Harshad Chopra: ప్రేమకు జీవితాన్ని అందంగా మార్చే శక్తి ఉంటే, అదే ప్రేమలో ఎదురయ్యే ద్రోహం కూడా మనిషిని పూర్తిగా మార్చేయగలదు. కాలం గడిచినా కొన్ని గాయాలు మానవు. కొన్ని జ్ఞాపకాలు మనసును వదిలిపోవు. ప్రముఖ టెలివిజన్ నటుడు హర్షద్ చోప్రా జీవితంలో కూడా అలాంటి ఓ చేదు అనుభవం మిగిలిపోయిందని ఆయన వెల్లడించారు. 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్నకు ‘లాకప్ సీజన్ 2’ రియాలిటీ షోలో ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షోలో తనని మరో పోటీదారు శ్రేయా కల్రా పెళ్లి గురించి ప్రశ్నించగా, ఒకప్పుడు తన జీవితాన్ని పంచుకోవాలనుకున్న వ్యక్తి తన జీవితంలోకి వచ్చారని, అయితే తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని హర్షద్ తెలిపారు. ప్రేమలో నమ్మకం దెబ్బతిన్న తర్వాత మరోసారి అదే బంధంలోకి అడుగుపెట్టేందుకు తన మనసు సిద్ధంగా లేదని చెప్పారు. ప్రస్తుతం ఒంటరిగా జీవించడంలోనే తనకు ప్రశాంతత దొరికిందని ఆయన వెల్లడించారు.
‘లాకప్ సీజన్ 2’ ప్రీమియర్ ఎపిసోడ్‌లో హర్షద్ తన వ్యక్తిగత జీవితంలోని బాధాకరమైన సంఘటనను పంచుకున్నారు. 2010లో తన మాజీ ప్రేయసి, తన ప్రాణ మిత్రుడితో కలిసి తనను మోసం చేశారని చెప్పారు. ఆ ఘటనతో ఒకేసారి ప్రేమించిన వ్యక్తిని, ప్రాణ స్నేహితుడిని కోల్పోయానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సంఘటన తర్వాతే తన పర్సనల్ జీవితాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకోరనే విమర్శలు గతంలో చాలాసార్లు ఎదురైనా, వాటి వెనుక ఉన్న అసలు కారణాన్ని ఇప్పుడు హర్షద్ వివరించారు. ఆ సంఘటన తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని, అందుకే వ్యక్తిగత జీవితాన్ని అందరికీ దూరంగా ఉంచుతున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ స్పందిస్తున్నారు.

