“కళ కళ కోసం కాదు… ప్రజాశ్రేయస్సు కోసం…” అన్నారు పెద్దలు. దానికి అనుగుణంగా సాగిన కళాకారులు నిస్సందేహంగా ‘కళ’కోసం తపించిన వారే అని చెప్పాలి. విఖ్యాత దర్శకులు కాశీనాథుని విశ్వనాథ్ అలా ‘కళ కోసం తపించారు’ అందుకే జనం మదిలో ‘కళాతపస్వి’గా నిలిచారు. ఇంతకూ ఆయన తపన ఎలా సాగింది? తొలి నుంచీ తెలుగు చిత్రాలు సంగీతసాహిత్యాలతో సాగుతూ ఉన్నవే! ఇప్పటికీ మన తెలుగు సినిమాలు ‘మ్యూజికల్స్’గానే వస్తున్నాయి. ఆ రోజుల్లో అయితే సంగీతసాహిత్యాలకు మరీ పెద్ద పీట వేసేవారు. అందువల్లే విశ్వనాథ్ సైతం తన చిత్రాలలో సంగీతానికి, సాహిత్యానికి ప్రాధాన్యమిచ్చేవారు. అంతేకాదు.. వాటి కోసం తపస్సు చేసేవారు. తన గీత రచయితలతో, సంగీత దర్శకులతో తనకు కావలసిన బాణీలను,అందుకు తగ్గ వాణిని రాబట్టడానికి విశ్వనాథ్ నిజంగానే తపస్సు చేశారు.
తొలి చిత్రం ‘ఆత్మగౌరవం’లోనే సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పనలో మరపురాని మధురగీతాలను రూపొందింప చేసుకున్నారు. అందులో దాశరథి రాసిన “ఒక పూల బాణం తగిలింది మదిలో తొలిప్రేమదీపం వెలిగిందిలే…” అంటూ రసజ్ఞులను రంజింపచేసేలా పాటను రాయించుకున్నారు. అందులోనే ఈ నాటికీ ప్రేమికులను రంజింపచేసేలా ఆరుద్రతో “ప్రేమించి పెళ్ళ చేసుకో…” పాటను రాయించారు. అమ్మాయి మదిలోని ఆనందాన్ని చూసే ప్రేక్షకుల మనసులు రంజింప చేసేలా అందులోనే “అందెను నేడే అందని జాబిల్లి…” అంటూ పల్లవింప చేశారు. ఇక యన్టీఆర్ తో తాను తెరకెక్కించిన తొలి చిత్రం ‘కలిసొచ్చిన అదృష్టం’లో టి.వి.రాజు బాణీల్లో జానపద వాణి కలిసొచ్చేలా “పచ్చా పచ్చని చిలకా…” అంటూసాగే పాటలో ముందుగా వినిపించే జానపద సాహిత్యాన్ని ఎవరు మరచిపోగలరు? ‘ఉండమ్మా బొట్టు పెడతా’లో “రావమ్మా మహాలక్ష్మి…”అంటూ సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ హరిదాసు పాడే పాటలో మన సంస్కృతీ సంప్రదాయాలు వెల్లివిరిసేలా చేయించారు. ‘చెల్లెలి కాపురం’లో “చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమన…” అంటూ సినారె కలం సాగేలా చేసి, అందుకు తగ్గ బాణీలను కేవీ మహదేవన్ తో కట్టించేసి, ఎస్పీ బాలును మధురగాయకునిగా జనం ముందు నిలిపిందీ విశ్వనాథ్ లోని కళాతపస్వి అనే చెప్పాలి. “శారదా నను చేరగా… ఏమిటమ్మా సిగ్గా…” అంటూ రామకృష్ణ గళంలో సినారె పాటను చక్రవర్తి స్వరాలతో జోడీ కట్టించి మనసులు దోచిందీ విశ్వనాథుడే! ఇలా చెప్పుకుంటూపోతే ఆయన ప్రతిసినిమాలోనూ సంగీత సాహిత్యాలు పెద్దపీట వేసుకోవడమేకాదు, భావితరాలకు మన భాషలోని తీయదనాన్ని, మన సంగీతంలోని మధురాన్ని, వీటి మాటున మన సంస్కృతీ సంప్రదాయాలనూ మూటకట్టి మరీ అందించాయి. అందుకే మారుతున్న కాలంలో మారని విలువల కోసం కె.విశ్వనాథ్ చిత్రాలను మన పిల్లలకు ఒక్కసారయినా చూపించాలని అంటారు.
