Vivek Ranjan Agnihotri:’ది కశ్మీర్ ఫైల్స్’ చెత్త సినిమా అంటూ నిన్న కేరళలోని ఓ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఆయన అనుకూలురు, వ్యతిరేకులు ఒకరిపై ఒకరు వాగ్బాణాలు విసురుకుంటున్నారు. ఇదిలా ఉంటే… ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా దీనిపై స్పందించాడు. ”ఈ చిన్న ప్రజల చిత్రం ‘కశ్మీర్ ఫైల్స్’తో అర్బన్ నక్సలైట్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. యేడాది గడిచినా దాన్ని మర్చిపోలేక, ఆదరించిన ప్రేక్షకులను మొరిగే కుక్కలతో పోల్చుతున్నారు. అయినా… మిస్టర్ అంధకార్ రాజ్ (ప్రకాశ్ రాజ్ ను సంబోధిస్తూ) నేను భాస్కర్ ను ఎలా పొందుతాను. ఆమె / అతను ఎప్పటికీ మీకు చెందిన వారు’ అంటూ సెటైర్ వేశాడు.
ప్రకాశ్ రాజ్ తన వ్యాఖ్యల్లో వివేక్ అగ్నిహోత్రి తన చిత్రానికి ఆస్కార్ అవార్డు రాలేదని బాధపడుతున్నాడని, అతనికి కనీసం భాస్కర్ అవార్డు కూడా రాదని విమర్శించాడు. నిజానికి భాస్కర్ అవార్డ్ అనే పదాన్ని ‘అత్తారింటికి దారేది’ సినిమాలో త్రివిక్రమ్ సృష్టించాడు. ఉత్తమ చెత్త నటనకు ఆ అవార్డు ఇస్తారంటూ అందులో చూపించాడు. అయితే… ఇక్కడ వివేక్ అగ్నిహోత్రి ‘భాస్కర్’ అని సంభోందించింది మాత్రం ప్రకాశ్ రాజ్ ను వెనకేసుకువచ్చే నటి స్వరభాస్కర్ ను ఉద్దేశించి అనే అనుకోవాలి!
అలానే పనిలో పనిగా వివేక్ అగ్రిహోత్రి ఓ ఛాలెంజ్ కూడా విసిరాడు. ”ఈ అర్బన్ నక్సలైట్స్ ను, ఇజ్రాయిల్ నుండి వచ్చిన లెజండరీ ఫిల్మ్ మేకర్ ను నేను ఛాలెంజ్ చేస్తున్నాను… నా ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రంలోని సింగిల్ షాట్, సీన్, డైలాగ్ ఎందులో అయినా నిజం లేదని నిరూపిస్తే నేను సినిమాలు తీయడం ఆపేస్తాను. ఈ రంగం నుండి నిష్క్రమిస్తాను. ప్రతిసారి ఇండియాకు వ్యతిరేకంగా నిలిచే వీళ్ళు ఏ ఒక్కరోజూ మోప్లా, కాశ్మీర్ లలో జరిగిన దారుణ సంఘటనలను ప్రజలకు తెలియచేయడానికి అంగీకరించరు” అని వ్యాఖ్యానించాడు.