Site icon NTV Telugu

Narendra Modi : కింగ్ ఖాన్ మోడీ భజన!

Modi

Modi

శనివారం (సెప్టెంబర్ 17న) దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 72 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎందరో ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందులో విశేషమేముంది? దేశ ప్రధానికి ఎంతటి ప్రముఖులైనా అభినందనలు తెలుపవలసిందేగా! అవును, అందులో పెద్ద విశేషమేమీలేదు. కానీ, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ తన ట్విట్టర్ లో ప్రధానమంత్రికి తెలిపిన విషెస్ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. “దేశంకోసం, ప్రజల సంక్షేమం కోసం మీ అంకితభావం ఎంతగానో ప్రశంసించదగ్గది” అంటూ ట్వీట్ మొదలెట్టాడు షారుఖ్. “మీ లక్ష్యాలు అన్నిటినీ సాధించడానికి మీకు ఆరోగ్యం, బలము చేకూరునుగాక!” అంటూనే చివరలో ఎంతో చనువుగా, “ఈ ఒక్కరోజయినా సెలవు తీసుకొని మీ బర్త్ డేను ఎంజాయ్ చేయండి” అంటూ ముగించాడు ఖాన్.

ప్రధాని మోడీని షారుఖ్ ఇంతలా అభినందించడం అటు మోడీ అభిమానులకు, ఇటు షారుఖ్ ఫ్యాన్స్ కు ఆనందంగా ఉంది. దేశ ప్రగతి కోసం అహర్నిశలూ శ్రమిస్తోన్న మోడీకి విశ్రాంతి ఎక్కడిది? అంటున్నారు నెటిజన్స్. మోడీలాంటి వ్యక్తి సెలవు తీసుకోరని, అయినా ఆయనపై అభిమానంతో షారుఖ్ అలా కోరివుంటారనీ కొందరిమాట! ఏది ఏమైనా ప్రస్తుతం బాలీవుడ్ లోని ముగ్గురు ఖాన్ ల పరిస్థితి బాగోలేదు. వారి సినిమాలు విడుదలవుతూ ఉంటే ‘బాయ్ కాట్’ అంటూ గగ్గోలు పెడుతున్నారు కొందరు జనం. దీనిని అధిగమించడానికి అన్నట్టు ప్రధాని మోడీకి జై కొడితే, తనకు ఈ ‘బాయ్ కాట్’ బెడద ఉండదని ఖాన్ భావించినట్టున్నాడు. అందువల్లే వీరలెవెల్లో మోడీకి షారుఖ్ భజన చేశాడనీ మరికొందరి మాట! ఏది ఏమైనా షారుఖ్ రాబోయే సినిమా ‘పఠాన్’కు టైటిల్ వల్లే పెద్ద ఇబ్బంది ఉందనీ పరిశీలకులు అంటున్నారు. మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో షారుఖ్ కు ఏ మాత్రం మైలేజ్ వస్తుందో చూడాలి.

Exit mobile version