అదృష్టవంతులను అవకాశాలు అన్వేషిస్తూ వస్తాయంటారు.’ఐకాన్ స్టార్’గా నేడు జనం మదిలో నిలచిన అల్లు అర్జున్ కు తొలి చిత్రంలోనే నవరసాలూ పలికించే అవకాశం లభించింది. బన్నీగా సన్నిహితులు అభిమానంగా పిలుచుకొనే అల్లు అర్జున్ ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. అంతకు ముందు పసితనంలోనే తన తండ్రి అరవింద్ నిర్మించిన ‘విజేత’లో బాలనటునిగా కనిపించినా, తరువాత కమల్ హాసన్ ‘స్వాతిముత్యం’లో తెరపై తళుక్కుమన్నా, ఆపై మేనమామ చిరంజీవి ‘డాడీ’లో డాన్స్ తో భలేగా మురిపించినా, అవేవీ బన్నీకి గుర్తింపు తెచ్చినవి కావు. అతనిలోని నటపిపాసను గుర్తు చేస్తాయంతే! కానీ,’గంగోత్రి’తోనే అల్లు అర్జున్ కథానాయకునిగా తొలిసారి కదం తొక్కారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో బన్నీ తండ్రి అల్లు అరవింద్, ఆయనకు సన్నిహితులైన సి.అశ్వనీదత్ కలసి తమ ‘యునైటెడ్ ప్రొడక్షన్స్’ పతాకంపై ‘గంగోత్రి’ చిత్రాన్ని నిర్మించారు. ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ సైతం ఈ సినిమాతోనే నాయికగా పరిచయం అయ్యారు. ఈ సినిమా 2003 మార్చి 28న జనం ముందు నిలచింది.
‘గంగోత్రి’ కథలోకి అడుగుపెడితే – నీలకంఠం నాయుడు ఓ ఫ్యాక్షనిస్ట్. అతని నమ్మినబంటు నరసింహ. నీలకంఠంకు చాలా ఏళ్ళకు ఓ కూతురు పుడుతుంది. అయితే ఆ పాప జాతక రీత్యా ఆమెకు గంగోత్రి అనే పేరు పెట్టాలని, పదిహేనేళ్ళ తరువాత గంగోత్రిలో అభ్యంగస్నానం చేయించాలని, లేకపోతే దోషాలు ఉంటాయని జ్యోతిషులు చెబుతారు. ఆ పాప ఎవరిని చూసినా ఏడుస్తూ ఉంటుంది. కానీ, నరసింహం కొడుకు సింహాద్రి పాడితే ఆనందిస్తుంది. అలా చిన్నారి గంగోత్రి, సింహాద్రి చిన్నప్పటి నుంచీ అన్యోన్యంగా పెరుగుతారు. అయితే నీలకంఠం అక్క దుర్గమ్మ వారి బంధాన్ని ఎప్పుడూ తప్పుగా చూస్తూ ఉంటుంది. గంగోత్రి కాళ్ళో ముల్లు గుచ్చుకుంటే సింహాద్రి కంట్లో నెత్తురు కారినంతగా బాధపడేవాడు. ఆమెకు ఏది కావాలన్నా సాయం చేయడానికి సిద్ధమయ్యేవాడు. గంగోత్రి రజస్వల కాగానే, ఆమె అత్త సింహాద్రిని దూరం పెడుతుంది. ఇది తెలియని సింహాద్రి ఎప్పటిలాగే వెళతాడు. గంగోత్రి తండ్రి నీలకంఠం తన అక్క మాటలు విని, సింహాద్రిని కొడతాడు. ఈ విషయంలో నరసింహ జోక్యం చేసుకుంటాడు. నమ్మినబంటు నరసింహంనే అనుమానించి, అతని చావుకు కారణమవుతాడు నీలకంఠం. ఆ సమయంలో దూరంగా ఉన్న సింహాద్రికి తరువాత అన్ని విషయాలు తెలుస్తాయి. నీలకంఠమే తన తండ్రి చావుకు కారణమని తెలిసి, అతని ఇంటి ముందు నిలచి, నిజానికి తనకు గంగోత్రికి మధ్య ఏమీ లేదని, కానీ మీ చేతలవల్లే తామిద్దరిలో లేనిపోనివి కల్పించారని అంటాడు. ఏడాదిలోగా గంగోత్రిని పెళ్ళాడతాననీ సింహాద్రి సవాల్ విసరుతాడు. గంగోత్రిలో అభ్యంగన స్నానం చేయడానికి గంగోత్రి వస్తుందని తెలిసి, అక్కడకు వెళతాడు సింహాద్రి. ఇద్దరూ లేచిపోవాలనుకుంటారు. నీలకంఠం మనుషులు వెంటాడుతారు. సింహాద్రిని