‘క్రిష్’ చిత్రం విడుదలై పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యేడాది జూన్ 23న ‘క్రిష్ -4’ మూవీ గురించి అధికారిక ప్రకటన చేశాడు హృతిక్ రోషన్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో హృతిక్ తండ్రి, దర్శకుడు రాకేశ్ రోషన్ బిజీగా ఉన్నారు. ‘క్రిష్’ సీరిస్ చిత్రాలన్నింటికీ హృతిక్ పెదనాన్న రాజేష్ సంగీతం అందించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళే ‘క్రిష్ -4’కూ ఆయనే స్వర రచన చేస్తున్నారు. ఈ విశేషాలను రాజేష్ తెలియచేస్తూ, ”నా సోదరుడు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయగానే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెడతాం. అలానే ఈ సినిమాలో ఓ పాటను ఖచ్చితంగా హృతిక్ రోషన్ తో పాడిస్తాం” అని చెప్పారు.
గతంలో హృతిక్ రెండు సినిమాలలో పాటలకు తన గొంతు కలిపాడు. అందులో ఒకటి ‘జిందగీ నా మిలేగీ దొబారా’ కాగా మరొకటి ‘కైట్స్’. సో… ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తమ సొంత చిత్రంలో హృతిక్ పాట పాడబోతున్నాడు. కొత్తగా అందివచ్చిన సాంకేతికతో ‘క్రిష్ 4’ పాటలను వీనుల విందుగా అందిస్తానని రాజేశ్ హామీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే హృతిక్ రోషన్ ప్రస్తుతం తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ లోనూ, దీపికా పదుకొనే ‘ఫైటర్’లోనూ నటిస్తున్నాడు.
