Hyderabad Builder Harassing 42 Year Old Actress: సినీ పరిశ్రమ అనేది ఓ గ్లామర్ ప్రపంచం. ఈ ఫీల్డ్‌లో నటీమణులు అందంగా కనిపించేది వృత్తిలో భాగంగానే! అంతే తప్ప.. సినిమాల్లో నటించినట్టుగానే బయట ప్రపంచంలోనూ ఉంటారనుకుంటే, అది మూర్ఖత్వమే అవుతుంది. కొందరు మూర్ఖులుగానే ప్రవర్తిస్తున్నారు కూడా! నటీమణుల్ని లోకువగా చూడటమే కాదు, కామకోరికలు తీర్చమంటూ వేధింపులకు సైతం పాల్పడుతున్నారు! తాజాగా ఓ 42 ఏళ్ల నటికి, అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తన ఫ్యామిలీ ఫ్రెండ్ నుంచే ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ కొనసాగిస్తోన్న ఓ నటి (42).. హైదరాబాద్‌లోని అమీర్‌పేట నాగార్జున నగర్ కాలనీలో ఉంటోంది. ఈమెకు పదిహేనేళ్ల క్రితం పరిచియం అయిన ప్రవీణ్ అనే బిల్డర్.. ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఎనిమిదేళ్ల క్రితం ప్రవీణ్ ఆ నటి వద్ద నుంచి రూ. 47 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తాను త్వరగా ఇచ్చేస్తానని అతడు చెప్పడంతో, అపార్ట్‌మెంట్‌లో ఉండే మరో మహిళ వద్ద నుంచి డబ్బులు తీసుకొని మరీ అతనికిచ్చింది. కానీ.. ప్రవీణ్ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అడిగినప్పుడల్లా ఏవో కారణాలు చెప్తూ, దాటవేస్తూ వస్తున్నాడు. సంవత్సరాలు గడుస్తున్నా, ప్రవీణ్ నుంచి నయా పైసా తిరిగి రాకపోవడంతో ఆ నటి తన డబ్బు తిరిగి ఇవ్వాలని అతనిపై ఒత్తిడి తెచ్చింది.
అప్పట్నుంచి ప్రవీణ్ ఆమెపై పగ పెంచుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. అసభ్యకరమైన మెసేజ్‌లు చేయడం మొదలుపెట్టాడు. తనతో సహజీవనం చేస్తేనే డబ్బులు తిరిగిస్తానని అన్నాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో, మొదట్లో అతని మెసేజ్‌లని ఆమె పట్టించుకోలేదు. కానీ, రానురాను అతను సహజీవనం చేయాల్సిందేనని ఒత్తిడి తీసుకురావడంతో.. బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