నీలకంఠం పొడుస్తాడు. అది చూసి, గంగోత్రి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. వారిద్దరి ప్రేమ చూశాక నీలకంఠంలో మార్పు వస్తుంది. కోలుకున్న సింహాద్రి పిల్లనగ్రోవితో చిన్నప్పటి నుంచీ తాను వినిపిస్తున్న పాట వినిపించడంతో గంగోత్రి స్పృహలోకి వస్తుంది. వారిద్దరూ ఒక్కటి కావడంతో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో సింహాద్రిగా అల్లు అర్జున్, గంగోత్రిగా అదితి అగర్వాలో నటించగా, నరసింహగా సుమన్, నీలకంఠం నాయుడుగా ప్రకాశ్ రాజ్, దుర్గమ్మగా తెలంగాణ శకుంతల అభినయించారు. మిగిలిన పాత్రల్లో సీత, ప్రగతి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఎమ్మెస్ నారాయణ, ఏవీయస్, సునీల్, సుబ్బరాయ శర్మ, బెనర్జీ, శోభ, మాస్టర్ తేజ, బేబీ కావ్య కళ్యాణ్ రామ్ నటించారు. ఈ చిత్రానికి చిన్నికృష్ణ రచన చేశారు. ఎమ్.ఎమ్.కీరవాణి బాణీలకు వేటూరి, చంద్రబోస్ పాటలు పలికించారు. “జీవనవాహినీ…”అంటూ సాగే పాట మినహా అన్ని పాటలూ చంద్రబోస్ రాశారు. “ఒక తోటలో…”, “నువ్వు నేను…”, “మామయ్యది మొగల్తూరు…”, “గంగా…నిజంగా…”, “రైలు బండి…” అంటూ సాగే పాటలూ అలరించాయి.
‘గంగోత్రి’ సినిమా అల్లు అర్జున్ ను నటునిగా నిలిపింది. కథానాయకునిగా తొలి చిత్రమే అయినా, డాన్సుల్లోనూ, ఫైట్స్ లోనూ ఎంతో ఈజ్ చూపించారు బన్నీ. ఇందులో అతని పాత్ర నవరసాలనూ పలికించింది. సరదా సన్నివేశాల్లో ఎంత ఈజ్ గా నటించాడో, భావోద్వేగం పలికించే చోట కూడా సత్తా చాటుకున్నారు బన్నీ. మహానటులు, సూపర్ స్టార్స్ గా వెలుగొందిన ఎందరో ‘స్త్రీ పాత్ర’లతో అలరించారు. బన్నీకి మొదటి సినిమాలోనే ఆ అవకాశం దక్కింది. ఇందులో “మావయ్యది మొగల్తూరు…” పాటలో బన్నీ లేడీ గెటప్ లో భలేగా అలరించారు. ఇలా బన్నీ కోసం టైలర్ మేడ్ సబ్జెక్ట్ అన్న రీతిలో ‘గంగోత్రి’ని తీర్చిదిద్దారు కె.రాఘవేంద్రరావు. దాంతో తొలి సినిమాలోనే భళిరా అనిపించారు బన్నీ!
ఈ ఇరవై ఏళ్ళలో బన్నీ నటునిగా ఒక్కోమెట్టూ ఎక్కుతూ తనదైన బాణీ పలికించారు. ‘స్టైలిష్ స్టార్’గా, ‘ఐకాన్ స్టార్’గా ఎదిగారు. ఈ రెండు దశాబ్దాలలో 21 చిత్రాలలో హీరోగా నటించారు. వాటిలో బంపర్ హిట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని పరాజయాలూ చోటు చేసుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు తనను తాను మలచుకుంటూ నేడు ‘ఐకాన్ స్టార్’ అనిపించుకుంటున్నారు బన్నీ. ఆయన చివరగా తెరపై కనిపించిన ‘పుష్ప- ద రైజ్’ తెలుగునాటనే కాదు హిందీలోనూ మురిపించింది. ప్రస్తుతం ‘పుష్ప- ద రూల్’లో నటిస్తున్నారు బన్నీ. ఆ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే యేడాది ‘పుష్ప-2’ జనం ముందుకు రానుంది. ఈ లోగా బన్నీ పాత చిత్రాలతోనే అభిమానులు కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. అందులో తప్పకుండా ‘గంగోత్రి’ ఉంటుందని చెప్పవచ్చు.