విశ్వనాథుని చిత్రాలలో సంగీతం, సాహిత్యం ఎప్పుడూ పెద్ద పీట వేసుకోవడమే కాదు, వాటితో పాటు మన కళలూ పరిఢవిల్లాయి. ‘ఓ సీత కథ’లో హరికథతోనే సినిమాను ఆరంభించడం అందులోని భాగమనే చెప్పాలి. ఇక ‘సూత్రధారులు’లో గంగిరెద్దుల వారి పాటలు, ‘సప్తపది’లో యాదవుల గీతాలు, ‘సిరిసిరిమువ్వ’లో తప్పెట తాళాలు, ‘సీతామాలక్ష్మి’లో మావిచిగురు తిన్న కోకిల గొంతులో పలికిన పాటలు అన్నీ మన మదిలో చేరి మరి బయటకు రాకుండా నిలచిపోతాయి.
ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘శంకరాభరణం’తో కమర్షియల్ చట్రంలో చిక్కుకున్న తెలుగు సినిమాను వెలికి తీసి వెలుగులు విరజిమ్మేలా చేసిందీ విశ్వనాథుల వారే! ‘శంకరాభరణం’లోని ప్రతి పలుకు, ప్రతి పాట, ప్రతి బాణీ మస మనసులను పులకింప చేస్తుంది. వినేకొద్దీ మరీ మరీ వినాలనిపించే పాటలతో మధురమైన అనుభూతిని మన సొంతం చేస్తుంది. ఎస్పీ బాలును జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకునిగా నిలపడం, మహదేవన్ కు కూడా నేషనల్ అవార్డు సంపాదించి పెట్టడం, వాణీ జయరామ్ కూ ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకొనేలా చేయడం అన్నిటినీ మించి ఉత్తమ వినోదభరిత చిత్రంగానూ జాతీయ స్థాయిలో నిలవడం అన్నీ ‘శంకరాభరణం’తో సాధ్యంచేశారు విశ్వనాథ్. ఆ సినిమాతోనే అందరూ ఆయనలోని కళాపిపాసిని చూశారు. ఆ పిపాసిలోని తపననూ మెచ్చారు. అందుకే ‘కళాతపస్వి’గా తమ మదిలోచోటు కల్పించారు.
విశ్వనాథుని చిత్రాలకు సాలూరు రాజేశ్వరరావు, టి.వి.రాజు, కేవీ మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజా, రమేశ్ నాయుడు, విద్యాసాగర్ వంటివారు తమదైన స్వరకల్పనతో ప్రాణం పోశారు. అలాగే తమ ప్రతిభనూ చాటుకొని, పలు పురస్కారాలు సొంతం చేసుకున్నారు. ఇక విశ్వనాథుని ‘ఓ సీత కథ’తోనే వేటూరి చిత్రసీమలో అడుగు పెట్టారు. ‘సిరివెన్నెల’తో సీతారామశాస్త్రి ఇంటిపేరునే మార్చివేశారు విశ్వనాథ్. ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకు వచ్చి మరీ పట్టం కట్టడం విశ్వనాథుని అలవాటు. ఎందరో గాయనీగాయకులు, కవులు, సంగీతదర్శకులు విశ్వనాథ్ చిత్రాలకు పనిచేసి తమ ప్రతిభను చాటుకున్నారు. తెలుగు ఉన్నంత వరకూ విశ్వనాథ్ చిత్రాలు వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాయి. వాటి ద్వారా సదరు సంగీతకళాకారులు, సాహితీకారులు సైతం తెలుగువారి మదిలో తమ చోటును పదిలం చేసుకుంటూనే ఉంటారు.