ఒకప్పుడు అమెరికా అమ్మాయిల కలల రాకుమారుడుగా సాగారు నటుడు బెన్ అఫ్లెక్. ఆ పై నటునిగా దర్శకునిగా తనదైన శైలిలో బెన్ అఫ్లెక్ ప్రతిభను చాటుకున్నారు. ఆయనకు ‘జెన్నిఫర్’ అనే పేరంటే ఎంతో ఇష్టం అనిపిస్తుంది. ఆయన మొదటి భార్య నటి, గాయని జెన్నిఫర్ గార్నర్, రెండో భార్య జెన్నిఫర్ లోపెజ్. ఈమె కూడా నటి, గాయని కావడం విశేషం! గార్నర్ తో కలసి బెన్ అఫ్లెక్ ఓ పదమూడేళ్ళు కాపురం చేశారు. ఈ దంపతులిద్దరికీ ముగ్గురు పిల్లలు – ఇద్దరమ్మాయిలు, ఓ అబ్బాయి. వయొలెట్ అన్నే అఫ్లెక్, రోజ్ ఎలిజబెత్ అఫ్లెక్ అమ్మాయిలు- అబ్బాయి పేరు సామ్యుయేల్ గార్నర్ అఫ్లెక్. తన ముగ్గురు పిల్లలకు తండ్రి సినిమాలంటేనే ఎక్కువ ఇష్టమని, తాను నటించిన మూవీస్ ను అంతగా చూడటానికి ఇష్టపడరని ఇటీవల జెన్నిఫర్ గార్నర్ సెలవిచ్చారు.
నటునిగా తండ్రి బెన్ ను ఎక్కువగా ఇష్టపడ్డా, తల్లిగా తనంటే ముగ్గురు పిల్లలూ ప్రాణమిస్తారని జెన్నిఫర్ గార్నర్ తెలిపారు. బెన్, జెన్నీఫర్ లోపెజ్ ప్రేమాయణం ఎప్పటి నుంచో సాగుతున్నా, ఆయనకు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండమని తానే చెప్పినట్టు గార్నర్ గుర్తు చేసుకున్నారు. పిల్లల కోసమనే కాదు, తన జీవితంలో బెస్ట్ ఫ్రెండ్స్ లో బెన్ ఎప్పుడూ తనతో ఉంటాడనీ గార్నర్ అంటున్నారు. తన పిల్లలకు తాను కన్నీరు పెట్టడం ఏ మాత్రం ఇష్టం ఉండదని, అందువల్లే తాను నటించిన చిత్రాల్లో ఏడుపు సీన్స్ ఉన్నాయో లేదో తెలుసుకొని మరీ చూసేవారనీ గార్నర్ గుర్తు చేసుకొని మరీ మురిసిపోతున్నారు. ఏది ఏమైనా టీనేజ్ లో ఉన్న తన కూతుళ్ళకు, పదకొండేళ్ళ తన కొడుక్కి బెన్ సినిమాలంటేనే ఇష్టమని, తండ్రి ఎవరితో రొమాన్స్ చేసినా వారేమీ పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తుంటారనీ గార్నర్ చెబుతున్నారు. తన పిల్లలకు తనపై ఎంతో నమ్మకముందని ఓ తల్లిగా అంతకంటే ఏం కావాలనీ జెన్నీఫర్ గార్నర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి మాజీ భార్య తనపైనా, పిల్లలపైనా కురిపిస్తున్న ప్రేమను చూసి ఏమంటారో!?