Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్‌వరల్డ్ యాంథమ్‌గా నిలిచిన ‘కల్లు మామ’ పాట

Kallu Mama (2)

Kallu Mama (2)

Kallu Mama Song: కొన్ని పాటలు సినీ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ఎక్కవగా లవ్ సాంగ్స్ ఆ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అయితే బాలీవుడ్ కల్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘సత్య’లోని ‘గోలీ మార్ భేజే మే’ పాట అలాంటి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఇది లవ్ సాంగ్ మాత్రం కాదు. ఇందులో వినిపించే ‘కల్లు మామ’ అనే పదం అండర్‌వరల్డ్‌కు సంబంధించిన ఐకానిక్ రిఫరెన్స్‌గా గుర్తింపు పొందుతోంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత కూడా ఈ పాటకు ఏమాత్రం క్రేజ్ తగ్గకపోవడం విశేషం.

1998లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య’ విడుదలైనప్పుడు బాలీవుడ్‌లో ఎక్కువగా ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాల హవానే  కొనసాగుతున్నాయి. అలాంటి సమయంలో ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పూర్తిగా భిన్నమైన స్టైల్ ను పరిచయం చేసింది. నిజ జీవితానికి దగ్గరగా ఉన్న పాత్రలు, రియలిస్టిక్ మేకింగ్, మాఫియా కథనం ఈ మూవీని సినీ చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలబెట్టాయి. మనోజ్ బాజ్‌పేయ్ పోషించిన భీకు మాథ్రే పాత్రతో పాటు జె.డి. చక్రవర్తి నటించిన సత్య పాత్ర ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసాయి.

ఈ సినిమాలోని పాటలు కూడా కథలో భాగంగానే సాగుతాయి. అందులో అత్యంత గుర్తింపు పొందింది ‘గోలీ మార్ భేజే మే’ పాట. ఇందులో పదే పదే వినిపించే ‘కల్లు మామ’ అనే పేరు ప్రేక్షకుల మదిలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. దీనికి కారణం సినిమాలో నటుడు సౌరభ్ శుక్లా పోషించిన మాఫియా డాన్ కల్లు మామ పాత్ర. అతని గ్యాంగ్ సభ్యులు అతని చుట్టూ చేరి ఈ పాటను పాడే సన్నివేశం సినిమా కథనంలో కీలక ఘట్టంగా నిలుస్తుంది. అందుకే ఈ పాటను చాలామంది అండర్‌వరల్డ్ యాంథమ్‌గా కూడా అభివర్ణిస్తుంటారు.

ఈ పాట వెనుక ఉన్న టీమ్ కూడా అంతే ప్రత్యేకం. సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాటను గాయకుడు మను ఆలపించారు. ముఖ్యంగా లవ్ సాంగ్స్ కు పేరుగాంచిన దిగ్గజ రచయిత గుల్జార్ ఈ పాటకు సాహిత్యం అందించడం మరో ఆసక్తికర అంశం. ఈ పాటతో పూర్తిగా గ్యాంగ్‌స్టర్ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్.

అయితే కాలం మారినా ‘గోలీ మార్ భేజే మే’ పాట క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇటీవల నటుడు సోహమ్ షా నటించిన ‘క్రేజీ ఎక్స్’ చిత్రంలో కూడా ఈ పాటను రీమేక్ చేయడం ద్వారా కొత్త తరం ప్రేక్షకులకు మళ్లీ పరిచయం చేశారు. దీంతో మరోసారి ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తానికి ‘కల్లు మామ’ అనేది కేవలం ఒక పాటలోని పదం కాదు. గ్యాంగ్‌స్టర్ సినిమాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక గుర్తు. 28 ఏళ్ల తర్వాత కూడా ఈ పాటకు ఉన్న ఆదరణ, ‘సత్య’ సినిమా భారతీయ సినీ పరిశ్రమపై చూపిన ప్రభావాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.