NTV Telugu Site icon

Oscar: ‘ఆస్కార్’ మరచిపోలేని విల్ స్మిత్ దెబ్బ!

Wilsmith

Wilsmith

Oscar: ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంటుంది. ఈ సారి ఆస్కార్ ప్రదానోత్సవం భారతీయులకు, అందునా మన తెలుగువారికి మరింత ఆసక్తి కలిగించక మానదు. ఎందుకంటే రాజమౌళి తెరకెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ద్వారా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆ సినిమాలోని ‘నాటు నాటు…’ పాట నామినేషన్ సంపాదించింది. ఇదిలా ఉంటే ఈ సారి ఆస్కార్ నామినేషన్స్ సంపాదించిన వారందరికీ ఇటీవల ఏర్పాటు చేసిన ‘లంచన్’లో కొన్ని నవ్వుల పువ్వులు చోటు చేసుకున్నాయి.

ఈ వేడుకలో స్టీవెన్ స్పీల్ బెర్గ్, మైఖేల్ విలియమ్స్, ఆస్టిన్ బట్లర్, ఏంజెలా బాసెట్, హాంగ్ చువా, బ్రెండన్ ఫ్రాసెర్ వంటి వారితో పాటు టాప్ స్టార్ టామ్ క్రూయిజ్ కూడా పాలు పంచుకున్నాడు. టామ్ క్రూయిజ్ నటించిన ‘టాప్ గన్- మేవరిక్’ బెస్ట్ పిక్చర్ కేటగిరీలో నామినేషన్ సంపాదించింది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరిగా టామ్ ఈ లంచన్ లో పాల్గొన్నాడు. ఇది వరకు ఎన్నడూ ఎరగని ఆనందం టామ్ లో కనిపించిందని చూసిన వారు చెబుతున్నారు. తాను ఎంతో ‘ఎంజాయ్’ చేశానని టామ్ సైతం పేర్కొన్నాడు. టామ్ భలే హుషారుగా అందులో పాల్గొన్న నటీనటులతో, దర్శకనిర్మాతలతో ఫోటోలు తీయించుకోవడంతోనే అతనెంత ఆనందంగా ఉన్నాడో అర్థమైందని అంటున్నారు హాలీవుడ్ జనం. ఈ ‘లంచన్’లో పాల్గొన్నవారిని ఉద్దేశించి, ఆస్కార్ అకాడమీ ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ చేసిన వ్యాఖ్యలు కూడా అందరిలోనూ నవ్వులు పూయించాయి. ఎందుకంటే ఆమె ఎక్కువగా గత యేడాది ఆస్కార్ వేడుకలో విల్ స్మిత్ చేయిచేసుకున్న అంశం గురించే మాట్లాడారు.

గత సంవత్సరం హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ ఆస్కార్ అవార్డుల వేడుకలో వ్యాఖ్యాత క్రిస్ రాక్ పై చేయి చేసుకోవడాన్ని ఎవరూ మరచిపోలేదు. అది విచారకరమైన సంఘటన అని, అది పునరావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత అకాడమీ మీదనే ఉందనీ జానెట్ యాంగ్ అన్నారు. ఈ సంఘటన ద్వారా అకాడమీ మరింత పారదర్శకంగా ఉండాలని నిర్ణయించిందని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన వ్యక్తిగత ప్రతిష్ఠ కోసమే కాదు, చిత్రపరిశ్రమ గౌరవాన్నీ పరిరక్షించవలసి ఉంటుందని ఆమె చెప్పారు. అకాడమీ కూడా అత్యున్నత ప్రమాణాలను అనుసరించి, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటుందనీ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవం రోజున విజేతలు తమ ప్రసంగంలో 45 సెకండ్లకు మించి మాట్లాడరాదన్న నియమాన్నీ పదే పదే గుర్తు చేశారు. అంటే… 45 సెకండ్లకు మించి మాట్లాడితే ఎవరైనా కొట్టే ప్రమాదం ఉందా? అంటూ అతిథుల్లో కొందరు వ్యాఖ్యానించడం మరిన్ని నవ్వులు పూసేలా చేసింది.

Show comments