NTV Telugu Site icon

Anand Ravi: ‘కొరమీను’ మీసాల రాజుకు చిక్కిందా!? చేజారిందా!?

Korameenu

Korameenu

Koramenu: ఆనంద్ రవి, శత్రు, హరీశ్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘కొరమీను’. ఈ నెల 31న ‘కొరమీను’ విడుదలవుతున్న నేపథ్యంలో బుధవారం సినిమా ట్రైలర్ ను యువ కథానాయకుడు అడివి శేష్ విడుదల చేశారు. ”విజ‌య‌వాడ‌లో నేర‌స్థుల‌కు సింహ స్వ‌ప్నంగా ఉండే ఐపీఎస్ ఆఫీస‌ర్ మీసాల రాజు అలియాస్ సీతారామ‌రాజు విశాఖ ప‌ట్నం సిటీకి ట్రాన్స్‌ఫ‌ర్స్ అయ్యారు” అనే న్యూస్ ఛానెల్ వార్తతో ‘కొర‌మీను’ ట్రైలర్ ప్రారంభమైంది. అక్కడ నుండి మీసాల రాజుగా పేరున్న ఈ ఐపీఎస్ ఆఫీసర్ మీసాలు లేకుండా విశాఖ లోకి ఎలా అడుగుపెట్టాడు అనే క్యూరియాసిటీని వ్యూవర్స్ లో పెంచారు. ఇక విశాఖ నగరంలోని జాలరి పేటలో డ్రగ్స్ గొడవ మీసాల రాజుకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. ఆ ప్రాంతానికి డాన్ అయిన కరుణకు అతని రైట్ హ్యాండ్ గా ఉండే కోటికి మధ్య గొడవ వచ్చి ఇద్దరూ విడిపోతారు. సో… కరుణ ఆగడాలను అడ్డుకోవడానికి మీసాల రాజు… కోటి హెల్ప్ తీసుకుంటాడా? లేదా? అసలు కరుణకు, కోటికి మధ్య ఎందుకు వైరం వచ్చింది? అనేదే ‘కొరమీను’ చిత్ర కథ అని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది. ముగ్గురు వ్యక్తుల మధ్య తలెత్తిన ఇగోసే ఈ సినిమా కథకు మూలం.

‘ప్రతినిధి’కి రచన చేసి, ‘నెపోలియన్’ మూవీలో టైటిల్ రోల్ పోషించిన ఆనంద్ రవి… ఇందులో కోటి పాత్రను పోషించాడు. మీసాల రాజుగా శత్రు, కరుణ గా హరీశ్ ఉత్తమన్ నటించారు. మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా ‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ ఆనంద్ రవి అందించగా, శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మించారు.