Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు

Sandalwood Villains

Sandalwood Villains

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడూ విలనిజానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఒకప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ నటులు టాలీవుడ్ సినిమాల్లో ప్రతినాయకులుగా మెరిసేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇప్పుడు మన తెలుగు దర్శకుల చూపు కన్నడ చిత్ర పరిశ్రమ వైపు మళ్లింది. కన్నడ నటులు తమదైన రగ్గడ్ లుక్స్, నేచురల్ ఇంటెన్సిటీతో తెలుగు తెరపై పవర్‌ఫుల్ విలన్లుగా బలమైన ముద్ర వేస్తున్నారు.

టాలీవుడ్‌లో కన్నడ విలన్ల హవా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు డాలీ ధనంజయ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ హిట్ చిత్రం ‘పుష్ప: ది రైజ్’లో జాలీ రెడ్డి పాత్రలో డాలీ ధనంజయ్ కనబరిచిన నటన ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. చాలా మంది విశ్లేషకులు ప్రధాన విలన్ల కంటే జాలీ రెడ్డి పాత్రే సినిమాలో కథను మలుపు తిప్పడంలో ఎంతో ప్రభావవంతంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. ఇక ఇటీవల విడుదలైన భారీ చిత్రాల్లోనూ కన్నడ నటుల హవా స్పష్టంగా కనిపిస్తోంది. లేటెస్ట్ సెన్సేషన్ లెనిన్సినిమాలో ప్రమోద్ పంజు తన పెర్ఫార్మెన్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకోగా.. మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ పుష్ప 2: ది రూల్ లో తారక్ పొన్నప్ప తన క్రూరమైన విలనిజం, సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో థియేటర్లలో ఆకట్టుకుంటున్నారు. కన్నడ నటులు కేవలం డైలాగ్స్ చెప్పడమే కాకుండా, తమ కళ్లతోనే విలనిజాన్ని పండించడంలో దిట్టలుగా పేరు తెచ్చుకుంటున్నారు. వారి సహజసిద్ధమైన బాడీ లాంగ్వేజ్, కరుడుగట్టిన విలన్ పాత్రలకు సరిగ్గా సరిపోయే రగ్గడ్ స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా తెలుగు స్టార్ డైరెక్టర్లు తమ సినిమాల కోసం కన్నడ నటులనే ఫస్ట్ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది కన్నడ టాలెంటెడ్ నటులు తెలుగులో పెద్ద ప్రాజెక్టుల ద్వారా విలన్లుగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.