విశ్వవిఖ్యాత నటరత్న నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన జానపదాల్లో అనేకం మేటి చిత్రాలుగా నిలిచాయి. వాటిలో యన్టీఆర్ హీరోగా కేవీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగదేకవీరుని కథ’ జనం మెచ్చే కథ,కథనంతో పాటు సంగీతసాహిత్యాలతోనూ అలరించింది. ఈ చిత్రం ఆగస్టు 9తో అరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. 1961 ఆగస్టు 9న విడుదలైన ‘జగదేకవీరుని కథ’ చిత్రం అనూహ్య విజయం సాధించి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది.
యన్టీఆర్ – కేవీ రెడ్డి హ్యాట్రిక్!
యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన ఘనత నిస్సందేహంగా దర్శకుడు కేవీ రెడ్డికే దక్కుతుంది. ఆయన దర్శకత్వంలో విజయా సంస్థ నిర్మించిన ‘పాతాళభైరవి’ అఖండ విజయంతోనే రామారావు తెలుగువారి తొలి సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్నారు. అంతకు ముందు చిత్తూరు నాగయ్య, సిహెచ్. నారాయణరావు వంటి నటులు స్టార్స్ గా సాగినా, వారెవరికీ యన్టీఆర్ స్థాయిలో జనం పూజలు చేయలేదు. ‘పాతాళభైరవి’ తోటరాముడుగా యన్టీఆర్ జనం మదిని దోచారు. ముఖ్యంగా మహిళాభిమానులను విశేషంగా సంపాదించుకున్నారు. ఈ సినిమాను చూసి ఎంతోమంది అమ్మాయిలు ఆయనను ఆరాధించారు. అలాంటి వారు తరువాతి రోజుల్లో ఆయన సరసన నాయికలుగా నటించడమూ విశేషం.
ఆ తరువాత యన్టీఆర్ తో కేవీ రెడ్డి రూపొందించిన ‘మాయాబజార్’ చిత్రంతో అపర శ్రీకృష్ణునిగా జన హృదయాల్లో నిలచిపోయారు రామారావు. ఇక అప్పటినుంచీ యన్టీఆర్ తిరుగులేని కథానాయకునిగా చిత్రసీమలో సాగుతున్నారు. యన్టీఆర్ హీరోగా కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మూడో చిత్రం ‘జగదేకవీరుని కథ’.
జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న ఓ చిన్న కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఓ రాజు పెద్దకొడుకు, దేవకన్యలను వరించి, వారిని తన ప్రతిభతో మెప్పించి భార్యలుగా చేసుకోవడం అనే కథ ఆధారంగానే ఈ సినిమా రూపొందింది. ఈ కథతోనే 1944లో ‘జగదల ప్రతాపన్’ అనే తమిళ చిత్రం రూపొందింది. ఆ సినిమా మంచివిజయం సాధించింది. ఆ కథను చూసిన కేవీ రెడ్డికి తెలుగులో ఆ సినిమాను రూపొందించాలన్న సంకల్పం కలిగింది. ఇదే విషయాన్ని విజయాధినేతలు చక్రపాణి, నాగిరెడ్డికి కూడా వివరించారు. అయితే వారు ఆ కథ విని మొదట్లో నీళ్ళు నమిలారు. దాంతో కేవీ రెడ్డి, స్టూడియో బ్యానర్ పై తానే నిర్మాత, దర్శకునిగా ‘జగదేకవీరుని కథ’ తీస్తానని చెప్పారు. అయితే కేవీ రెడ్డి పట్టుదల చూసిన నాగిరెడ్డికి తప్పకుండా ఆయన ఏదో మ్యాజిక్ చేయబోతున్నారని అనిపించింది. అందుకే స్టూడియో పేరుపైన విజయా బ్యానర్ తోనే ‘జగదేకవీరుని కథ’ తెరకెక్కించాలన్న ఒప్పందం కుదిరింది. స్టూడియో అధినేతల్లో ఒకరైన చక్రపాణి జోక్యం గురించి కేవీ రెడ్డికి తెలుసు. అందువల్లే చక్రపాణి జోక్యం ఏ మాత్రం ఉండరాదనీ నిక్కచ్చిగా చెప్పాకే సినిమా ఆరంభించారు. ‘జగదేకవీరుని కథ’ కూడా అఖండ విజయం సాధించడంతో యన్టీఆర్ తో కేవీ రెడ్డి హ్యాట్రిక్ సాధించినట్టయింది. యన్టీఆర్ తో కేవీ రెడ్డి తెరకెక్కించిన మూడు చిత్రాలు వరుసగా ‘విజయా’ బ్యానర్ పైనే రూపొందడం విశేషం.
