Site icon NTV Telugu

Jane Fonda: 80 ఏళ్ళయినా జేన్ ఫోండా డేటింగ్!

Jane Fonda

Jane Fonda

సుత్తి లేకుండా సూటిగా చెప్పడమే తనకు తెలుసునన అంటున్నారు 85 ఏళ్ళ జేన్ ఫోండా. ఆమె పేరు వినగానే నాజూకు షోకులు సొంతం చేసుకోవాలనుకొనే భామలకు జేన్ ఫోండా పాఠాలు గుర్తుకు వస్తాయి. ఏ వయసులోనైనా ఫిగర్ ను మెయింటెయిన్ చేయడం ఎలా అంటూ జేన్ ఫోండా కొన్ని దశాబ్దాల క్రితమే ఎక్సర్ సైజ్ వీడియోస్ రూపొందించారు. ఈ నాటికీ జేన్ ఫోండా వీడియోస్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. జేన్ ఫోండా ఈ వయసులోనూ ’80 ఫర్ బ్రాడీ’ అనే చిత్రంలో నటించారు. ఇంత వయసులోనూ ఆమె చురుగ్గా నటించారని ఆశ్చర్యపోకండి! ’80 ఫర్ బ్రాడీ’లో నటించిన నలుగురు కూడా 80 ఏళ్ళకు పైబడిన నటీమణులు కావడం విశేషం!

’80 ఫర్ బ్రాడీ’లో నలుగురు వయసు మీరిన మహిళల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ నలుగురు మహిళల్లో జేన్ ఫోండా ఒకరు కాగా, ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ ఫేమ్ రిటా మోరెనో 91 ఏళ్ళ వయసులో నటించారు. 83 ఏళ్ళ లిల్లీ టామ్లిన్ కూడా కీలక పాత్రలో కనిపిస్తారు. అందరిలోకి చిన్నవారెవరంటే ఆస్కార్ అవార్డ్ విజేత శాలీ ఫీల్డ్స్ అనే చెప్పాలి. శాలీ వయసు 76 ఏళ్ళు. కానీ, కథానుగుణంగా అందరూ 80 ఏళ్ళు దాటిన వారిగా కనిపించబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో జేన్ ఫోండా తనదైన బాణీ పలికిస్తూ “ఎవరైనా బ్రేకప్ తీసుకుంటే, అది ఎంత బాధగా ఉంటుందో చెప్పలేం” అన్నారు. గతంలో తాను ఎంతోమంది ఫ్రెండ్స్ తోనూ, భర్తలతోనూ బ్రేకప్ చెప్పినప్పుడు ఆ బాధ ఎలాంటిదో తనకు తెలుసునని చెబుతున్నారు జేన్. తాను 80 ఏళ్ళ దాకా డేటింగ్ చేశాననీ చెప్పుకున్నారామె. అందువల్ల ఎవరైనా బ్రేకప్ చెప్పుకోవాలనుకుంటే, వారికి తానో సలహా ఇస్తాననీ అన్నారామె. ఇంతకీ ఏమిటి ఆ సలహా? చేతి మణికట్టుకు గట్టిగా ఓ రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలట! ‘బ్రేకప్’ గుర్తుకు వచ్చినప్పుడల్లా దానిని ఫట్టుమని లాగి వదలాలట. అప్పుడు ఎదుటివారిపై ఉన్న కోపం, ద్వేషం కరిగిపోతాయనీ జేన్ వివరిస్తున్నారు. ఇది తప్పకుండా పనిచేస్తుందనీ జేన్ ఫోండా చెబుతున్నారు.

Exit mobile version