Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?

Shaheed

Shaheed

Independence Day Special: ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే ఎక్కడ చూసినా దేశభక్తి గీతాలు మార్మోగుతాయి. దేశభక్తిని ఉట్టిపడేలా చేసే ఈ పాటలు వింటుంటే రోమాలు కూడా నిక్కబొడుచుకుంటాయి. అయితే దశాబ్దాల వెనకే తొలి సినీ దేశభక్తి పాట దేశమంతా మారుమోగిందనే విషయం మీకు తెలుసా ? ఇప్పటికీ ఆపాట వస్తే దేహంలో దేశ భక్తి పొంగుకొస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన మరుసటి ఏడాదే వెండితెరపై వినిపించిన ఆపాట అప్పట్లోనే ప్రజల్లో దేశభక్తి భావనను రగిలించింది. మరి ఆపాట ఏమిటి ? ఎవరు పాడారు ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

దిలీప్ కుమార్ నటించిన ఆ సినిమా, మహమ్మద్ రఫీ ఆలపించిన ఆ గీతం ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచింది. 1948లో విడుదలైన ‘షహీద్’ (Shaheed) హిందీ చిత్రసీమలో దేశభక్తి కథలకు కొత్త ఊపునిచ్చిన చిత్రంగా నిలిచింది. స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో దేశభక్తి ప్రధాన అంశంగా ఉండటంతో అప్పట్లోనే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. దిలీప్ కుమార్ నటనతో పాటు సినిమాలోని ‘వతన్ కీ రాహ్ మే’ పాట దేశభక్తి భావాలను బలంగా ప్రతిబింబించింది. ఈ పాటను ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ ఆలపించారు. ఆయనతో పాటు ఖాన్ మస్తానా కూడా గాత్రం అందించారు. అప్పటి ప్రముఖ సంగీత దర్శకుడు గులాం హైదర్ ఈ గీతానికి స్వరాలు సమకూర్చగా, రాజా మెహందీ అలీ ఖాన్ సాహిత్యం అందించారు. దిలీప్ కుమార్‌పై చిత్రీకరించిన ఈ పాట సినిమా కథలోనే కాకుండా, ఆ కాలం నాటి భారతీయుల భావోద్వేగాల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించింది.

స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే దేశం కొత్త భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న సమయంలో ‘షహీద్’ విడుదలైంది. అందుకే సినిమాలోని దేశభక్తి అంశాలు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాయి. ఈ మూవీ అప్పట్లో మంచి స్పందన అందుకుంది. ముఖ్యంగా ‘వతన్ కీ రాహ్ మే’ పాట ప్రజల్లో దేశభక్తి భావనను మరింత ఉప్పొంగేలా చేసింది. హిందీ చిత్రసీమలో దేశభక్తి సినిమాలు, గీతాలు ఆ తర్వాత ఎన్నో వచ్చాయి. కానీ స్వాతంత్ర్యం అనంతరం తొలినాళ్లలోనే ప్రజల భావోద్వేగాలను నేరుగా తాకిన పాటగా ‘వతన్ కీ రాహ్ మే’కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. అందుకే 78 ఏళ్ల క్రితం వచ్చిన ఈ పాట గురించి స్వాతంత్ర్య దినోత్సవం సమయంలో ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది.

‘షహీద్’ 1948లో విడుదలైన విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందుకోవడంతో సినిమాకు వచ్చిన ఆదరణ మరింత పెరిగింది. అదే సమయంలో దాని పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. వాటిలో ‘వతన్ కీ రాహ్ మే’ ప్రత్యేకంగా నిలిచింది. దిలీప్ కుమార్ తెరపై కనిపించడం, మహమ్మద్ రఫీ గాత్రం, గులాం హైదర్ సంగీతం, రాజా మెహందీ అలీ ఖాన్ సాహిత్యం కలిసి ఈ పాటను హిందీ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే దేశభక్తి గీతంగా మార్చాయి. నేటి తరంలో దేశభక్తి పాటలు కొత్త సంగీతంతో పలు భాషలలో వచ్చినా, స్వాతంత్ర్యం వచ్చిన కేవలం ఏడాది తర్వాత దేశ ప్రజల మనసుల్లో జాతీయ భావనను మేల్కొల్పిన ‘వతన్ కీ రాహ్ మే’ ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన పాటగా గుర్తుండిపోయింది.