Suriya 50: సూర్య 50వ సినిమాగా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?

The Traitors India Season 2 1 300kb

The Traitors India Season 2 1 300kb

Suriya 50: తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పుడు వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. ఒకవైపు మాస్ యాక్షన్ కథలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. అయితే అసలు చర్చ ఇప్పుడే మొదలయింది. సూర్య 50వ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘రోలెక్స్’ తెరకెక్కే అవకాశం ఉందన్న వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం సూర్య చేతిలో వరుస క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూర్య 47’ ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. ‘ఆవేశం’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జితు మాధవన్‌తో సూర్య చేస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఆ తర్వాత టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘సూర్య 48’ కూడా తెరకెక్కుతోంది. ‘జై భీమ్’ తర్వాత సూర్య, జ్ఞానవేల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. కయాదు లోహర్ ఇందులో కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. ఇక సూర్య 49వ సినిమాకు దర్శకుడిగా హెచ్. వినోత్ పేరు దాదాపు ఖరారైనట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. ‘జన నాయకన్’ వంటి భారీ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించిన హెచ్. వినోత్‌తో సూర్య తొలిసారి కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని, వామికా గబ్బి నటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

అయితే వీటన్నింటికంటే సూర్య 50వ సినిమా గురించిన వార్తే ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. సూర్య తన 50వ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమైన ‘రోలెక్స్’ స్టాండలోన్ సినిమాగా ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్’ క్లైమాక్స్‌లో సూర్య కనిపించిన రోలెక్స్ పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉన్నప్పటికీ, సినిమాకే హైలెట్ గా మారింది. డ్రగ్ లార్డ్‌గా సూర్య కనిపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటి నుంచే రోలెక్స్ పాత్రను తీసుకుని ప్రత్యేక సినిమా తీయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఆ డిమాండ్‌కు తగ్గట్టుగానే లోకేష్ కూడా ఈ పాత్రతో సోలో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇటీవల రోలెక్స్ ప్రాజెక్ట్‌పై సూర్య స్వయంగా కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రోలెక్స్ స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. అయితే లోకేష్‌కు ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులు ఉండటంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేనని సూర్య పేర్కొన్నారు. మరోవైపు లోకేష్ కూడా ‘ఖైదీ 2’, ‘విక్రమ్ 2’, రోలెక్స్ వంటి సినిమాలు తన కమిట్‌మెంట్లలో ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. సూర్య, లోకేష్, అనిరుధ్ కాంబినేషన్‌లో రోలెక్స్ లాంటి డార్క్ యాక్షన్ క్రైమ్ కథ వస్తే అది సౌత్ ఇండియన్ సినిమా స్థాయిలో భారీ ఈవెంట్‌గా మారే అవకాశముంది.

సూర్య 50వ సినిమా నిజంగానే రోలెక్స్‌గా తెరకెక్కుతుందా, లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా ఖరారవుతారా, అనిరుధ్ సంగీతం అందిస్తారా అనే విషయాలపై స్పష్టత రావాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే. అయితే ఈ కాంబినేషన్‌పై వస్తున్న వార్తలు మాత్రం సూర్య అభిమానుల్లో ఇప్పటినుంచే భారీ అంచనాలను పెంచుతున్నాయి. ‘విక్రమ్’లో కొన్ని నిమిషాల్లోనే సంచలనం సృష్టించిన రోలెక్స్‌ను పూర్తి స్థాయి కథలో చూడాలనే కల నిజమైతే, సూర్య 50వ సినిమా ఆయన కెరీర్‌లోనే కాదు, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో కూడా ఒక క్రేజీ ప్రాజెక్ట్ గా మారే అవకాశం ఉంది.