NTV Telugu Site icon

Experimental film: సింగిల్ క్యారెక్టర్ తో ‘హలో మీరా’!

Hello Meera

Hello Meera

Gargeyi Yellapragada: సింగిల్ క్యారెక్టర్ తో మూవీ తీయడమంటే కత్తిమీద సాము. అలాంటి పనికి సిద్ధపడ్డారు డైరెక్టర్ శ్రీనివాసు కాకర్ల. ప్రముఖ దర్శకులు బాపు సినిమాలకు సహ దర్శకుడిగా వ్యవహరించిన అనుభవం, దశాబ్దాల తరబడి తెలుగు, హిందీ చిత్రసీమతో ఉన్న అనుబంధం కారణంగా ఆయన ఈ సాహసానికి ఒడిగట్టారు. అలా రూపుదిద్దుకున్నదే ‘హలో మీరా’ చిత్రం. ‘ఎవరికీ చెప్పొద్దు’ సినిమాతో కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గార్గేయి యల్లాప్రగడ ‘హలో మీరా’లోని సింగిల్ క్యారెక్టర్ ను పోషించింది. సహజంగా రెండు మూడు క్యారెక్టర్స్ ఉన్న సినిమాలను సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో తీసేసి, దర్శక నిర్మాతలు సేఫ్ గేమ్ ఆడుతుంటారు. కానీ శ్రీనివాసు కాకర్ల ‘హలో మీరా’ను అందుకు భిన్నంగా ఓ ఫ్యామిలీ డ్రామాగా మలిచారు. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో డాక్టర్ లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల దీనిని నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. చిన్న మ్యూజిక్ అందించారు. ప్రశాంత్ కొప్పినీడి సినిమాటోగ్రఫీ, రాంబాబు మేడికొండ ఎడిటింగ్ బాధ్యతలు నెరవేర్చారు. హిరణ్మయి కళ్యాణ్‌ సంభాషణలు సమకూర్చారు.

ఈ కథ గురించి దర్శకుడు శ్రీనివాసు కాకర్ల వివరిస్తూ, “రెండేళ్ళుగా ప్రేమిస్తున్న కళ్యాణ్ ను పెళ్ళి చేసుకోవడానికి మీరా సిద్ధపడుతుంది. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న మీరా పెళ్ళి ఏర్పాట్లలో భాగంగా సొంతవూరు విజయవాడకు వెళుతుంది. రేపు ఉదయం ఆమెను పెళ్ళికూతురు చేస్తారనగా, హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది. గతంలో మీరా ప్రేమించిన సుధీర్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడని, సూసైడ్ నోట్ లో ఆమె పేరును రాశాడని, వెంటనే హైదరాబాద్ రమ్మని ఎస్.ఐ. విక్రమ్ చెబుతాడు. దాంతో ఇంటికి చేరాల్సిన మీరా… కారును యూటర్న్ తిప్పి, హైదరాబాద్ హైవే మీదకు పోనిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ చిత్రకథ” అని అన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, లిరికల్ వీడియో ‘హలో మీరా’పై అంచనాలను పెంచాయని, వైవిధ్యభరితమైన కథతో, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఈ మూవీ థ్రిల్ కు గురిచేస్తుందనే ఆశాభావాన్ని దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికెట్ పొందిన ‘హలో మీరా’ ఈ నెల 21న విడుదల అవుతోంది.