ప్రజంట్ సీనియర్ నటీనటులు ఖాళీగా ఉండటం లేదు. టాక్ షో లేదా మంచి మంచి పాత్రలు ఎంచుకుంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇందులో భాగంగా సీనియర్ నటీమణులు కాజోల్, ట్వింకిల్ ఖన్నా కొత్త ప్రయోగం తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇద్దరూ కలిసి హోస్ట్‌గా నిలిచిన సెలబ్రిటీ టాక్ షో ‘టూ మచ్’ సెప్టెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ముంబయిలో ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది.
ఈ ఈవెంట్‌లో కాజోల్, ట్వింకిల్ సరదాగా మాట్లాడుతూ అందరినీ అలరించారు. షో కోసం సినీ ప్రముఖులను ఆహ్వానించడంలో టెలీమార్కెటర్లుగా మారాల్సి వచ్చిందని, స్నేహితులను ఒప్పించడానికి చాలా కష్టపడ్డామని చెప్పి నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా ట్వింకిల్ మాట్లాడుతూ “వాళ్లు మా ఫ్రెండ్స్ అని ఎవరు చెప్పారు? (నవ్వుతూ) ఎన్నోసార్లు కాల్ చేశాం. ఎవరు ఓకే అన్నారో వారినే ఇంటర్వ్యూ చేశాం” అని చెప్పారు. కాజోల్ అయితే తన ఫేవరెట్ గెస్ట్‌గా గోవిందాను గుర్తుచేసుకున్నారు.
ట్రైలర్‌లో షారుక్ ఖాన్ కనిపించకపోవడంపై ప్రశ్నించగా ట్వింకిల్ సరదాగా సమాధానమిస్తూ “షారుక్‌కు మేం కొన్ని ప్రశ్నలు అడిగాం. కానీ ఆయన ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేదు. చివరికి ఆయన డేట్స్ దొరకవని అర్థమైంది. అందుకే కటౌట్ పెట్టుకున్నాం” అని నవ్వించారు. కాగా ఈ షోలో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలియా భట్, కృతీ సనన్ తదితరులు పాల్గొననున్నారు. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. గ్రాండ్ ఫినాలేలో షారుక్ ఖాన్ ప్రత్యేకంగా హాజరవుతారని సమాచారం.
