Toxic: టీజర్‌పై ట్రోలింగ్.. యష్ సినిమాపై మౌనం వీడిన హుమా ఖురేషి.. ‘కాస్త ఓపిక పట్టండి’

Toxic (1)

Toxic (1)

Toxic: రిలీజ్ కు ముందే పాన్ ఇండియా సినిమాలకు అంచనాలు పెరగడం సహజమే. కానీ అదే సమయంలో టీజర్, గ్లింప్స్ ఆధారంగా విమర్శలు కూడా వెల్లువెత్తడం ఇటీవలి కాలంలో సాధారణంగా మారిపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది కన్నడ స్టార్ యష్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఇటీవల విడుదలైన టీజర్‌లో కనిపించిన కొన్ని సన్నిహిత సన్నివేశాల కారణంగా సోషల్ మీడియాలో ఈ సినిమాపై ట్రోల్స్ కూడా రకరకాలుగా వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రేక్షకులు సినిమా కంటెంట్‌పై సందేహాలు వ్యక్తం చేస్తుండగా, సెన్సార్ బోర్డు కూడా కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం చెప్పే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నటి హుమా ఖురేషి తొలిసారి ఈ వివాదంపై స్పందించారు.

ఇటీవల ‘ది లల్లన్‌టాప్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన హుమా ఖురేషి, ప్రస్తుతం సోషల్ మీడియా ట్రోల్స్ ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ప్రేక్షకులు పూర్తి సినిమాను చూడలేదని, కేవలం టీజర్ ఆధారంగా నిర్ణయానికి రావడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అసలు సినిమాలో ఏముందో తెలియకముందే దానిపై తీర్పు ఇవ్వడం తొందరపాటు అవుతుందని చెప్పారు. అందుకే ముందుగా సినిమా విడుదలయ్యే వరకు ఓపికగా వేచి చూడాలని ప్రేక్షకులను కోరారు. ఈ సందర్భంగా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌పై కూడా హుమా ప్రశంసలు కురిపించారు. జాతీయ అవార్డు అందుకున్న గీతూ మోహన్‌దాస్ ప్రతిభ గురించి సినీ పరిశ్రమకు ఇప్పటికే బాగా తెలుసని ఆమె అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకురాలు ఇంత భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను తెరకెక్కించడం విశేషమని పేర్కొన్నారు. యష్ లాంటి స్టార్ హీరోతో ఆమె చేస్తున్న ఈ సినిమా తప్పకుండా కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం తనకు ఉందని హుమా వెల్లడించారు.

అలాగే ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటుల ఎంపిక కూడా సినిమాకు మరింత హైప్ పెంచుతోందని ఆమె అన్నారు. యష్‌తో పాటు తారా సుతారియా, కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్ వంటి లేడీ స్టార్స్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారని గుర్తు చేశారు. ఇంతమంది స్టార్ నటీనటులు ఒకే ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారంటే కథలో తప్పకుండా ప్రత్యేకత ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. “కాస్త ఓపిక పట్టండి… సినిమా విడుదలైన తర్వాత మీకే అన్నీ అర్థమవుతాయి” అంటూ అభిమానులకు ఆమె సందేశం ఇచ్చారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ‘టాక్సిక్’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు టీజర్ విడుదల తర్వాత వచ్చిన ట్రోలింగ్స్  సినిమాకు అదనపు ప్రచారాన్ని కూడా తీసుకొచ్చాయి. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి మొత్తం సినిమా విడుదలపైనే ఉంది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌పై వచ్చిన సందేహాలకు సమాధానం చెబుతుందా? గీతూ మోహన్‌దాస్, యష్ కాంబినేషన్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తుందా? అన్నది విడుదల తర్వాతే తేలనుంది.