Harish Roy: విజయం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. ఏ సమయంలో వచ్చినా దాన్ని అందిపుచ్చుకున్నవాడు సక్సెస్ ను అందుకొంటాడు. పరిస్థితులకు భయపడి తప్పుకుంటే అక్కడే ఉండిపోతాడు. అవకాశాలు లేక ఎన్నో తిప్పలు పడుతున్న అతనికి ఒక మంచి అవకాశం వచ్చింది. కానీ అతనికి ఉన్న జబ్బు గురించి చెప్తే ఎక్కడ అవకాశం వెళ్లిపోతుందో అని చెప్పకుండా దాచాడు. అలానే సినిమాను పూర్తి చేశాడు. చేతిలో డబ్బులేకపోయినా, ఆసుపత్రి ఖర్చులకు చిల్లిగవ్వ లేకపోయినా ఎప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని దక్కించుకొంది. అతడికి మంచి పేరు వచ్చింది. ఈ సక్సెస్ తరువాత మొట్టమొదటిసారి అతడు తన దీన గాధను వివరించాడు. అతడు ఎవరో కాదు కెజిఎఫ్ చిత్రంలో ఖాసీం చాచాగా రాఖీ భాయ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ తన నటనతో మెప్పించిన హరీష్ రాయ్. కన్నడ ఇండస్ట్రీకి చెందిన హరీష్ సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో రోజులు ఎదురుచూశాడు. ఇక మధ్యలోనే క్యాన్సర్ అన్న విషయం తెల్సింది. అయినా తన ప్రయత్నాన్ని ఆపలేదు. క్యాన్సర్ అని చెప్తే సినిమాల్లో అవకాశాలు రావేమో అని భయపడ్డాడు. ఇక కెజిఎఫ్ లో అవకాశం వచ్చినా కూడా ఈ విషయాన్నీ ఎవరికి చెప్పలేదట. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీష్ ఈ విషయాన్నీ బయటపెట్టాడు.
“నేను మూడేళ్ళుగా క్యాన్సర్ తో పోరాడుతున్నాను. ఈ క్యాన్సర్ వలన నా మెడ దగ్గర వాచిపోయింది. చికిత్స చేయించుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఎవరిని డబ్బు అడగలేను. నా దగ్గరఏం ఉందని నాకు డబ్బు ఇస్తారు. ఆ సమయంలోనే నాకు కెజిఎఫ్ ఆఫర్ వచ్చింది. ఇక ఆ గడ్డ కనిపించకుండా ఉంచడానికి గడ్డం పెంచి దాంతో కవర్ చేశాను. ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు ఈ విషయాన్నీ ఎవరికి చెప్పకూడదనుకున్నాను. సినిమా మంచి విజయం అందుకొంది. అలంటి సినిమాలో నేను నటించడం నా అదృష్టం. ఇప్పుడు నాకు క్యాన్సర్ నాలుగో స్టేజిలో ఉంది. ఇదే చివరి స్టేజి అనుకుంటాను. ఇక కెజిఎఫ్ 2 క్లైమాక్స్ సీన్ లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమయ్యింది. అయినా ఆ సినిమాను పూర్తిచేయాలని అనుకోని ఓర్చుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హరీష్ దీన గాధ నెట్టింట వైరల్ గా మారింది. ఒకప్పుడు అడిగినా ఒక్క రూపాయి కూడా ఎవ్వనివారు ఈ వీడియో చూశాక చాలామంది ప్రముఖులు సహాయం చేస్తామని కాల్స్ చేయడం నిజంగా విశేషం. హరీష్ త్వరగా చికిత్సను పూర్తిచేసుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు కోరుకొంటున్నారు.
