NTV Telugu Site icon

Koduku-Kodalu: యాభై ఏళ్ళ ‘కొడుకు- కోడలు’

Koduku Kodalu Movie

Koduku Kodalu Movie

Koduku Kodalu: నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు, దర్శకుడు పి.పుల్లయ్యకు మంచి అనుబంధం ఉంది. ఏయన్నార్ తొలిసారి తెరపై కనిపించిన ‘ధర్మపత్ని’ (1941) చిత్రానికి పి.పుల్లయ్యనే దర్శకత్వం వహించారు. ఆ తరువాత ఏయన్నార్ నటజీవితంలో కొన్ని మరపురాని చిత్రాలు పి.పుల్లయ్య నిర్దేశకతన తెరకెక్కాయి. ఏయన్నార్ తో పి.పుల్లయ్య రూపొందించిన “అర్ధాంగి, సిరిసంపదలు, మురళీకృష్ణ” పాటలతో జనాన్ని అలరించాయి. పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై ఏయన్నార్, వాణిశ్రీ జంటగా పి.పుల్లయ్య తెరకెక్కించిన ‘కొడుకు-కోడలు’ చిత్రం 1972 డిసెంబర్ 22న విడుదలయింది. వి.వెంకటేశ్వర్లు నిర్మించిన ఈ చిత్రంలో పి.పుల్లయ్య సతీమణి శాంతకుమారి, ఏయన్నార్ కు తల్లిగా నటించారు.

ఇంతకూ ఈ ‘కొడుకు-కోడలు’ కథ ఏమిటంటే – రాజశేఖర్, శోభ ప్రేమించుకుంటారు. శోభ తండ్రి శ్రీహరి రావు వారి పెళ్ళికి అంగీకరిస్తాడు. ముహూర్తాలు నిర్ణయించుకొనే సమయంలో శ్రీహరి రావు అక్క దుర్గమ్మ, శేఖర్ తల్లి జానకమ్మను చూసి, పెళ్ళికాకుండానే బిడ్డను కన్న మహాతల్లి అంటూ చెబుతుంది. దాంతో శేఖర్, శోభ పెళ్ళి చెడిపోతుంది. కన్నతల్లిని నిలదీసి అడిగిన శేఖర్ కు, జానకమ్మ అది నిజమే అని చెబుతుంది. మనసు విరిగిన శేఖర్ ఇంటి నుండి వెళ్ళిపోతాడు. ఓ అమ్మాయిని మోసం చేసిన నీచుడికి తగిన బుద్ధి చెప్పడంతో, అతను శేఖర్ పై కేసు పెడతాడు. ఆ కేసు రాఘవరావు జడ్జిగా ఉన్న కోర్టుకు వస్తుంది. అక్కడే జడ్జి రాఘవరావుకు, శేఖర్ తన కొడుకే అన్న విషయం తెలుస్తుంది. ఈ విషయం చెప్పకుండానే, ఇంటికి తీసుకువెళ్ళి ఆదరిస్తాడు. శోభకు పెళ్ళి చేయాలని తండ్రి ప్రయత్నిస్తాడు. దాంతో ఆమె పారిపోతుంది. తనకు చెల్లెలు వరుస అయ్యే నర్స్ గీత దగ్గర తలదాచుకుంటుంది. రాఘవరావుకు గీత నర్సుగా సేవలు చేస్తూ ఉంటుంది. రాఘవరావు గీతను శేఖర్ కిచ్చి పెళ్ళి చేయాలని ఆశిస్తాడు.

ఇదిలా ఉండగా సత్యానందం అనేవాడు జగన్నాథమ్ అనే పేరుతోనూ తిరుగుతూ ఉంటాడు. తన భార్యను చంపేసి ఆస్తి తనసొంతం చేసుకుంటాడు. సత్యానందం భార్యను జానకమ్మ చంపేసిందని ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారు. సత్యానందం శోభపై కన్నేసి ఉంటాడు. రాజశేఖర్, గీతకు పెళ్ళి అని తెలిసిన శోభ అక్కడ నుండి సత్యానందం దగ్గరకు అనుకోకుండా చేరుకుంటుంది. రాజశేఖర్ మారువేషంలో వెళ్ళి, సత్యానందం ఇంట ఉన్న శోభకు అన్ని విషయాలు చెబుతాడు. ఓ నాటకం ఆడి, సత్యానందం స్వయంగా తానే జగన్నాథం గానూ వేషం వేసి, భార్యను చంపిన విషయాన్ని చెప్పేలా చేస్తాడు శేఖర్. పోలీసులు సత్యానందంను అరెస్ట్ చేస్తారు. కోర్టులో జానకమ్మ నిర్దోషిగా విడుదలవుతుంది. భార్య, కొడుకును ఇంటికి తీసుకువెళతాడు రాఘవరావు. తన అక్క శోభ, శేఖర్ ప్రేమించుకున్నారన్న విషయం తెలిసిన గీత వారిద్దరికీ పెళ్ళి జరిపిస్తుంది. కొడుకు-కోడలును చూసుకొని రాఘవరావు దంపతులు మురిసిపోవడంతో కథ సుఖాంతమవుతుంది.

ఇందులో ఎస్వీ రంగారావు, శాంతకుమారి, గుమ్మడి, లక్ష్మి, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ, రమణారెడ్డి, సూర్యకాంతం, పి.ఆర్.వరలక్ష్మి, నిర్మలమ్మ, సిహెచ్. కృష్ణమూర్తి నటించారు. జగ్గయ్య అతిథి పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ పాటలు, మాటలు రాయగా, కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఇందులోని “నువ్వు నేను ఏకమైనాము…”, “గొప్పోళ్ళ చిన్నది…”, “నా కంటే చిన్నోడు…”, “చేయి చేయి తగిలింది…”, “నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు…”, “ఇదేనన్నమాట…” అంటూ సాగే పాటలు అలరించాయి. అప్పట్లోనే తెలుగు సినిమా రంగంలో రంగుల చిత్రాలు ఊపందుకుంటున్నాయి. దాంతో నాటి స్టార్స్ తమ చిత్రాలను కలర్ లో తీయడానికి ఉత్సాహం ప్రదర్శిస్తూండేవారు. 1972లో ఏయన్నార్ నటించిన ఏడు చిత్రాల్లో ఐదు కలర్ మూవీస్ కావడం విశేషం! రంగుల్లో రూపొందిన ‘కొడుకు-కోడలు’ మంచి ఆదరణ పొందింది. రిపీట్ రన్స్ లోనూ ఈ చిత్రం ఆకట్టుకుంది.

ఇందులో హీరో తనకు ఓ తమ్ముడున్నాడంటూ హీరోయిన్ తో అబద్ధం చెప్పి, నాటకం ఆడేస్తుంటాడు. చివరకు నాయిక తెలుసుకుంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్ ను దాసరి తన ‘సర్దార్ పాపారాయుడు’లో యన్టీఆర్, శారద, శ్రీదేవితో చిత్రీకరించడం గమనార్హం! ‘కొడుకు-కోడలు’లో లాగే ‘సర్దార్ పాపారాయుడు’లోనూ హీరోకు తన తండ్రెవరో తెలియదు. తల్లే పెంచి పెద్ద చేస్తుంది. ప్రేమించిన అమ్మాయి చేయి అందుకోబోతే, మధ్యలో తండ్రి ప్రస్తావన వచ్చి చెడిపోవడమూ జరుగుతుంది. ఇలా కథను బోలిన కథల్లో ఇద్దరు మహానటులు నటించడం, ఆ రెండు సినిమాలు జనాన్ని ఆకట్టుకోవడం విశేషం!