Karthi: ‘పొన్నియిన్ సెల్వన్’లో వందియదేవన్ గా మెప్పించిన కార్తి త్వరలోనే ‘జపాన్’తో జనం ముందుకు రాబోతున్నారు. తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మెప్పించడంలో ఇప్పటికే పలుమార్లు మేటిగా నిలిచారు కార్తి. కొన్నిసార్లు కార్తి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేసి ఉండవచ్చు. అయితే నటునిగా మాత్రం కార్తి సదా మెప్పిస్తూనే ఉండడం విశేషం! తమిళనాట స్టార్ గా సాగుతున్న తన అన్న సూర్య కన్నా మిన్నగా తెలుగునాట ఆదరణ చూరగొన్నారు కార్తి.
తన తండ్రి శివకుమార్ తమిళనాట స్టార్ గా ఉన్న రోజుల నుంచీ సినిమా వాతావరణం కార్తికి సుపరిచితమే! అయితే కార్తి మాత్రం దర్శకునిగా మెగాఫోన్ పట్టి జనం మెచ్చే చిత్రాలు రూపొందించాలని ఆశించారు. నటునిగానూ అలరించాలనీ తలచారు. అయితే ‘యువ’ చిత్రంలో సూర్య నటిస్తున్నప్పుడు అతనికి ఓ తమ్ముడు ఉన్నాడని దర్శకుడు మణిరత్నం కార్తిని పిలిపించారు. అప్పట్లో బొద్దుగా ఉన్న కార్తిని చూసి, ముందుగా అనుకున్న పాత్రకు కాదని వేరే బిట్ రోల్ లో నటింపచేశారు. ఆ సినిమాకు కార్తి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్టు కార్తి అనుకోకుండా ‘పరుత్త వీరన్’తో నటుడయ్యారు. ఆపై ‘ఆయిరత్తిల్ ఒరువన్’లో నటించి మంచి పేరు సంపాదించారు. ఈ సినిమా తెలుగులో ‘యుగానికొక్కడు’గా అనువాదమై అలరించింది. వెంటనే లింగుసామి దర్శకత్వంలో కార్తి, తమన్నాతో కలసి నటించిన ‘పయ్యా’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో ‘ఆవారా’గా విడుదలై విజయాన్ని మూటకట్టుకుంది. అప్పటి నుంచీ తాను తమిళంలో నటించిన చిత్రాలను తెలుగులోనూ డబ్ చేస్తూ వచ్చారు. దాంతో సూర్య కంటే కార్తినే తెలుగువారికి దగ్గరయ్యారు.
‘ఊపిరి’లో నాగార్జునతో కలసి నటించారు కార్తి. ఆ సినిమాలోనూ నటునిగా మంచి మార్కులే సంపాదించారు. కార్తి నటించిన ‘ఖైదీ, సుల్తాన్’ సైతం తెలుగువారిని భలేగా అలరించాయి. ఈ నేపథ్యంలో కార్తితో డైరెక్ట్ గా ఓ తెలుగు సినిమా తీయాలని కొందరు నిర్మాతలు భావించారు. అది ఎలా ఉన్నా మణిరత్నం మేగ్నమ్ ఓపస్ ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాల్లోనూ కార్తి చలాకీగా నటించి, తెలుగువారిని ఆ సినిమా చూసేలా చేశారు. తమిళనాట మంచి విజయం సాధించిన ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం, తెలుగులో అంతగా అలరించలేకపోయింది. కొందరైనా ప్రేక్షకులు ఆ సినిమాను తెలుగులో చూశారంటే అది కార్తి వల్లే అని చాలామంది అన్నారు. ఏది ఏమైనా ఈ సారి ఓ సాలిడ్ హిట్ పట్టేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు కార్తి. మరి రాబోయే ‘జపాన్’తో కార్తి ఏ తీరున అలరిస్తారో చూడాలి.