమామ వెంకటప్పయ్య ప్రోత్సాహంతో పన్నెండేళ్ళ వయసులోనే అష్టావధానం చేసే స్థాయికి ఎదిగారు కొసరాజు. బాలకవిగా పేరు సంపాదించి ‘రైతు పత్రిక’లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. తరువాత గూడవల్లి రామబ్రహ్మం చిత్రాలలో నటించారు. సముద్రాల రాఘవాచార్యతో మంచి స్నేహం ఏర్పడింది. అప్పట్లో సముద్రాల కొన్ని పాటలు రాయగా, మరికొన్ని కొసరాజు రాసేవారు. అలా గూడవల్లి చిత్రాలకు పనిచేశారు కొసరాజు రాఘవయ్య. అయితే ‘రైతుబిడ్డ’ తరువాత మళ్ళీ ఊరెళ్ళి వ్యవసాయం చేసుకోసాగారు. ఆయన కలం బలం బాగా తెలిసిన డి.వి.నరసరాజు, కేవీ రెడ్డికి గుర్తు చేయటంతో వాహినీ వారి ‘పెద్దమనుషులు’ కోసం పిలిపించారు. ఆ సినిమాలో కొసరాజు రాసిన “నందామయ గురుడ నందామయా…”, “శివ శివ మూర్తివి గణనాథా…” పాటలు విశేషాదరణ పొందాయి. ఆ రెండు పాటల పల్లవులు తెలుగునేలపైన విశేషంగా జనాల్లో నానినవే. అదే సమయంలో బి.ఏ.సుబ్బారావు ‘రాజు-పేద’లో “జేబులో బొమ్మా జేజేల బొమ్మా…” పాట రాసి అలరించారు. అందులోనే ఆయన రాసిన “కళ్ళు తెరచి కనరా…”, “మారింది మారింది మన రాజకీయమే మారింది…” వంటి పాటలు సైతం ఆకట్టుకున్నాయి.

కొసరాజు రాఘవయ్య ప్రజలు పలికే పదాలతోనే పాటలు రాసేవారు. అలాగే ఆయన పాటల్లో సామెతలు, నానుళ్ళు వినిపించేవి. అందువల్లే కొసరాజు పాటలు జానపద బాణీలో ఉండేవని అంటారు. బాల్యంలో అనేక ఊళ్ళు తిరగడం వల్ల ఆ యా ప్రాంతాలలోని పల్లె పదాలను పట్టి తన రచనల్లో పెట్టేశారు. దీంతో కొసరాజును జానపద కవిరత్నఅని కీర్తించారు. ‘రోజులు మారాయి’లో కొసరాజు రాసిన “ఒలియో ఒలి పొలియో పొలి… రావేలు గలవాడా రారా పొలి…” , “రండయ్య పోదాము మనమూ…” పాటలు ఆకట్టుకున్నాయి. అన్నిటినీ మించి ఆ చిత్రంలోని “ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా…” పాట ఈ నాటికీ జనాన్ని పులకింప చేస్తూనే ఉంది. ‘జయం మనదే’లో “వస్తుందోయ్ వస్తుంది…”, “వీరగంధం తెచ్చినామయా… వీరులెవ్వరో లేచి రండయా…”, “దేశభక్తి గల అయ్యల్లారా…”, “చిలకన్న చిలకవే బంగారు చిలకవే…” వంటి పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. కొసరాజుకు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి వరుసకు పెదనాన్న అవుతారు. ఆయన ప్రభావం కూడా కొసరాజుపై ఎంతో ఉందని చెప్పవచ్చు. త్రిపురనేని రాసిన ‘వీరగంధము తెచ్చినారము…’ గేయంలోని మకుటాన్నే అటు ఇటుగా మార్చి ‘జయం మనదే’లో పలికించారు కొసరాజు. ‘హరిశ్చంద్ర’లో “చిన్నకత్తి పెద్దకత్తి…” పాట, ‘తోడికోడళ్ళు’లోని “ఆడుతు పాడుతు పనిచేస్తుంటే…” గీతం తెలుగువారిని ఓ ఊపు ఊపేశాయి. ‘మంచి మనసుకు మంచి రోజులు’లో “అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి… బోల్తా కొట్టిందిలే…”, “కలవారి స్వార్థము…నిరుపేద దుఃఖమూ ఏ నాటికైనా మారేనా…” వంటి పాటలు ఎంతగానో అలరించాయి. ఇక ‘ఇల్లరికం’లోని “నిలువవే వాలుకనులదానా…”, “బలే ఛాన్సులే బలే ఛాన్సులే…” పాటలూ భలేగా మురిపించాయి.

