NTV Telugu Site icon

నేటికీ ఆయన… ‘అంకురం’ ఉమామహేశ్వరరావు!

umamaheswara-rao

(జనవరి 24న సి.ఉమామహేశ్వరరావు పుట్టినరోజు)
తెలుగు చిత్రసీమలో అభిరుచి గలిగి, ఏ నాడూ రాజీపడని దర్శకులు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో సి.ఉమామహేశ్వరరావు చోటు సంపాదించారు. ‘అంకురం’ ఉమామహేశ్వరరావుగా జనం మదిలో స్థానం దక్కించుకున్నారాయన. సదా విలువలకు పెద్ద పీట వేస్తూ సాగారాయన. బహుశా, అందువల్లేనేమో సి.ఉమామహేశ్వరరావు కమర్షియల్ సక్సెస్ ను అంతగా సొంతం చేసుకోలేక పోయారు అనిపిస్తుంది.

తెలుగునేలపై కృష్ణమ్మ ఒడిలో 1952 జనవరి 24న కన్ను తెరచిన సి.ఉమామహేశ్వరరావు ఆ తల్లి గలగలలు వింటూ సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్నారు. చేతికి చిక్కిన పుస్తకమల్లా చదివి ఆనందించేవారు. అదే ఆయనలో కళల పట్ల ఆకర్షణ పెంచిందనీ చెప్పవచ్చు. చదువుకొనే రోజుల్లోనే కవితలు, కథలు రాసి ఆనందించేవారు. అభ్యుదయ భావాలు తొణికిసలాడేవి. ఆపై నాటక రచన కూడా సాగించారు. ఆ సమయంలోనే ఆయన మనసు సినిమా రంగంవైపు పరుగులు తీసింది. సినిమా రంగాన్ని పరిశీలించి, కొంత అనుభవం సంపాదించాక ‘పూలపల్లకి’ చిత్రంతో దర్శకుడయ్యారు ఉమామహేశ్వరరావు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. తరువాత ‘పదండి ముందుకు’ చిత్రాన్ని తెరకెక్కించారు. అభిరుచి గల దర్శకుడు అన్న పేరు సంపాదించారు. తరువాత ఆయన మదిలో ‘అంకురం’ మొలిచింది. రచయిత తనికెళ్ళ భరణితో కలసి ‘అంకురం’కు నీరు పోశారు. అప్పటికి మానవహక్కులపై రూపొందిన తొలి చిత్రంగా ‘అంకురం’ నిలచింది. ఇందులోని కథ, కథనం సగటు ప్రేక్షకుణ్ణి సైతం ఆకట్టుకున్నాయి. జనాన్ని ఆలోచింప చేసిందీ చిత్రం. ఇందులోని సీతారామశాస్త్రి రచన చేసిన “ఎవరో ఒకరు… ఎపుడో అపుడు… నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు..” అనే పాట హంసలేఖ స్వరకల్పనలో కథకు తగ్గట్టుగా ఒదిగిపోయింది. అందుకే ఈ నాటికీ పలు సందర్భాల్లో ‘అంకురం’లోని ఆ గీతం జనం మదిని తడుతూనే ఉంటుంది. ఈ చిత్రం ద్వారా ఉత్తమ దర్శకునిగా ఉమామహేశ్వరరావుకు నంది అవార్డు లభించింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డూ దక్కింది.

‘అంకురం’ విజయంతో పాటు ఉమామహేశ్వరరావుకు మంచి పేరు సంపాదించిపెట్టింది. ‘అంకురం’ ఆయన ఇంటి పేరుగా మారింది. తరువాత ‘సిందూర’ అనే మళయాళ చిత్రాన్ని తెరకెక్కించారు ఉమామహేశ్వరరావు. మణిరత్నం ‘రోజా’తో విశేషంగా పేరు తెచ్చుకున్న హీరో అరవింద్ స్వామి, ఉమామహేశ్వరరావు ‘మౌనం’ చిత్రంలో నటించడమే కాదు, ఆ సినిమాను నిర్మించారు కూడా. నగ్మా నాయికగా రూపొందిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. తమిళంలో ఈ సినిమా ‘మౌన యుద్ధం’గానూ, హిందీలో ‘మౌన్’గానూ విడుదలయింది. ఇక మన సమాజంలోని మరో దుశ్చర్యను నిరసిస్తూ ‘శ్రీకారం’ సినిమా తెరకెక్కించారు ఉమామహేశ్వరరావు. అది పరాజయం పాలయింది. మమ్ముట్టి, సుమన్, నగ్మాతో ‘సూర్యపుత్రులు’ రూపొందించారు. అది కూడా అంతగా అలరించలేకపోయింది. దాదాపు ఏడేళ్ళ తరువాత ‘అవునా’ అనే సినిమా రూపొందించారు. ఫలితం షరామామూలే అన్నట్టు అపజయం పలకరించింది. ఆయన రూపొందించిన ‘ఇట్లు అమ్మ’ అనే చిత్రం సోనీ లైవ్ లో విడుదలయింది.

‘మంచు బొమ్మ’ అనే టెలీ ఫిలిమ్ రూపొందించారు. అది ఈ టీవీలో ప్రసారమయింది. ‘హమ్ సఫర్’ అనే హిందీ టెలీ ఫిలిమ్ కూడా ఉమా మహేశ్వరరావు దర్శకత్వంలో వెలుగు చూసింది. ‘స్త్రీ’ అనే డాక్యుమెంటరీ రూపొందించారు. దాంతో పాటు మరికొన్ని డాక్యుమెంటరీస్ కూడా ఆయన నిర్దేశకత్వంలో తెరకెక్కాయి. 2015లో ‘ఫిలిమ్ ఏస్తెటిక్స్’పై 15 ఎపిసోడ్స్ రూపొందించారు. ఇప్పటికీ అనుక్షణం సినిమాపైనే ధ్యానం నిలిపి, దానినే శ్వాసిస్తూ ఏదో ఒకరీతిన చలనచిత్రాలతో పాలు పంచుకుంటూ సాగుతున్నారు ఉమామహేశ్వరరావు.