Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్‌రూమ్ వార్ అదిరింది

Ikka

Ikka

Ikka Trailer: బాలీవుడ్‌లో కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఉత్కంఠంగా సాగే వాదనలు, చివరి వరకు సస్పెన్స్‌ను కొనసాగించే కథనంతో అలాంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. ఇప్పుడు అదే తరహాలో తెరకెక్కిన ‘ఇక్కా’ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్ నిన్న విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు నటులు మరోసారి ఒకే తెరపై కనిపించనున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దర్శకుడు సిద్ధార్థ్ పి. మల్హోత్రా తెరకెక్కించిన ‘ఇక్కా’ కోర్ట్‌రూమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. గతంలో ‘బోర్డర్’ సినిమాలో కలిసి నటించిన సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచే మంచి హైప్‌ ఏర్పడగా, ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ఆ హైప్‌ను మరింత పెంచింది.

నిన్నరిలీజ్ అయిన ట్రైలర్‌లో అక్షయ్ ఖన్నా ‘శౌర్యమాన్ గౌర్’ అనే పాత్రలో కనిపిస్తారు. ఓ యువతిని హత్య చేయడానికి ప్రయత్నించాడనే ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు న్యాయానికి కట్టుబడి ఉండే ప్రముఖ లాయర్ ‘అర్జున్ మెహ్రా’ సహాయం కోరుతాడు. ఈ పాత్రను సన్నీ డియోల్ పోషించారు. సాధారణంగా నిందితుల తరఫున వాదించని అర్జున్, కొన్ని కారణాల వల్ల శౌర్యమాన్ కేసును తీసుకోవాల్సి వస్తుంది. అర్జున్, శౌర్యమాన్ మధ్య గతంలో ఉన్న సంబంధం ఏమిటి? శౌర్యమాన్ నిజంగా నేరం చేశాడా? లేక అతనిపై కుట్ర జరిగిందా? తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో అర్జున్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు? అనే ప్రశ్నలకు ట్రైలర్ సమాధానం ఇవ్వకుండా సస్పెన్స్‌ను కొనసాగించింది. దాదాపు రెండున్నర నిమిషాల ట్రైలర్ చివరి వరకు ఉత్కంఠను నిలబెడుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రంలో టిల్లోటమా షోమ్, దియా మీర్జా, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కీలక పాత్రలు పోషించారు. కోర్ట్‌రూమ్ డ్రామాతో పాటు సెంటిమెంట్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. అయితే ‘ఇక్కా’ థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రం 2026 జూలై 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులతో పాటు, సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా కాంబినేషన్‌ను మళ్లీ చూడాలనుకునే అభిమానులు కూడా ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.