కులమతాల చిచ్చుతో రగిలిపోతున్న ప్రస్తుత సమాజానికి వెయ్యేళ్ల నాటి సమానత్వ సందేశాన్ని వెండితెరపైకి తీసుకొస్తోంది ‘జయహో రామానుజ’ మూవీ. కేవలం కాసుల వేటలో పడిపోయిన నేటి సినీ పరిశ్రమలో, లాభాపేక్ష లేకుండా కేవలం ఒక మహనీయుడి ఆశయాలను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా లయన్ డా. సాయి వెంకట్ ఈ సాహసోపేతమైన ప్రాజెక్టును భుజాన వేసుకున్నారు. పాన్ ఇండియా ట్రెండ్‌ను దాటి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఏకంగా ‘సంస్కృతం’లో కూడా ఈ చిత్రాన్ని ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 24న విడుదల చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సమాజంలో అంటరానితనాన్ని పారద్రోలి, మానవత్వమే మతమని చాటిన గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త, సామాజిక సంస్కర్త రామానుజాచార్యుల జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కింది. ఈ చిత్రానికి సాయి వెంకట్ దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
సుదర్శనం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి ప్రసన్న, ప్రవళ్లిక ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో మరో విశేషమేమిటంటే.. నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ప్రవళ్లిక, నటనపై ఉన్న మక్కువతో ఈ సినిమాలో కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి వంటి విభిన్నమైన పౌరాణిక పాత్రల్లో నటించడం సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అమెరికా నటి జో శర్మ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా, సీనియర్ నటుడు సుమన్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. పాతికేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సాయి వెంకట్‌కు తన మొదటి హీరో సుమన్‌తో మళ్లీ ఈ ప్రాజెక్ట్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చారిత్రక, ఆధ్యాత్మిక కథను తెరకెక్కించడం కత్తిమీద సాము లాంటిదని, అయితే దర్శకుడు సాయి వెంకట్‌కు ఉన్న పట్టుదల, నిబద్ధత చూసే తాను ఈ ప్రాజెక్టులో భాగమయ్యానని సుమన్ స్పష్టం చేశారు. కమర్షియల్ హంగులకు దూరంగా, మనుషుల మధ్య ఐక్యతను చాటిచెప్పే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడాలని చిత్ర యూనిట్ కోరుతోంది.

