NTV Telugu Site icon

Karthi: ఎవర్రా మీరంతా.. ఇంతలా ప్రేమిస్తున్నారేంట్రా?

Karthi Speech

Karthi Speech

Karthi Speech At Sardar Pre Release Event: హీరో కార్తీ ప్రధాన పాత్రలో రూపొందిన ‘సర్దార్’ సినిమా ఈనెల 21వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో కార్తీ మాట్లాడుతూ.. తొలుత ఈమధ్యకాలంలో నెట్టింట్లో బాగా పాపులర్ అయిన యుగానికి ఒక్కడులోని ‘ఎవర్రా మీరంతా’ అనే డైలాగ్ గుర్తు చేసుకుంటూ.. ‘ఎవర్రా మీరంతా, ఇంత అభిమానం చూపిస్తున్నారు’ అంటూ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి అన్నాడు. ఆ ఒక్క డైలాగ్‌లో ఆడిటోరియం మొత్తం అభిమానుల అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది.

ఇక తన సినిమా ఈవెంట్‌కి కింగ్ నాగార్జున అతిథిగా రావడంతో చాలా సంతోషంగా ఉందని, ఇది తనకు ప్రత్యేకమైన రోజు అని కార్తీ అన్నాడు. నాగార్జున తనకు పెద్ద ఇన్స్‌పిరేషన్ అని తెలిపాడు. తాను పదో తరగతి చదువుతున్నప్పుడు ఓసారి ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ చదివానని, అందులో ఒక మంచి నటుడు అవ్వాలంటే ఒక మంచి హ్యూమన్ బీయింగ్‌గా ఉండాలని నాగార్జున చెప్పిన కోట్ చదివానని, అప్పట్నుంచి తాను అదే అనుసరిస్తున్నానని చెప్పాడు. నాగార్జున కింగ్ అంటే కింగ్ అని.. తానేదో ఊరికే ఈ మాట చెప్పట్లేదని.. తాను ఊపిరి సినిమా చేయడానికి కారణం అందులో నాగార్జున నటించడమేనని పేర్కొన్నాడు. ఉక్రెయిన్‌లో ఊపిరి షూటింగ్ సమయంలో తాను నాగార్జున గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోనని, అవి గోల్డెన్ డేస్ అని చెప్పుకొచ్చాడు.

నాగార్జున తనకు అన్నయ్యలాంటి వాడని, ఆయన నుంచి తాను సినిమాతోపాటు వ్యక్తిగత విషయాలు ఎన్నో నేర్చుకున్నానన్నాడు. టాలీవుడ్‌కి మణిరత్నంను పరిచయం చేసింది కూడా నాగార్జునని అన్నాడు. జయాపజయాలనేవి ఆయనపై ఎలాంటి ప్రభావం చూపలేదని, తన ప్యాషన్‌తోనే ముందుకు సాగుతున్నాడని కొనియాడాడు. తన ‘సర్దార్’ను నాగార్జున తెలుగులో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. ఇక ఈ సినిమా తన కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్ అని, ఇందులో తాను 60 ఏళ్ల వయసున్న ఆఫీసర్ పాత్రతో పాటు ఒక పోలీస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నానని అన్నాడు. స్పై క్యారెక్టర్ అనేది చాలా స్పెషల్ అని, నిజ జీవితంలోని ‘స్పై’లు ఏమీ ఆశించకుండా తమ దేశం కోసం పోరాడుతారని, అలాంటి పాత్రలో నటించడం తనకు గర్వంగా ఉందని తెలిపాడు.

ఇక పోలీస్ పాత్ర అనేది ప్రస్తుత ట్రెండ్‌కి తగినట్టు ఉంటుందని, రెండూ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కాబట్టి చాలా ఛాలెంజింగ్‌గా తాను ఈ సినిమా చేశానని కార్తీ చెప్పాడు. ఇది జేమ్స్ బాండ్‌లా ఉండదని, ఒక పల్లెటూరి నుంచి వచ్చిన వ్యక్తి స్పై అయితే ఎలా చేస్తాడనే పాయింట్‌తో తెరకెక్కిందని పేర్కొన్నాడు. ఈ చిత్రంలో ఒక సర్‌ప్రైజ్ ఉందని, సినిమా చూశాకే తెలుస్తుందని సస్పెన్స్‌లో పడేశాడు. ఇందులో ఉన్న ఇతర పాత్రలకి కూడా మంచి ప్రాధాన్యత ఉందన్నాడు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌లో ఉన్న స్పై త్రిల్లర్స్‌ని దృష్టిలో పెట్టుకొని.. ఈ సినిమాని మరో స్థాయిలో తెరకెక్కించామన్నాడు. దీపావళి క్రాకర్‌లాగా ‘సర్దార్’ రాబోతోందని, గత దీపావళికి వచ్చిన ‘ఖైదీ’ని ఎలా ఆదరించారో, అంతే ఈ సర్దార్ నచ్చుతుందని కార్తీ చెప్తూ తన ప్రసంగాన్ని ముగించాడు.