Hema Malini: డియోల్ కుటుంబంలో నిజంగానే విభేదాలున్నాయా? తొలిసారి స్పందించిన హేమా మాలిని..

Hema Malini (2)

Hema Malini (2)

Hema Malini: బాలీవుడ్‌లో దశాబ్దాలుగా అభిమానులను ఆకట్టుకుంటున్న కుటుంబాల్లో డియోల్ కుటుంబం కూడా ఒకటి. అయితే ఆ ఫ్యామిలీ గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా హేమా మాలిని, సన్నీ డియోల్, బాబీ డియోల్ మధ్య సంబంధాలపై సోషల్ మీడియాలో తరచూ ఊహాగానాలు వినిపిస్తుంటాయి. అయితే ఈ విషయాలపై ఎక్కువగా స్పందించని హేమా మాలిని, తాజాగా ఓ ఇంటర్వ్యూలో కుటుంబం గురించి మనసు విప్పి మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, బయట ప్రచారం జరుగుతున్న అనేక కథనాలకు తన మాటలతోనే చెక్ పెట్టారు. ఇటీవల హిందీ రష్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమా మాలిని కుటుంబ బంధాలపై మాట్లాడారు. ధర్మేంద్ర తనకు జీవితంలో ఎప్పుడూ ఒకే విషయాన్ని చెప్పేవారని, ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. అదే విలువను తాను ఇప్పటికీ పాటిస్తున్నానని చెప్పారు. వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా బయట మాట్లాడకపోయినా, కుటుంబం విషయంలో తాము ఎప్పుడూ ఒకటిగానే ఉంటామని ఆమె స్పష్టం చేశారు.

సన్నీ డియోల్, బాబీ డియోల్‌లతో తన సంబంధం గురించి అడిగిన ప్రశ్నకు కూడా హేమా మాలిని సూటిగా సమాధానం ఇచ్చారు. వారిద్దరూ ఎంతో మంచి మనసున్న వ్యక్తులని, ముఖ్యంగా బాబీ చాలా సున్నితమైన వ్యక్తి అని ప్రశంసించారు. తాము తరచూ కలుస్తూనే ఉంటామని, అయితే ఆ విషయాలను బయట ప్రచారం చేయాలనే ఉద్దేశం తమకు ఉండదని చెప్పారు. తమ కుటుంబం ఎప్పుడూ ఆర్భాటాలకు దూరంగా ఉంటుందని, అందుకే బయటివారికి అనేక అపోహలు కలుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. తమ మధ్య గాఢమైన అనుబంధం ఉందని, తాము ఒక సంతోషకరమైన కుటుంబంగా జీవిస్తున్నామని స్పష్టం చేశారు. ధర్మేంద్ర వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ మీడియా ముందుకు తీసుకురావాలని కోరుకునే వ్యక్తి కాదని కూడా హేమా మాలిని తెలిపారు. కుటుంబ విషయాలు కుటుంబంలోనే ఉండాలని ఆయన ఎప్పుడూ భావించేవారని చెప్పారు. అందుకే తమ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు బయటకు పెద్దగా రాలేదని ఆమె వివరించారు.

ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఒకప్పుడు బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటీమణుల్లో మీరు ఒకరని అడగగా, హేమా మాలిని ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను ఎప్పుడూ డబ్బు కోసం సినిమాలు చేయలేదని, నిర్మాతలు, దర్శకులు తనపై నమ్మకంతో అవకాశాలు ఇచ్చేవారని చెప్పారు. పేరు, గుర్తింపు పెరిగే కొద్దీ పారితోషికం కూడా క్రమంగా పెరిగేదని, కానీ ప్రస్తుతం హీరోయిన్లు అందుకుంటున్న స్థాయి రెమ్యునరేషన్‌తో అప్పటి పరిస్థితులను పోల్చలేమని వివరించారు. తమ కాలంలో నటీనటులు ఇప్పుడు వినిపిస్తున్నంత భారీ మొత్తాలు అందుకోలేదని కూడా వెల్లడించారు. హేమా మాలిని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సన్నీ డియోల్, బాబీ డియోల్‌ల గురించి ఆమె చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. చాలా కాలంగా డియోల్ కుటుంబంలో విభేదాలున్నాయనే ప్రచారానికి ఆమె మాటలు ఒక ముగింపును తెసుకొచ్చినట్లే కనిపిస్తోంది.