కేవీ రెడ్డి శైలి!
కొయంబత్తూరుకు చెందిన ఎస్.ఎమ్.శ్రీరాములు నాయుడు 1944లో పి.యు.చిన్నప్ప హీరోగా ‘జగదల ప్రతాపన్’ రూపొందించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అందువల్ల ఆ చిత్రాన్ని చూసి, 1961 వాతావరణానికి తగ్గట్టుగా కథను మలిచారు రచయిత పింగళి నాగేంద్రరావు, కేవీ రెడ్డి. ఇక కేవీ రెడ్డి అంతకు ముందు చిత్రాలకు పాటలతో పసందు చేసిన పింగళి ఈ చిత్రానికి కూడా పాటలతో అలరించే ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో కథ, మాటలు, పాటలు పూర్తయిన తరువాత సన్నివేశానికి తగ్గట్టుగా నటీనటుల నుండి నటన రాబట్టుకొనేవారు. ఈ విషయంలో కేవీ రెడ్డి మరో మెట్టు పైనే ఉండేవారు. ప్రతి సన్నివేశాన్ని స్టాప్ క్లాక్ తో కౌంట్ చేసి మరీ ఎన్ని నిమిషాలు వస్తే, అంతే నిడివితో తెరకెక్కించే ప్రయత్నం చేసేవారు. అందుకోసం నటీనటులతో అనేక రిహార్సల్స్ చేయించేవారు. తనకు నచ్చే దాకా కేవీ రెడ్డి రిహార్సల్స్ చేయించి, తరువాతే షాట్ కు వెళ్లేవారు. ఆయన ఎప్పుడూ షాట్ ఓకే అని అనేవారు కాదు. కేవలం ‘పాస్’ అనేవారు. ఆయన టెక్నిక్ బాగా తెలిసిన వారు కాబట్టి యన్టీఆర్, రేలంగి, గిరిజ, ముక్కామల, ఋష్యేంద్రమణి వంటివారు ఇట్టే ఆయనను మెప్పించేవారు. ఈ సినిమాతో కేవీ రెడ్డి దర్శకత్వంలో బి.సరోజాదేవి, ఎల్.విజయలక్ష్మి, కమలకుమారి (తరువాతి రోజుల్లో జయంతిగా పేరు మార్చుకుంది), బాల నటించారు. వారు కూడా యన్టీఆర్, మరికొందరు సీనియర్స్ సూచనలతో ఇట్టే కేవీ రెడ్డిని ఆకట్టుకోగలిగారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలోనే కేవీ రెడ్డి స్క్రిప్ట్ లో ఏ రోజు, ఏ షాట్ ఎలా తీయాలి అన్న విషయాలు కూడా క్షుణ్ణంగా రాసుకొనేవారు. ఈ సినిమా షూటింగ్ లో “జలకాలాటలలో…” పాటను నీటిలో చిత్రీకరించాలి. అది షెడ్యూల్స్ ప్రకారం చలికాలంలో తీయాల్సి ఉంది. కాబట్టి, నలుగురు హీరోయిన్లకు చలికి వణుకు పుట్టకుండా, గోరువెచ్చని నీళ్ళు సప్లై చేయాలని కేవీ స్క్రిప్ట్ లో రాసుకున్నారు. అంటే దీనిని బట్టే కేవీ రెడ్డి ఎంత నిబద్ధతతో ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. ఇలా మొత్తం సీన్స్ తో స్క్రిప్ట్ పూర్తిచేసుకున్నాక, పాటల పర్వంలో అడుగు పెట్టారు. అది మరో పరీక్షగా నిలచిందనే చెప్పాలి.
