Site icon NTV Telugu

JV Somayajulu: మరపురాని ‘శంకరాభరణం శంకరశాస్త్రి’!

Jv Somayajulu

Jv Somayajulu

JV Somayajulu Birth Anniversary Special: నటులు జె.వి.సోమయాజులును తెరపై చూడగానే ‘అదుగో శంకరశాస్త్రి…’ అనేవారు జనం. కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రిగా జీవించిన జె.వి.సోమయాజులు పేరు తలవగానే అందులోని ఆయన పాత్రనే మన కళ్ళముందు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ‘శంకరశాస్త్రి’ పాత్ర, సోమయాజులు పేరుకు పర్యాయపదంగా మారింది. ఆ తరువాత కూడా అనేక చిత్రాలలో సోమయాజులు పలు గుర్తింపు ఉన్న పాత్రలే పోషించారు. చివరి రోజుల్లో ‘ఇస్కాన్ సంస్థ’ నిర్మించిన ఓ డాక్యుమెంటరీలో నటించేసి, దేశవ్యాప్తంగానూ ఆయన గుర్తింపు సంపాదించారు.

సోమయాజులు పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట సోమయాజులు. 1928 జూలై 30న సోమయాజులు జన్మించారు. వారి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట మండలంలోని లుకలాం అగ్రహారం. ఆయన సొంత తమ్ముడే ప్రముఖ నటుడు జె.వి.రమణమూర్తి. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లోనే రమణమూర్తి పలు చిత్రాలలో నటించేసి ఆకట్టుకున్నారు. ఈ అన్నదమ్ములిద్దరూ గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకాన్ని విశేషంగా ప్రదర్శించేవారు. గిరీశం పాత్రలో రమణమూర్తి, రామప్ప పంతులుగా సోమయాజులు తెలుగునేలపై తమదైన బాణీ పలికిస్తూ ‘రంగమార్తాండులు’గా వెలుగొందారు. తమ్ముడు చిత్రసీమలో రాణిస్తున్న సమయంలో సోమయాజులు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ సాగారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి డిప్యూటీ కలెక్టర్ స్థాయికి చేరుకున్నారు. ఆ సమయంలోనే యోగి దర్శకత్వంలో రూపొందిన ‘రా రా క్రిష్ణయ్యా’ చిత్రంలో తొలిసారి తెరపై కనిపించారు సోమయాజులు.

అప్పటికే రమణమూర్తి నటునిగా చిత్రసీమలో మంచి పేరు సంపాదించారు. అయినా, అన్నతో కలసి ‘కన్యాశుల్కం’ నాటకాన్ని వందల సంఖ్యలో ప్రదర్శించారు. సోమయాజులు నటన చూసిన విశ్వనాథ్ తన ‘శంకరాభరణం’లో ప్రధాన పాత్రకు ఎంచుకున్నారు. ఆ సమయంలో మహబూబ్ నగర్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్నారు సోమయాజులు. ‘శంకరాభరణం’ విడుదలయ్యాక సోమయాజులు పేరు మారుమోగింది. ఆ ఒక్క చిత్రంతోనే తమ్ముడు రమణ మూర్తి కంటే ఘనకీర్తిని గడించారు సోమయాజులు. అనేక చిత్రాలలో ఆయన కీలక పాత్రలు పోషిస్తూనే మరోవైపు ఉద్యోగ నిర్వహణలోనూ సాగారు. కొన్నాళ్ళకే పదవీ విరమణ చేయడంతో పూర్తి స్థాయిలో నటునిగా కొనసాగారు. విశ్వనాథ్, బాపు వంటి దర్శకులు ఆయనను బాగా ప్రోత్సహించారు.

“సప్తపది, వంశవృక్షం, త్యాగయ్య, పెళ్ళీడు పిల్లలు, నెలవంక, సితార, శ్రీరాఘవేంద్ర, స్వాతిముత్యం, దేవాలయం, విజేత, రక్తాభిషేకం, తాండ్ర పాపారాయుడు, శ్రీషిరిడీ సాయిబాబా మహాత్మ్యం, ఆలాపన, మగధీరుడు, విశ్వనాథ నాయకుడు, స్వరకల్పన, అప్పుల అప్పారావు, ఆదిత్య 369, రౌడీ అల్లుడు, అల్లరి మొగుడు, సరిగమలు” వంటి చిత్రాలలో గుర్తున్న పాత్రలు పోషించారు. ఆయన చివరగా ‘భాగమతి’ అనే హిందీ చిత్రంలో నటించారు. 2004 ఏప్రిల్ 27న సోమయాజులు తుదిశ్వాస విడిచారు. ఈ నాటికీ జనం మదిలో ‘శంకరశాస్త్రి’గానే నిలిచారు సోమయాజులు.

Exit mobile version