తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టడంతో ఆయన అభిమానులు సంబరాలు ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఇదే జోష్ లో తమ హీరో నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ రిలీజ్ చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. ఈ సినిమా కోలీవుడ్ చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని 1000 కోట్ల రూపాయల వసూళ్ల మార్కును టచ్ చేస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘బాహుబలి 2’, ‘RRR’ వంటి చిత్రాలు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరినా ఒక కోలీవుడ్ స్టార్ హీరో సోలోగా ఈ ఫీట్ అందుకోవడం ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ఈ అరుదైన రికార్డును తన రిటైర్మెంట్ మూవీగా వస్తున్న ‘జననాయగన్’ తో విజయ్ సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయనకున్న ప్రస్తుత క్రేజ్ ఈ వసూళ్లకు దోహదపడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సినిమా విడుదలకు ముందే కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్ర యూనిట్‌ను కలవరపెడుతోంది. మరోవైపు ఓటీటీ హక్కుల విషయంలో కూడా ప్రతిష్టంభన నెలకొంది. లీకేజీ కారణంగా మరియు ఇతర కారణాల వల్ల సదరు ఓటీటీ సంస్థ తన డీల్‌ను క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిర్మాతలకు కొంత ఇబ్బందికర పరిణామమే అని చెప్పాలి. రాజకీయంగా విజయ్ భవిష్యత్తుపై క్లారిటీ వచ్చేసింది, ఆయన సీఎం అయ్యారు. కానీ ‘జననాయగన్’ విడుదల ఎప్పుడు ఉంటుందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. సెన్సార్ సర్టిఫికెట్ కారణంగా రిలీజ్ డేట్ తేదీ వస్తోంది. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో విజయ్ తన చివరి సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తే రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం.