పాటల సందడి…
‘జగదేకవీరుని కథ’తోనే సంగీత దర్శకుడు సెండ్యాల నాగేశ్వరరావు తొలిసారి విజయా సంస్థలో పనిచేశారు. అందువల్ల తన ప్రతిభను చాటుకోవాలని ఆయనా తపించారు. కేవీ రెడ్డికి నచ్చేంత వరకూ పలు ట్యూన్స్ వినిపించారు. అన్నిపాటలూ ఓ ఎత్తు అయితే, “శివశంకరీ శివానందల హరీ…” పాట మరో ఎత్తు అని చెప్పాలి. ఈ పాటను రాయడానికి పింగళి ఒరిజినల్ ‘జగదల ప్రతాపన్’ చూశారు. ఆ చిత్రానికి జి.రామనాథన్ సంగీత దర్శకుడు. ఆ పోకడలు లేకుండా తన బాణీలు పలికించాలని పెండ్యాల భావించారు. ఇక పింగళివారు సైతం దానిని సవాల్ గా తీసుకొని “శివశంకరీ శివానందలహరి..” పాటను ఐదారు పేజీలు రాశారు. కేవీ రెడ్డి, పెండ్యాల కలసి దానిని కుదించారు. తరువాత ఆ పాటను ఘంటసాల వంటి మేటి గాయకుడు సైతం వారం రోజులు ప్రాక్టీస్ చేసి, తరువాత సింగిల్ టేక్ లో పూర్తి చేశారు. అలాగే యన్టీఆర్ కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ లోనూ పాల్గొనేవారు. ఘంటసాల పాడుతూ ఉంటే గమనించి, అదే తీరున తాను లిప్ మూవ్ మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ పాట వెనుక ఇంతటి కథ ఉంది కాబట్టే, తెరపై యన్టీఆర్ ఐదుగురుగా కనిపిస్తూ అద్భుతంగా నటించగలిగారు.
ఇందులోని అన్ని పాటలూ జనాదరణ పొందాయి. సినిమా ప్రారంభంలోనే “జయజయ జగదేకప్రతాపా…” పాటతోనే ప్రేక్షకులను ఓ మూడ్ లోకి తీసుకుపోయారు కేవీ రెడ్డి. తరువాత వచ్చే “జలకాలాటలలో…”, “ఓ సఖీ…ఓ చెలీ…”, “నను దయగనవా… “, “వరించి వచ్చిన మానవవీరుడు…”, “కొప్పు నిండా పూలేమే…”, “అయినదేమో అయినదీ…”, “ఆశా ఏకాశా…నీ నీడను మేడలు కట్టేశా…”, “మనోహరముగా మధురమధురముగా…”, “ఆదీలక్ష్మీ వంటి అత్తాగారివమ్మా…”, “రా రా కనరారా…” , “శివశంకరీ…శివానందలహరి…” వరుసగా ఒకదానిని మంచి మరోటి అలరిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచాయి. ఇంద్రలోకంలో వినిపించే పద్యాలు సైతం జనాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇలా రూపొందిన ‘జగదేకవీరుని కథ’ మ్యూజికల్ హిట్ గా నిలచింది. ఈ చిత్రం పాటల రికార్డులు ఆ రోజుల్లో రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. ఇక ఇందులోని “శివశంకరీ… శివానందలహరి…” పాట రేడియోలో వినిపించేటప్పుడు దారిలో పోయే జనం సైతం ఆగి మరీ వినేవారు. ఈ పాటను సంగీతకళాకారులు సాధన చేసి తమ కళకు మరిన్ని వన్నెలు అద్దుకొనేవారు. ఈ పాటను పాడి ఎందరో గాయకులు పలు బహుమానాలు సంపాదించిన దాఖలాలూ ఉన్నాయి. అప్పుడే కాదు, ఇప్పటికీ “శివశంకరీ…” పాటను గాయనీగాయకులు సాధన చేస్తూనే ఉండడం విశేషం. ఇందులోని సంగతులు, విరుపులు అన్నీ కూడా పాటకు ఎంతో వన్నె తెచ్చాయి. కాబట్టే కాలపరీక్షకు సైతం నిలచి ఇంకా జనం మదిని గెలుస్తూనే ఉంది ఈ పాట.
