NTV Telugu Site icon

విలక్షణ నటదర్శకుడు రవిబాబు

ravibabu

(జనవరి 24న రవిబాబు పుట్టినరోజు)
నటదర్శకుడు రవిబాబును చూడగానే విలక్షణంగా కనిపిస్తారు. ప్రముఖ నటుడు చలపతిరావు కుమారుడే రవిబాబు. తండ్రి నటనలో రాణిస్తే తాను ఎంచక్కా ఎమ్.బి.ఏ. చదివి విదేశాలకు వెళ్ళి వేరే రూటులో సాగాలనుకున్నారు రవిబాబు. అయితే సినిమా వారబ్బాయి కదా, సినిమారంగమే రవిని అక్కున చేర్చుకుంది. పూనేలో ఎమ్.బి.ఏ. పూర్తిచేసిన రవికి ఓ ఆఫ్ బీట్ మూవీకి అసోసియేట్ గా పనిచేసే అవకాశం లభించింది. దాంతో సినిమాపై ఆకర్షణ పెరిగింది.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ రాజీవ్ మీనన్ వద్ద అసోసియేట్ గా పనిచేసిన రవిబాబుకు సినిమాటోగ్రఫిపై మోజు కలిగింది. దాంతో అమెరికా వెళ్ళి అక్కడ మైనేలో సినిమాటోగ్రఫిలో వర్క్ షాప్ లో చేరాడు రవి. అటు నుంచి ఎడిటింగ్ పై మనసు మళ్ళింది. అందులోనూ వేలు పెట్టారు. చివరకు ఓ షార్ట్ ఫిలిమ్ తెరకెక్కించారు. అదే సమయంలో డి. రామానాయుడుకు రవిబాబులోని ప్రతిభ గురించి తెలిసింది. పిలిచి అవకాశం ఇవ్వాలనుకున్నారు. ఈ లోగా దాసరి నారాయణరావు తన తనయుడు అరుణ్ కుమార్ ను హీరోగా పెట్టి ‘గ్రీకువీరుడు’ ఆరంభించారు. అందులో రవిబాబుకు కీలక పాత్రనిచ్చారు. ఇది తెలిసిన ఇ.వి.వి. సత్యనారాయణ తన ‘మావిడాకులు’లో మరో కీ రోల్ లో రవిబాబును నటింపచేశారు. ఇలా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటిలా సాగింది రవిబాబు పరిస్థితి.

పలు చిత్రాలలో విలన్ గా, కమెడియన్ గా మెప్పించిన తరువాత మళ్ళీ సినిమా డైరెక్షన్ పై మనసు పారేసుకున్నారు రవి. ఆ సమయంలో రామానాయుడు తనయుడు సురేశ్ బాబు, రవికి అవకాశం కల్పించారు. ఆ ప్రయత్నంలో రూపొందిన చిత్రమే ‘అల్లరి’. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడుగా రవిబాబే వ్యవహరించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన ఇ.వి.వి. సత్యనారాయణ చిన్నకొడుకు నరేశ్ ఆపైన ‘అల్లర’నే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. డైరెక్టర్ ఇ.వి.వి. నటుడిగా రవికి అవకాశమిస్తే, డైరెక్టర్ కావాలనుకున్న ఆయన కొడుకు నరేశ్ ను హీరోగా చేశారు రవిబాబు. ‘అల్లరి’ తరువాత నరేశ్ మరి వెనుదిరిగిచూసుకోలేదు. రవిబాబు కూడా డైరెక్టర్ గా ముందుకు సాగారు.

ఇప్పటి దాకా రవిబాబు దాదాపు 75 పైచిలుకు చిత్రాలలో నటించారు. 12 చిత్రాలను రూపొందించారు. వాటిలో కొన్నిటిని నిర్మించారు. “అనసూయ, నచ్చావులే, అమరావతి, అవును” వంటి చిత్రాలతో దర్శకునిగా జనాన్ని అలరించారు రవి. తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించడం రవిబాబు అలవాటు. ఆయన తాజా చిత్రం ‘క్రష్’ ఓటీటీలో వెలుగు చూసింది. మరీ శృంగారం పాలు ఎక్కువగా ఉందని జనం అన్నారు. ఏది చేసినా విలక్షణంగా చేయడమే రవిబాబుకు తెలిసిన విద్య. మళ్ళీ ఏ కొత్త సినిమాతో రవిబాబు ప్రేక్షకులను పలకరిస్తారో చూడాలి.