Kartikeya 2 Team Visits Madhura Iscon Temple: యంగ్ హీరో నిఖిల్, డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం’కార్తికేయ- ‘2’. శ్రీకృష్ణ జన్మస్థలమైన మధురలోని బృందావన ఇస్కాన్ టెంపుల్ నుండి ఈ చిత్ర బృందానికి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. ఆ మేరకు చిత్ర కథానాయకుడు నిఖిల్ తో పాటు ఇందులో కీలక పాత్రలు పోషించిన శ్రీనివాస రెడ్డి, ‘వైవా’ హర్ష మధురకు వెళ్ళారు. ‘కార్తికేయ 2’ చిత్రం శ్రీ కృష్ణుడి తత్వం, ఆయన బోధించిన ఫిలాసఫీ ఆధారంగా రాబోతోంది.
ఈ మూవీ టీజర్ ను చూసిన ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఆహ్వానం మేరకే నిఖిల్ బృందం మధురకు వెళ్ళింది. అక్కడి భక్తుల సమక్షంలో ఈ మూవీకి సంబంధించిన తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల టీజర్లను ప్రదర్శించారు. అనంతరం అక్కడి స్వామీజీలు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు భక్తులు నిఖిల్ టీమ్ తో సెల్ఫీలు దిగారు. పురాణ గాథల నేపథ్యంలో ఎంతో మంది, ఎన్నో సినిమాలు తీశారని, వారికి దక్కని గౌరవం తమకు లభించిందని, ఇది శ్రీకృష్ణ పర్మమాత్మ ఆహ్వానంగానే భావించి ఇక్కడకు వచ్చామని నిఖిల్, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష తెలిపారు.
నిజానికి అక్కడే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని తొలుత నిర్మాతలు తెలిపారు. కానీ అలాంటిదేమీ జరుగలేదు. సరైన సమయంలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చిత్ర సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల చెప్పారు. ‘కార్తికేయ-2’ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ తో పాటు అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. సముద్రంలో మునిగిపోయిన ద్వారక నగర నేపథ్యంలో ‘కార్తికేయ -2’ చిత్రం తెరకెక్కింది.