కథ జనాల్లో బాగా నానినదే అయినా, దానిని కేవీ రెడ్డి రూపొందించిన తీరు ప్రేక్షకులను రంజింప చేసింది. ఇందులోని హాస్య సన్నివేశాలు సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. జగదేక ప్రతాపునిగా యన్టీ రామారావు నటించగా, ఇంద్రకుమారి జయంతిగా బి.సరోజాదేవి, నాగకుమారిగా ఎల్.విజయలక్ష్మి, వరుణ కుమారిగా కమలకుమారి (జయంతి), అగ్నికుమారి మరీచిగా బాల నటించారు. రెండు చింతలు పాత్రలో రేలంగి, ఏకాశగా గిరిజ, త్రిశోక మహారాజుగా రాజనాల, బాదారాయణ ప్రెగ్గడగా సీఎస్సార్, పాత మంత్రిగా వంగర, కథానాయకుని తండ్రి మహారాజుగా ముక్కామల, తల్లిగా ఋష్యేంద్రమణి, జగదేక ప్రతాపుని సోదరుడు జగజ్జిత్ గా లంకా సత్యం, పార్వతీదేవిగా కన్నాంబ అభినయించారు. ఎవరికి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. రాజకుమారునిగా యన్టీఆర్ ఎంతో అందంగా కనిపించారు. అలాగే దేవకన్యలను తన సొంతం చేసుకోవడం కోసం జయంతి వస్త్రాన్ని దోచుకొని, పారిపోయే సన్నివేశంలో అమాయకంగా ఆయన నటించిన తీరు ఈ నాటికీ అలరిస్తుంది. భార్యల వియోగంతో బాధపడే సన్నివేశంలోనూ రామారావు నటన జనాన్ని మురిపించింది. ఇక జయంతిగా బి.సరోజాదేవి ముద్దు ముద్దు మాటలు భలేగా ఆకట్టుకున్నాయి. ఎల్.విజయలక్ష్మికి ఇందులో తరువాతి కాలంలో గాయనిగా మారిన రమోలా డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ రమోలా కవి శ్రీశ్రీకి, నటుడు రాజబాబుకు మరదలు అవుతుంది.
తన షరతులకు అంగీకరించిన తరువాతే కేవీ రెడ్డి విజయా పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. అందుకే నిర్మాత, దర్శకునిగా ఆయన పేరే ప్రకటించుకున్నారు. విజయా బ్యానర్ పై నాగిరెడ్డి, చక్రపాణి పేర్లు లేకుండా రూపొందిన ఏకైక చిత్రం ఇదేనని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే విశేషాదరణను చూరగొంది. దాదాపు 30 కేంద్రాలలో అర్ధశతదినో్త్సవం చేసుకుంది. మొదటి రన్ లో 18 కేంద్రాలలో శతదినోత్సవం చూసిన ఈ చిత్రం తరువాత మరో నాలుగు కేంద్రాలలోనూ వంద రోజులు ప్రదర్శితమయింది. ఈ చిత్రానికి అయిన వ్యయానికి నాలుగు రెట్లు లాభాలు ఆర్జించడం విశేషం. అప్పట్లో ఈ విషయాన్ని ట్రేడ్ పండిట్స్ విశేషంగా చెప్పుకొనేవారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు రిపీట్ రన్స్ చూస్తూ ‘జగదేకవీరుని కథ’ నిర్మాతలకు, పంపిణీదారులకు లాభాలు తెస్తూనే ఉండింది. ఇక తమిళ,కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా భాషల్లోకి అనువాదమై ‘జగదేకవీరుని కథ’ అక్కడా విజయఢంకా మోగించింది.
యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణతో విజయాధినేత నాగిరెడ్డి తనయులు నిర్మించిన భారీ జానపద చిత్రం ‘భైరవద్వీపం’లోనూ ‘జగదేకవీరుని కథ’ను పోలిన సన్నివేశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా తనయుడు కష్టాల్లో ఉన్నప్పుడు తల్లి పాడే “అమ్మా…శాంభవి…” పాట ‘జగదేకవీరుని కథ’లోని “నను దయగనవా… నా మొరవినవా…” పాటను తలపిస్తుంది. ఇక “శ్రీతుంబర నారద గానామృతం…” పాటను చూడగానే ‘జగదేకవీరుని కథ’లోని “శివశంకరీ శివానందలహరి…” గుర్తుకు రాకమానదు. ఇప్పటికీ ‘జగదేకవీరుని కథ’ బుల్లితెరపై ప్రదర్శితమవుతూ ఉంటే ఆబాలగోపాలం చూసి ఆనందిస్తూనే ఉన్నారు. దీనిని బట్టే ‘జగదేకవీరుని కథ’ మహత్తు ఏమిటో అర్థం చేసుకోవచ్చు.