టాలీవుడ్‌లో ప్రతి వారం కొత్త సినిమా విడుదలవుతోంది. ఈ వారం (జూలై 1) కూడా పలు కొత్త సినిమాలు విడుదలకు క్యూ కట్టాయి. అయితే వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్న నేపథ్యంలో ఈ వారం విడుదలయ్యే సినిమాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలేంటో చేసేద్దాం పదండి.
పక్కా కమర్షియల్
గోపీచంద్ అంటే యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. దర్శకుడు మారుతి కూడా సపరేట్ ట్రాక్‌లో సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. తన సినిమాల్లో హీరోకు ఏదో ఒక సమస్య పెట్టి ఆ పాయింట్ చుట్టూ కథను తిప్పుతుంటాడు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ జూలై 1న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీలో గోపీచంద్ లాయర్ పాత్రలో నటించాడు. ఆయన తండ్రిగా సత్యరాజ్, విలన్ పాత్రలో రావు రమేష్ నటించారు. టికెట్ రేట్లు తగ్గించడం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అంశంగా పరిగణిస్తున్నారు.
ఏనుగు
అరుణ్‌విజయ్, ప్రియభవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం ఏనుగు. ‘సింగం’ సినిమాల ఫేమ్ హరి దర్శకత్వం వహించగా… సీహెచ్ సతీష్‌కుమార్ నిర్మించారు. ఈ మూవీ జూలై 1న థియేటర్లలో విడుదల కాబోతోంది. సమాజంలో సమస్యలను స్పృశిస్తూనే వినోదం పంచే చిత్రంగా తెరకెక్కించినట్లు యూనిట్ వెల్లడించింది. ఇందులోని సందేశం ఆలోచింపజేస్తుందని తెలిపింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది.
అన్యాస్ ట్యుటోరియల్
రెజీనా, నివేదితా సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అన్యాస్ ట్యుటోరియల్’. తెలుగు, తమిళ భాషల్లో జూలై 1న ఈ మూవీ ఆహా ఓటీటీలో విడుదల కానుంది. హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ జనాలను భయపెట్టిస్తోంది. ఆర్కా మీడియా పతాకంపై నిర్మించిన వెబ్ సిరీస్ ఇది.
గంధర్వ
సందీప్ మాధవ్, గాయత్రి ఆర్.సురేష్ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’. అఫ్సర్ దర్శకుడు. సురేష్ కొండేటి నిర్మాతగా వ్యవహరించారు. సాయికుమార్, సురేష్, బాబు మోహన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను జూలై 1న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. యాంటి ఏజింగ్ అనే ఓ విభిన్నమైన అంశంతో ఈ కథను తీర్చిదిద్దారు.
టెన్త్ క్లాస్ డైరీస్
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు ‘వెన్నెల’ రామారావు పదో తరగతి బృందంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అవికా గోర్, శ్రీరామ్‌లకు ఈ సినిమా ఎలాంటి ఫలితం అందిస్తుందో వేచి చూడాలి.
ధాకడ్
బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ నటించిన మూవీ ధాకడ్. కంగనా కెరీర్‌లో ఈ సినిమా అతి పెద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. రజనీష్ ఘయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ సగటు ప్రేక్షకుడిని మెప్పించటంలో విఫలమైంది. ఈ మూవీ జీ5 ఓటీటీలో జూలై 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అటు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ కూడా అమెజాన్ ప్రైమ్ వేదికగా జూలై 1 నుంచి అందుబాటులోకి రానుంది.
పై వాటితో పాటు థియేటర్లలో ‘రాకెట్రీ, షికారు, ఏమైపోతానే, ఈవిల్ లైఫ్, బాల్రాజ్’ సినిమాలు సైతం రిలీజ్ అవుతున్నాయి.