వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్.. సంచలనాలకు పర్మినెంట్ అడ్రస్ గా మారిపోయింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఏ ముహూర్తాన అమ్మడిని ఫైర్ బ్రాండ్ అని పిలిచారో అప్పటినుంచి ఏదో ఒక నిప్పు అంటిస్తునే ఉంది. పెద్ద, చిన్నా.. సెలబ్రిటీ, రాజకీయ నాయకుడు అని ఏమి లేకుండా ఆమె మనసుకు నచ్చింది మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పేస్తూ విమర్శల పాలు కావడం కంగనాకు అలవాటుగా మారింది. ఇక మరోసారి బాలీవుడ్ స్టార్స్ పై కంగనా ఫైర్ అయ్యింది. కంగనా ప్రధాన పాత్రలో నటించిన ‘ధాకడ్’ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఆమె ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇక తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కంగనా మాట్లాడుతూ తన ఇంటికి వచ్చే అర్హత ఒక్క బాలీవుడ్ స్టార్ కూడా లేదని తెగేసి చెప్పింది.
ఆదివారం వేళ కంగనా ఇంట్లో అతిథులుగా భోజనం చేయాల్సి వస్తే.. అన్న ప్రశకు కంగనా సమాధానం చెప్తూ ” నా ఇంటికి వచ్చే అర్హత బి టౌన్ లో ఎవరికి లేదు. బయట ఎక్కడైనా బాలీవుడ్ సెలబ్రిటీల్ని కలిస్తే ఫర్వాలేదుగానీ… వారెవ్వర్నీ ఇంటికి మాత్రం ఆహ్వానించను.. మీరు కూడా ఆహ్వానించవద్దు”అని చెప్పుకొచ్చింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలతో నటించాలని ఉందా.. అని అడుగగా “వారు ఎవ్వరు నాతో నటించరు. ఎందుకంటే వారికి నేను అంటే భయం. నాతో పని చేసిన వార్ని బీ-టౌన్ బిగ్ సెలబ్రిటీస్ టార్గెట్ చేస్తున్నారు.. అయినా కూడా అర్జున్ రాంపాల్ నాతో సినిమా చేశాడంటే నిజంగా గ్రేట్”అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
