Site icon NTV Telugu

HBD Prakash Raj : దటీజ్… ప్రకాశ్ రాజ్!

Prakash-raj

(మార్చి 26న ప్రకాశ్ రాజ్ పుట్టినరోజు)
భయపెట్టాడు… నవ్వించాడు… కవ్వించాడు… ఏడ్పించాడు… ఏది చేసినా తనదైన బాణీ పలికించారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. వందలాది చిత్రాలలో తనదైన అభినయంతో అలరించిన ప్రకాశ్ రాజ్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య జరిగిన ‘మా’ ఎన్నికల సమయంలోనూ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుల జాబితాలో ఆయన పేరు చోటు చేసుకోవడంతోనూ ప్రకాశ్ రాజ్ గురించిన చర్చలు సాగుతున్నాయి.

ప్రకాశ్ రాజ్ 1965 మార్చి 26న కర్ణాటకలో బెంగళూరులో జన్మించారు. పుట్టింది కన్నడనాటనే అయినా, ఆయనకు తెలుగులోనే విశేషాదరణ లభించింది. తెలుగు చిత్రాల్లో మొదట అంతగా ప్రాధాన్యం లేని పాత్రల్లోనూ కనిపించారు. ఏ.ఎమ్.రత్నం రూపొందించిన ‘సంకల్పం’లో ప్రతినాయకునిగా ఆకట్టుకున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి ‘వినోదం’లో చిన్న పాత్రే అయినా ఇట్టే ఆకట్టుకొనేలా నటించేసి మార్కులు కొట్టేశారు. ఆ పై ‘సుస్వాగతం’లో “నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు…” అంటూ ఆయన మురిపించిన తీరునూ జనం మరచిపోలేరు. తన కంటే వయసులో పెద్దవారికి తండ్రిగా, మామగానూ నటించేసి ప్రత్యేకత చాటుకున్నారు. ఒకానొక సమయంలో తెలుగు సినిమాల్లో అధిక శాతం ఆయన హీరోకో, హీరోయిన్ కో తండ్రిగా నటించేసి, ఓ నాటి గుమ్మడిని గుర్తు చేశారు.

ప్రకాశ్ రాజ్ విలక్షణ నటులే కాదు, వ్యక్తిత్వంలోనూ ఆయన విలక్షణత చూపిస్తారు. నచ్చని విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. ముక్కుసూటిగా సాగే తత్వం. కన్నడ నాట జరిగిన జర్నలిస్ట్ హత్యను ఖండిస్తూ, కేంద్రాన్నే నిలదీస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు. సినిమా రాజకీయాలనూ వేడెక్కించారు. ఏది చేసినా ప్రకాశ్ రాజ్ తన వ్యక్తిత్వంతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. అదే ఆయన స్పెషాలిటీ!

కరోనా కల్లోల సమయంలో ప్రకాశ్ రాజ్ ఎంతోమందికి సాయం అందించారు. చదువుకొనే పేదవారికి చేతనైన సహాయం చేయడంలోనూ, కష్టాల్లో ఉన్నారని తెలిసిన వారిని స్వచ్ఛందంగా ఆదుకోవడంలోనూ ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ ముందుంటారు. ఉత్తమ గుణచిత్ర నటునిగా, ఉత్తమ నటునిగా జాతీయ అవార్డులు అందుకున్న ప్రకాశ్ రాజ్ కీర్తి కిరీటంలో మరెన్నో మేలిమి రత్నాల్లాంటి అవార్డులూ, రివార్డులూ చోటు చేసుకున్నాయి. భావి నటులకు స్ఫూర్తినిస్తూ సాగుతున్న ప్రకాశ్ రాజ్ మునుముందు మరిన్ని మంచి పాత్రలతో అలరిస్తారని ఆశిద్దాం.

Exit mobile version