Jasmin Bhasin: స్టంట్ చేస్తూ జ్ఞాపకశక్తి కోల్పోయిన నటి.. బిత్తరపోయిన షో నిర్వాహకులు!

Jasmin Bhasin (2)

Jasmin Bhasin (2)

Jasmin Bhasin: ప్రముఖ టీవీ నటి జాస్మిన్ భాసిన్ స్టంట్ బేస్డ్ రియాలిటీ షో ‘ఖత్రోన్ కే ఖిలాడి’ సీజన్ 15లో ఒక భయంకరమైన ప్రమాదానికి గురై తాత్కాలికంగా జ్ఞాపకశక్తిని కోల్పోయారు. షోలో భాగంగా నీరు, గాలితో కూడిన ఒక కఠినమైన యాక్షన్ స్టంట్ చేస్తుండగా, ఆమె ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోవడంతో తలకు స్వల్ప గాయం అయింది. ఈ ప్రమాదం కారణంగా స్టంట్ ముగిసిన వెంటనే ఆమెకు కొన్ని గంటల పాటు అసలు ఏం జరిగిందనే విషయం గుర్తుకు రాకపోవడంతో హోస్ట్ రోహిత్ శెట్టితో పాటు షోలో ఉన్నవారు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ స్టంట్ గురించి ఇప్పటికీ తనకు ఏమీ గుర్తులేదని జాస్మిన్ చెప్పడం ఈ ఘటనను మరింత చర్చనీయాంశంగా మార్చింది.

స్టంట్ ముగిసిన తర్వాత రోహిత్ శెట్టిని కలిసిన జాస్మిన్ పదేపదే తనకు ఏం జరిగిందో గుర్తులేదని చెబుతుండటంతో అక్కడున్న వారంతా కంగారుపడ్డారు. ఆమె ముఖంలో అయోమయం కనిపించగా, రోహిత్ ఆమెను ప్రశాంతంగా ఉండమని ధైర్యం చెప్పారు. వెంటనే షో వైద్య బృందం రంగంలోకి దిగి పరీక్షలు నిర్వహించి, తాత్కాలిక జ్ఞాపకశక్తి లోపం వచ్చినట్లు గుర్తించింది. అనంతరం ఆమెకు మూడు రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించింది.

ఈ ఘటనపై తర్వాత జాస్మిన్ కూడా స్పందించారు. ఆ స్టంట్ తన జీవితంలో అత్యంత విచిత్రమైన అనుభవాల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు. ఇప్పటికీ ఆ క్షణంలో ఏం జరిగిందో తనకు గుర్తులేదని, ఆ విషయం గురించి తానే ఆశ్చర్యపోతున్నానని వెల్లడించారు. తనను వెంటనే వైద్య సహాయం అందించి జాగ్రత్తగా చూసుకున్న రోహిత్ శెట్టి, షో నిర్వాహకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘ఖత్రోన్ కే ఖిలాడి 15’ వరుసగా మూడో వారమూ స్టంట్ల కారణంగానే చర్చలో నిలవడం గమనార్హం. తొలి వారంలో పెల్లెట్ గన్ టాస్క్‌పై విమర్శలు వెల్లువెత్తగా, గత వారం పోటీదారుల చేతులపై వేడి మైనం పోసిన స్టంట్ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇప్పుడు జాస్మిన్‌కు జరిగిన ఈ ఘటనతో షోలో భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చ మొదలైంది.

ఇక జాస్మిన్ భాసిన్ విషయానికి వస్తే.. టెలివిజన్ రంగంతో పాటు సౌత్, పంజాబీ చిత్ర పరిశ్రమలలో పలు క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటించారు. తెలుగులో అల్లరి నరేష్ సరసన ‘3G లవ్’ తో పాటు ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’ చిత్రాలలో నటించిన ఆమె, హిందీ టెలివిజన్ రంగంలో ‘తషన్-ఎ-ఇష్క్’, ‘దిల్ సే దిల్ తక్’ ప్రసిద్ధ సూపర్‌నేచురల్ సిరీస్ ‘నాగిన్ 4’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రియాలిటీ షోలు అయిన బిగ్ బాస్ 14 (Bigg Boss 14), ది ట్రేటర్స్ ఇండియా లలో కంటెస్టెంట్‌గా అలరించిన జాస్మిన్, ప్రస్తుతం పంజాబీ సినిమాలపై దృష్టి పెట్టారు. ఆమె కథానాయికగా నటించిన తాజా పంజాబీ చిత్రం ‘జుదా’ 2026 ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కాబోతోంది.