తెలుగు సినిమా హిట్ అయిందో? లేదో తెలియాలంటే ఒకప్పుడు నంబరాఫ్ డేస్, సెంటర్స్, కలెక్షన్స్ ప్రామాణికంగా ఉండేవి. అయితే కాలక్రమేణా సినిమాల రన్ తగ్గి వసూళ్ళు క్రైటీరియాగా మారాయి. దాంతో ఇప్పుడు కలెక్షన్స్ రికార్డుల ముచ్చటే సాగుతోంది. ఇక ఇప్పుడైతే ఏకంగా తొలి రోజు ఎంత కలెక్ట్ చేసింది… వీకెండ్ లోపు ఎంత వసూలు చేసింది.. ఇదే ప్రధానంగా మారింది. అసలు సినిమాకు క్రేజ్ రావాలంటే ఏం చేయాలనే విషయంలో నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటే చాలు అనే రోజులు పోయాయి. స్టార్ హీరోలకి సైతం ఫస్ట్ షో పడే వరకే లెక్క. టాక్ వైరల్ అయిపోయి మధ్యాహ్నానికి సినిమా హిట్టా? లేక ఫట్టా? అనేది తేలిపోతుంది.
ఇదిలా ఉంటే సినిమాకు హైప్ క్రియేట్ చేయటానికి భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికి పలు మార్గాలను వెతుక్కుంటున్నారు సినీజనం. అందులో ఒకటి యు ట్యూబ్ వ్యూస్. సినిమా ఫస్ట్ లుక్ మొదలు… ప్రతీ పాట… టీజర్… ట్రైలర్… థియేట్రికల్ ట్రైలర్ అంటూ నానా హంగామా చేస్తూ విడుదల చేస్తున్నారు. అవకాశం ఉన్న వారు వాటిని ప్రముఖుల చేతులమీదుగా విడుదల చేయిస్తూ రావటం మామూలై పోయింది. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. సదరు లుక్స్ కి, టీజర్స్ కి, ట్రైలర్ కి, పాటలకు భారీ వ్యూస్ దక్కాయంటూ గంట గంటకు ఊదరగొట్టేస్తూ సోషల్ మీడియాలో డప్పుకొట్టుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
నిర్మాత జేబుకు చిల్లు…
ఈ వ్యూస్ ఎంత ఎక్కువ ఉంటే అంత క్రేజ్ వస్తుందనే నెపంతో ఏకంగా వ్యూస్ ని కూడా కొనుగోలు చేయటం మొదలు పెట్టేశారు. ఈ ఖర్చు కూడా నిర్మాతదేనండోయ్. ఇక్కడ హీరోల ఆసక్తి కూడా బాగా ఉందండోయ్. అభిమానులు, వ్యూయర్స్ నిజాయితీగా లైక్ చేయటం అనేది పక్కన పెడితే గంటకు ఇన్ని మిలియన్స్, 24 గంటల్లో హీరోకి రికార్డ్ అంటూ ఫేక్ గోల ఎక్కువై పోయింది. ఈ విషయంలో పి.ఆర్.వోల హడావుడి అంతా ఇంతా కాదు. ఒక మిలియన్ వ్యూస్ కి లక్షా డెబ్బయి ఐదు వేలు పెట్టి కొనేస్తుంటారు. కేవలం ఈ వ్యూస్ కోసమే నిర్మాతలపై కోట్ల రూపాయలు ఆర్థికభారం పడుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొంత మంది నిర్మాతలకు ఇష్టం లేక పోయినా హీరోగారు చెప్పారు అంటూ పి.ఆర్.వోల హడావుడి. ఫేక్ వ్యూస్ నే నిజమైన వ్యూస్ గా ఊదరగొట్టి పారేస్తుంటారు.
అసలు వ్యూస్ నిజమైనవే అయితే సినిమాలకు ఎందుకు ఆదరణ దక్కటం లేదన్నది ఎవరూ ఆలోచించరు. ఇటీవల విడుదలైన పరాజయం పొందిన స్టార్ హీరోల సినిమాల ఫస్ట్ లుక్ లు, పాటలు, టీజర్స్, ట్రైలర్స్ మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించినవే. మరి ఆ వ్యూస్ లో కొన్ని కూడా టిక్కెట్స్ రూపేణా మారలేదన్నమాట. ఇక్కడే నిజం ఏమిటన్నది బోధపడుతోంది. నిర్మాతలు హీరోలకు భారీ పారితోషికం ఇవ్వటమే కాదు… ఇలా వ్యూస్ కూడా భారీగా కొనుగోలు చేయగలిగే సత్తా కలిగిఉండాలన్నది ప్రాథమిక సూత్రంగా మారింది. ఏ నిర్మాతకూ వ్యూస్ ని ఎందుకు కొనాలి? అని ప్రశ్నించే సత్తా, ధైర్యం లేదు. తమ ప్రొడక్ట్ లో సత్తాఉంటే వ్యూస్ వాటంతట అవే వస్తాయి… డబ్బులు పెట్టి కొనకండి అని చెప్పే నిజాయితీ ఉన్న హీరోలు కూడా లేరు. దీనికి ఫుల్ స్టాప్ లేదా? అంటే… అందరి ఆలోచనా విధానం మారాలి. కోట్లు ఎందుకు వేస్ట్ గా ఖర్చుపెట్టాలి అని నిర్మాతలు, నిర్మాతలపై భారం మోపకూడదని హీరోలు, దర్శకులు ఆలోచించినపుడే ఆ మార్పు సాధ్యం. ఇది జరుగుతుందంటారా!? లెట్స్ వెయిట్ అండ్ సీ…