కొసరాజు పాట అనగానే జానపద బాణీ మాత్రమే అనుకుంటే పొరబాటు! ‘మాంగల్యబలం’లో “తిరుపతి వెంకటేశ్వరా దొరా నీవే దిక్కని నమ్మినామురా…” పాట ఆ రోజుల్లో జనాన్ని విశేషంగా అలరించింది. ఇప్పటికీ పలువురు శ్రీశ్రీ రాశారని చెప్పే ‘శభాష్ రాముడు’లోని “జయమ్ము నిశ్చయమ్మురా…” పాట సైతం కొసరాజు కలం నుండి జాలువారినదే! ‘రక్తసంబంధం’లో “మంచి రోజు వస్తుంది… మాకు బతకు నిస్తుంది…” పాట ఎంతోమందిలో ఆశాభావం నింపుతుంది. ఇక ‘లవకుశ’లోని “ఏ నిమిషానికి ఏమి జరుగునో…” పాటలో జీవితసత్యాలూ బోధ పడతాయి. యన్టీఆర్ తొలిసారి త్రిపాత్రిభినయం చేసిన ‘కులగౌరవం’లో “మాతృత్వంలోనె ఉంది ఆడజన్మ సార్థకం…” అంటూ సాగే గీతం కూడా కొసరాజు వారిదే! ఇలా చెప్పుకుంటూ పోతే జానపద బాణీలకు అతీతంగానూ కొసరాజు పాళీ సాగింది. కానీ, కొసరాజు అంటే జానపదం, జానపద బాణీ అంటే కొసరాజు పాట అనే నానుడి నిలచిపోయంది. అందుకు తగ్గట్టుగా జనం చేత చప్పట్లు కొట్టించి, చిందులు వేయించిన గేయాలెన్నో ఉన్నాయి. “చెంగు చెంగునా గంతులు వేయాలి…” (నమ్మినబంటు), “ఏటి ఒడ్డున మా ఊరు…” (రాజమకుటం), “నీటైన పడచున్నదోయ్… నా రాజా నీకే నా లబ్జన్నదోయ్…” (రాణీ రత్నప్రభ), “ముద్దబంతి పూలు పెట్టి…” (కలసివుంటే కలదు సుఖం), “అయ్యయ్యో చేతిలో డబ్బులు…” (కులగోత్రాలు), “మావ మావా మావా…” (మంచి మనసులు), “రామన్న రాముడు కోదండరాముడు” (లవకుశ), “గౌరమ్మా నీ మొగుడెవరమ్మా…” (మూగమనసులు), “దేశమ్ము మారిందోయ్…” (రాముడు-భీముడు), “నీతికి నిలబడి నిజాయితీగా…” (పూలరంగడు), “వినవయ్యా రామయ్యా ఏమయ్యా భీమయ్యా…” (కథానాయకుడు), “సై సై జోడెడ్లా బండీ…” (వరకట్నం), “చూడర నాన్నా లోకం…” (కోడలు దిద్దిన కాపురం), “బులి బులి ఎర్రని బుగ్గలదానా…” (శ్రీమంతుడు), “నూకాలమ్మను నేనే…” (తాత-మనవడు), “శ్రీశైలా మల్లయ్యా…” (కృష్ణవేణి) – ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో! ‘కవిరత్నా మూవీస్’ పతాకంపై కొసరాజు సమర్పణలో యన్టీఆర్ హీరోగా దాసరి దర్శకత్వంలో ‘విశ్వరూపం’ రూపొందింది. ఆ తరువాత ఆయన తనయుడు భానుప్రసాద్ కొన్ని చిత్రాలు నిర్మించారు. 1987 అక్టోబర్ 27న కొసరాజు రాఘవయ్య చౌదరి కన్నుమూశారు. కొసరాజు పాట జానపద బాణీని గుర్తు చేస్తూ ఈ నాటికీ తెలుగువారి మదిలో చిందులు వేస్తూనే ఉంది.