మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ‘గాడ్ ఫాదర్’ టీజర్ రిలీజ్ చేస్తూ, విడుదల తేదీనీ నిర్మాతలు ప్రకటించారు. అక్టోబర్ 5వ తేదీ దసరా కానుకగా ‘గాడ్ ఫాదర్’ సినిమా జనం ముందుకు రాబోతోందని తెలిపారు. విశేషం ఏమంటే… అదే రోజున అక్కినేని నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ కూడా విడుదల కావాల్సి ఉంది. ఈ తేదీని చాలా ముందుగానే నాగార్జున చిత్ర నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఇవాళ తెలుగు చిత్రసీమ ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజున విడుదల కావడం అనేది అంత మంచిది కాదనే మాటలు వినిపిస్తున్నాయి. దాంతో నాగార్జున ‘ది ఘోస్ట్’ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందనే వార్తలూ వస్తున్నాయి. బట్… ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాతలు ఇంతవరకూ తెలియచేయలేదు. పండగ రోజుల్లో ఇద్దరు స్టార్స్ నటించిన సినిమాలు ఒకేసారి విడుదలైన దాఖలాలు గతంలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఇద్దరు, ముగ్గురు అగ్రకథానాయకుల సినిమాలూ వచ్చి భారీ కలెక్షన్స్ ను రాబట్టిన ఉదాహరణలూ లేకపోలేదు. సో… ఆ నమ్మకంతో చిరంజీవి – నాగార్జున సినిమాలను నిర్మాతలు అక్టోబర్ 5నే విడుదల చేస్తే… అదో సంచలనం అవుతుంది. ఎందుకంటే ఇంతవరకూ ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ఒక్కసారి కూడా ఒకే రోజున విడుదల అయ్యిందే లేదు! సో… ఇదే ఫస్ట్ టైమ్ అవుతుంది!! అయితే ఓ వారం గ్యాప్ తో మాత్రం వీరిద్దరి సినిమాలో పలు సార్లు బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగాయి.
తొలి ఐదు చిత్రాలతో చిరుని ఢీ కొట్టిన నాగ్!
మెగాస్టార్ చిరంజీవి 1978లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎనిమిదేళ్ళకు అంటే 1986లో అక్కినేని నాగార్జున చిత్రసీమలోకి హీరోగా అడుగుపెట్టారు. చిత్రం ఏమంటే… నాగార్జున నటించి మొదటి ఐదు సినిమాలు… చిరంజీవి చిత్రాలతో పోటీ పడ్డాయి. నాగార్జున హీరోగా నటించిన తొలి చిత్రం ‘విక్రమ్’. దీనికి వి. మధుసూధనరావు దర్శకులు. ఈ సినిమా 1986 మే 23న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సరిగ్గా దాని తర్వాత ఐదు రోజులకే మే 28న చిరంజీవి – కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వేట’ మూవీ రిలీజ్ అయ్యింది. ‘వేట’ పరాజయం పాలు కాగా ‘విక్రమ్’ చక్కని విజయాన్ని అందుకుంది. ఇక చిరంజీవి – జంధ్యాల తొలి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘చంటబ్బాయ్’ మూవీ అదే యేడాది చిరంజీవి బర్త్ డే కానుకగా ఆగస్ట్ 22న విడుదల కాగా… ఆ తర్వాత వారానికే 29వ తేదీ నాగార్జున బర్త్ డేకు ఆయన రెండో సినిమా ‘కెప్టెన్ నాగార్జున’ వచ్చింది. వి. బి. రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా పరాజయం పాలైంది. 1987 జనవరి 1న నాగార్జున మూడో చిత్రం ‘అరణ్య కాండ’ రిలీజ్ అయ్యింది. అదే నెల 9న చిరంజీవి ‘దొంగమొగుడు’ మూవీ విడుదలై, సంచలన విజయం సాధించింది. ఈ సినిమా విడుదలైన ఐదు రోజులకే నాగార్జునతో దాసరి తీసిన ‘మజ్ను’ విడుదలై మ్యూజికల్ హిట్ గా నిలిచింది. నాగార్జున ఐదో చిత్రం ‘సంకీర్తన’ మార్చి 20న విడుదల కాగా, ఆ తర్వాత వారం రోజులకే మార్చి 27న చిరంజీవి ‘ఆరాధన’ చిత్రం రిలీజైంది. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ మ్యూజికల్ హిట్స్ గా పేరు తెచ్చుకున్నాయి. ఆ రకంగా నాగార్జున తొలి ఐదు సినిమాలు చిరంజీవి చిత్రాలతో పోటీ పడటం విశేషమనే చెప్పాలి.
1988లో చిరంజీవి నటించిన ‘రుద్రవీణ’ మూవీ మార్చి 4న విడుదల కాగా ఆ తర్వాత వారమే మార్చి 12న నాగార్జున నటించిన ‘ఆఖరి పోరాటం’ విడుదలై ఘన విజయం సాధించింది. అదే యేడాది జూన్ లోనూ చిరంజీవి, నాగార్జున బాక్సాపీస్ బరిలో పోటీ పడ్డారు. జూన్ 3వ తేదీ నాగార్జున – కోడి రామకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మురళీకృష్ణుడు’ విడుదలైంది. ఆ తర్వాత వారం రోజులకే జూన్ 10న చిరంజీవి ‘ఖైదీ నంబర్ 786’ విడుదలై గ్రాండ్ సక్సెస్ ను నమోదు చేసుకుంది. 1989 జనవరి 14న చిరంజీవి ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ రిలీజ్ కాగా, ఆ తర్వాత ఐదు రోజులకు 19న నాగార్జున ‘విజయ్’ విడుదలై పరాజయం పాలైంది. ఇక చివరిగా వీరిద్దరూ 2006లో మరోసారి బాక్సాఫీస్ బరిలో దిగారు. ఆ యేడాది సెప్టెంబర్ 20న చిరంజీవి ‘స్టాలిన్’ విడుదలైతే, ఆ తర్వాత వారానికి 27న నాగార్జున ‘బాస్’ వచ్చింది. ఇప్పుడూ చిరంజీవి సినిమానే సక్సెస్ అయ్యింది. మళ్ళీ ఇంతకాలానికి ఈ సీనియర్ స్టార్ హీరోలు ఇద్దరూ దసరా బరిలో నిలువబోతున్నారు. మరి అక్టోబర్ 5న రాబోతున్న ‘గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.